ప్రచార ఊసేదీ.. కంటోన్మెంట్ కమలంలో నిస్తేజం

by Disha Web Desk 23 |
ప్రచార ఊసేదీ.. కంటోన్మెంట్  కమలంలో నిస్తేజం
X

దిశ, కంటోన్మెంట్ : ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దూసుకు వెళ్లిపోతుంటే .. కంటోన్మెంట్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి మాత్రం వెనుకంజలో ఉన్నారు. పోలింగ్ దగ్గర పడుతున్నా.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తిలక్ ఎన్నికల ప్రచారంలో చతికిల పడుతున్నట్లు కనిపిస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతల నుంచి సహకారం కొరవడడంతో పాటు ఓటమిని ముందుగానే ఊహించి ప్రచారం చేయడం లేదని ప్రత్యర్థి వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఫలితంగా క్యాడర్ లోనూ నిస్తేజం అవహించి ప్రచార సందడే కరువైంది. కాంగ్రెస్,బీఆర్ఎస్ కు బీజేపీ పార్టీ పోటీ ఇవ్వడం సంగతి పక్కన పెడితే.. కనీసం ప్రచారం కూడా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కంటోన్మెంట్ కమలంలో నిస్తేజం..

పోలింగ్ సమయం దగ్గర పడుతోంది.కానీ కంటోన్మెంట్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కంటే బీజేపీ అభ్యర్థి ప్రచారంలో వెనుకంజలోనే ఉన్నారు. ఎన్నికల ప్రచారాన్ని భుజాన వేసుకోవాల్సిన కొందరు నేతలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయి నేతలు మాత్రమే అప్పుడప్పుడు ప్రచారం చేసి వెళ్లుతున్నారు. వారు కూడా మల్కాజ్ గిరి పార్లమెంట్ గురించే మాట్లాడుతున్నారు తప్ప..కంటోన్మెంట్ ప్రస్తావనం తీయకపోవడం బీజేపీ శ్రేణుల్లో ఒకింత అసహనం నెలకొన్నది. అసలు కంటోన్మెంట్ లో బరిలో ఉన్నామా..? అంటే ఉన్నాం.. ! అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు తప్ప అభ్యర్థి వంశ తిలక్ లో సీరియస్ నెస్ కనిపించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కంటోన్మెంట్ లోని కొందరు కీలక నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం లేదు. అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలను కాషాయ పార్టీ చేయకపోవడంతో నేటికి నేతలు ఎవరికి వారే..! అన్నట్లు వ్యవహారిస్తున్నారు. ప్రచార సందడి లేక క్యాడర్ లోను నిస్తేజం అలుముకోవడంతో నేతలపై పార్టీ శ్రేణులు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నాయి.

Next Story

Most Viewed