ఈజిప్టు పిరమిడ్స్ నిర్మాణం వెనుక విస్తుపోయే రహస్యం.. టన్నుల బరువున్న రాతిబండల తరలింపుకు అసలు కారణం అదే..

by Sujitha |
ఈజిప్టు పిరమిడ్స్ నిర్మాణం వెనుక విస్తుపోయే రహస్యం.. టన్నుల బరువున్న రాతిబండల తరలింపుకు అసలు కారణం అదే..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని ఎనిమిది వింతల్లో ఈజిప్ట్ పిరమిడ్స్ ఒకటి. అయితే వీటి నిర్మాణం ఎలా జరిగిందనేది ఇప్పటికీ పరిశోధకులు అంచనా వేయలేకపోతున్నారు. ఇంత టెక్నాలజీ కలిగిన ఈ రోజుల్లోనే రెండు టన్నుల కన్నా ఎక్కువ బరువును తరలించడం కష్టమైన పని. కానీ 4500 సంవత్సరాల క్రితం ఇదంతా ఎలా సాధ్యమైందనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నే. ఉదాహరణకు గ్రేడ్ పిరమిడ్ ఆఫ్ గిజాలో దాదాపు 2.3 మిలియన్ల రాక్ బ్లాక్స్ ఉన్నాయని అంచనా. కాగా ప్రతీ రాయి సగటున 2.3 మెట్రిక్ టన్నుల బరువు ఉండొచ్చని చెప్తున్నారు. కానీ యాంత్రిక పరికరాలు లేకుండా ఇలాంటి భారీ వస్తువులను తరలించడం ఎలా సాధ్యమైందంటే కొందరు గ్రహాంతర వాసుల హెల్ప్ తీసుకోవచ్చని ఇంతకు ముందు అనుమానించారు. అయితే తాజా అధ్యయనం నైలు నది వల్లే ఇదంతా జరిగిందని గుర్తించింది.

ఈజిప్ట్‌లోని చాలా పిరమిడ్‌లు గిజా, లిష్ట్ గ్రామాల మధ్య 50 కిలోమీటర్ల మేర సహారా ఎడారిలో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రదేశాలు నైలు నదికి అనేక కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అయితే ఈ నది ఒకప్పుడు పిరమిడ్‌లకు దగ్గరగా ఉండే అవకాశం ఉందని ఈజిప్టు శాస్త్రవేత్తలు చాలా కాలంగా అనుమానిస్తున్నారు.నిజానికి సాహిత్య ఆధారాలు కూడా ఇదే సూచిస్తున్నాయి. కాగా మే 16న కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం నైలు నది అంతరించిపోయిన ప్రధాన శాఖలోని భాగాలను గుర్తించింది. ఇది పిరమిడ్‌ల ప్రక్కనే ఉండేదని, వాటి నిర్మాణాలకు భారీ వస్తువులను తరలించడానికి ఉపయోగించబడిందని తెలిపింది.

జియోమార్ఫాలజిస్ట్ ఎమాన్ ఘోనిమ్ నేతృత్వంలోని బృందం ఇందుకోసం రాడార్ ఉపగ్రహ చిత్రాలు, చారిత్రక పటాలు, జియోఫిజికల్ సర్వేలు, సెడిమెంట్ కోరింగ్‌ను ఉపయోగించింది. ఇసుక తుఫానులు, కరువు కారణంగా వేల సంవత్సరాల క్రితం నది పూడి పోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నైలు నది శాఖను అహ్రామత్‌గా గుర్తించిన పరిశోధకులు .. దాదాపు 64 కిమీ పొడవు, 200-700 మీటర్లు వెడల్పు, 2-8 మీటర్ల లోతు ఉండొచ్చని తెలిపారు. ఇదే నదీ తీర నౌకాశ్రయంగా పనిచేసిందని, పిరమిడ్ నిర్మాణానికి అవసరమైన రాళ్లను తరలించేందుకు ఉపయోగించబడిందని వివరించారు. అయితే వేలాది మంది కార్మికులు ఈ బ్లాకులను ఖచ్చితంగా ఆ నిర్మాణాలపై ఉంచవలసి వచ్చింది. ఇదంతా నీరు లేదా తడి మట్టి, స్లెడ్జ్‌లు, దృఢమైన తాడులు, మీటలతో గ్రీజు చేసిన పెద్ద ర్యాంప్‌ల ద్వారా జరిగిందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

Next Story