ప్రజ్వల్ రేవణ్ణ లాంటోళ్లను సహించేది లేదు : ప్రధాని మోడీ

by Dishanational6 |
ప్రజ్వల్ రేవణ్ణ లాంటోళ్లను సహించేది లేదు : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వ్యక్తిని సహించేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ ను దేశం వదిలివెళ్లేందుకు అనుమతించిందని ఆరోపించారు. వొక్కలిగ్గాస్ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఎన్నికలు ముగిశాక సెక్స్ స్కాం వీడియోలను విడుదల చేసిందని మండిపడ్డారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున ఈ కేసులో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే అని గుర్తుచేశారు.

టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. వేలసంఖ్యలో అసభ్యకరమైన వీడియోలు ఉన్నాయంటే.. అది కాంగ్రెస్, జేడీఎస్ పొత్తులో ఉన్నప్పటివే అని అర్థమవుతోందన్నారు. ఈ వీడియోలను తాము అధికారంలో ఉన్నప్పుడు సేకరించామని.. ఎన్నికల సమయంలో విడుదల చేశారని ధ్వజమెత్తారు. ప్రజ్వల్ ను విదేశాలకు పంపిన తర్వాతే వీడియోలు విడుదలయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారం అంతా అనుమానాస్పదంగా ఉందన్నారు. కర్ణాటక ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉంటే.. ఎయిర్ పోర్టు వద్ద నిఘా పెంచి ఉండాల్సిందని అన్నారు.

కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అంటే.. ఇదంతో ఓ పొలిటికల్ గేమ్ అని.. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు ఉన్నప్పట్నుంచి వీడియోలను దాచిపెచ్చారని తెలుస్తోందన్నారు. అసలు సమస్య ఏంటంటే.. ఇలాంటి నేరస్థులను వదిలిపెట్టవద్దని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి, పార్టీకి, తనకు సంబంధించినంత వరకు ఇలాంటి వ్యక్తులను సహించేది లేదని అన్నారు. ఇలాంటి వారికి చట్టపరంగా కఠినమైన శిక్షలు విధించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడ్ని స్వదేశానికి రప్పించాలని.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ వ్యవహారంలో మరో ఆలోచన చేయొద్దని అన్నారు.

కాంగ్రెస్, జేడీఎస్ 2018 ఎన్నికల తర్వాత కర్ణాటకలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన తర్వాత విడిపోయాయి. ఇక, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ గతేడాది సెప్టెంబర్‌లో బీజేపితో పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది.

మరోవైపు, రాజ్యాంగాన్ని మార్చాలని ఆరోపిస్తూ బీజేపీపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై స్పందించారు మోడీ. కాంగ్రెస్ నిరంతరం అబద్ధాలు చెప్తోందన్నారు. బీజేపీ నేతలు ఏదో చెప్పారని.. అసత్యాలన్నీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

తమ మాట వినడానికి కాంగ్రెస్ నేతలు నిరాకరిస్తున్నారని అన్నారు. సంపద పంపిణీ, వారసత్వ పన్నును తమ మేనిఫెస్టోలో ఎక్కడ ఉందని కాంగ్రెస్ అడుగుతోందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ద్వంద ప్రమాణాలు పాటించవద్దని.. బీజేపీ అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వాలని డిమాండ్ చేశారు. మతం ఆధారంగా రిజర్వేషన్ల ఆలోచన రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. తమ ప్రభుత్వ సంక్షేమ చర్యలను ఉటంకిస్తూ.. తాము మతం ఆధారంగా వివక్ష చూపలేదని స్పష్టం చేశారు.

Next Story