సరదాలుపోయి.. తగాదాలు వస్తున్నాయా?.. ఈ అనుభూతి దేనికి సంకేతమంటే..

by Dishafeatures2 |
సరదాలుపోయి.. తగాదాలు వస్తున్నాయా?.. ఈ అనుభూతి దేనికి సంకేతమంటే..
X

దిశ, ఫీచర్స్ : వివాహ బంధంతో ఒక్కటై స్త్రీ, పురుషులు కలిసి జీవించడానికి వేసే తొలి అడుగులు ‘హనీ మూన్ పీరియడ్’తో ప్రారభం అవుతాయి. ప్రణాళికలు లేని విహార యాత్రలతో, కలయికలతో భాగస్వాములు సరదాగా సాగిపోతుంటారు. లవ్ అండ్ రొమాంటిక్ లైఫ్‌లో ప్రతిదీ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. కానీ కొంత కాలం తర్వాత ఆ పరిస్థితి ఉండదు. శృంగారం, ప్రేమ, ఆప్యాయత లోపించిన భావన కలుగుతుంది. ఈ ఫీలింగ్ ఎక్కువ కావడాన్నే ‘రూమ్‌మేట్ సిండ్రోమ్’గా పేర్కొంటున్నారు నిపుణులు.

పరస్పర నిర్లక్ష్యం

ఒకప్పుడు వంట గదిలో కూడా సరదా సరదాగా గడపడంలో పోటీపడిన భాగస్వాములు కొంత కాలానికి చెత్తను ఎవరు తీయాలని గొడవ పడుతుంటారు. అంటే ఇక్కడ ఒకే రూములో కలిసి ఉంటున్న ఇద్దరు స్నేహితులు పని విషయంలో తగాదా పడినట్లు వ్యవహరిస్తుంటారు. అందుకే ఈ పరిస్థితి ‘రూమ్‌మేట్ సిండ్రోమ్’గా పరిగణిస్తారు. మొదట్లో శృంగార భరితంగా అనిపించిన జీవితం, రూమ్‌మేట్ సిండ్రోమ్ బారిన పడ్డాక రొటీన్‌గా అనిపిస్తుంది. ఈ దశలో భావోద్వేగ మద్దతును, లైంగిక సాన్నిహిత్యాన్ని పరస్పరం లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు నిర్లక్ష్యం చేస్తుంటారు.

రుగ్మతకు దారితీసే లక్షణాలు

రూమ్‌మేట్ సిండ్రోమ్ భాగస్వాముల జీవితాన్ని ప్రభావితం పలు సంకేతాలు, లక్షణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే.. శారీరక సాన్నిహిత్యం లేకపోవడం, ఎమోషనల్ కలెక్షన్ తగ్గడం, భాగస్వామి అవసరాలు, కోరికల పట్ల ఉదాసీనత వంటివి కనిపిస్తాయి. అలాగే సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయకపోవడం, కలిసి ఉంటున్నప్పటికీ వేర్వేరుగా గడపడం, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకోకపోవడం కూడా రూమ్ మేట్ సిండ్రోమ్ లక్షణాల్లో భాగంగా నిపుణులు పేర్కొంటున్నారు.

ఎలా అధిగమించాలి ?

రూమ్‌మేట్ సిండ్రోమ్ అనేది బంధాన్ని బలహీన పర్చకుండా ఉండాలంటే భాగస్వాములు దానిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చిన్న చిన్న తగాదాలను, ఇబ్బందికర సందర్భాలను ఎక్కువకాలం కొనసాగించవద్దు. కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. భావాలు, కోరికలు, ఆందోళనల గురించి పరస్పరం చర్చించుకోవాలి. శారీరక, మానసిక సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించడం, కొనసాగించడం, కలిసి జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవడం, పరస్పర గౌరవంతోపాటు పర్సనల్ స్పేస్ కూడా కలిగి ఉండటం వంటివి ఆచరణలో పెట్టడం ద్వారా రూమ్‌మేట్ సిండ్రోమ్ రుగ్మత నుంచి బయటపడవచ్చు.

Next Story

Most Viewed