కేఎల్ యూనివర్సిటీ ఆధీనంలో ఇనాం భూములు..!

by Disha Web Desk |
కేఎల్ యూనివర్సిటీ ఆధీనంలో ఇనాం భూములు..!
X

దిశ, మేడ్చల్ బ్యూరో: “ఇనామ్ దారులు.. వారి వారసులు తప్ప ఇతరులు ఓఆర్‌సీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు” అంటూ 2022 సంవత్సరంలో హైకోర్టు ఒక కామన్ జడ్జిమెంట్ జారీ చేసింది. దీనికి విరుద్ధంగా వారసులకు ఓఆర్సీ ఇవ్వకుండానే ఇనాం భూములు కొనుగోలు చేయడం, వాటిని మ్యూటేషన్ చేయించుకోవటం వంటి చర్యలకు కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం చకచక పావులు కదుపుతుంది. ఈ విషయంపై అసలైన ఇనాంధారుల వారసులు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో కేఎల్ యూనివర్సిటీకి ఉన్న భూముల విషయంలో వినిపిస్తున్న ఆరోపణలు, జరుగుతున్న వివాదాలపై "దిశ" ప్రత్యేక కథనం.

కేఎల్ ఆధీనంలో ఇనాం భూములు

కొంత భాగంలో కొందరు మా భూములు అన్యాక్రాంతం చేస్తున్నారంటూ వాపోతుండగా, ప్రభుత్వ భూములను సైతం కబలిస్తున్నారంటూ మరికొందరు ఫిర్యాదులు సైతం చేశారు. అదేవిధంగా ఇనాం భూములను సైతం కేఎల్ యూనివర్సిటీ అక్రమంగా కొనుగోలు చేసి వారి స్వాధీనంలో ఉంచుకుందంటూ ఈ విషయంపై తమకి న్యాయం చేయాలంటూ బాధితులు పోరాడుతున్నారు. గాజులరామారంలో కేఎల్ యూనివర్సిటీ భూములుగా చెబుతున్నా కొంత భాగంలో దాదాపుగా 11 ఎకరాలకు పైగా ఇనాం భూములు ఉన్నాయి. ఈ భూములను కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం కొనుగోలు చేసామని చెబుతున్నప్పటికీ ఇనాం భూముల అసలైన వారసులకు ఓఆర్సీ ఇవ్వకుండానే కొనుగోలు చేశారని ఆ లావాదేవీలు చెల్లవంటూ బాధితులు జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసులు వేశారు. ఈ విషయంపై గత కొన్నాళ్లుగా వాళ్లు న్యాయపోరాటం చేస్తున్నారు.

ఓఆర్సీ రాలేదని గ్రహించి...

కేఎల్ యూనివర్సిటీ గాజులరామారంలో ఉన్న ఇనాం భూములను వారి స్వాధీనంలో ఉంచుకున్నారు. దాదాపుగా 11 ఎకరాలకు పైగా ఉన్నట్లుగా చెబుతున్న ఈ భూములలో ఇప్పటికే రెండు ఎకరాలకు పైగా భూములు కేఎల్ యూనివర్సిటీ పేరిట మ్యూటేషన్ జరిగింది. సర్వేనెంబర్ 429లో 17 గుంటలు, 430లో 15 గుంటలు, 431లో 12 గుంటలు, 432లో 14 గుంటలు, 43లో 14 గుంటలు, 439 సబ్ డివిజన్‌లో 25 గుంటలు, 441, 442 సబ్ డివిజన్‌లలో 0.04 గుంటల భూమి వారి పేరిట మ్యూటేషన్ చేయించుకున్నారు. ఈ విషయంపై అసలైన ఇనాంధారుల వారసులు రెవెన్యూ అధికారులకు 2022లో హైకోర్టు ఇచ్చిన కామన్ జడ్జిమెంట్ కాపీని అందించి ఫిర్యాదు చేశారు. అధికారుల సైతం ఇనాంధారుల వారసులకు ఓఆర్సీ లేకుండానే ఇతరులకు ఓఆర్సీ రావడం గ్రహించి మిగిలిన మ్యూటేషన్ ప్రక్రియ ఆపి వేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు అసలైన ఇనాంధారుల ఓఆర్సీని పరిశీలించకుండానే మ్యూటేషన్ ఏవిధంగా చేసేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు బాధితులు.

ఇనాం భూములుగా నిర్ధారణ..

ఇక సర్వే నెంబరు 429లో 1.29 , 4:30లో 1.23, 431 లో 1.09, 432/1 లో 1.17, 432/2లో 1.30, 433 లో 1.30, 441లో 1.14, 442లో 2.04 మేర ఇనాం భూములు ఉన్నట్లుగా 2022 డిసెంబర్ నెలలో రెవెన్యూ అధికారులు రూపొందించిన రికార్డులు పేర్కొన్నారు. 1977 నుంచి 2021 వరకు పహానిలో సైతం ఇనాం భూములు (దస్తుగర్ధన్) గానే రికార్డు అయినట్లు ధృవీకరించారు.

2022లో హైకోర్టు కామన్ జడ్జిమెంట్

ఇనాం భూములు వివాదంలో 2022లో ఓ కేస్ విషయంలో హైకోర్టు కామన్ జడ్జిమెంట్ ను జారీ చేసింది. అందులో 44వ పేజీ పేరా 57లో ఓఆర్సీని ఎవరికి జారీ చేయాలి అనే విషయంపై స్పష్టంగా తెలియజేసింది. అయినప్పటికీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా రెవెన్యూ అధికారులు ఇనాం భూములను మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న కేఎల్ యూనివర్సిటీ పేరిట ఇప్పటికే కొంతమేర మ్యూటేషన్ చేసేశారు. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండదండలతో కేఎల్ యూనివర్సిటీ రెవెన్యూ అధికారులను ప్రభావితం చేసి ఇనాం భూములను వారి పేరిట మార్చేసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు .



Next Story