ఈడీ రైడ్స్ కలకలం.. నోట్ల కట్టలతో లింకున్న ఆ మంత్రి ఎవరు ?

by Dishanational6 |
ఈడీ రైడ్స్ కలకలం.. నోట్ల కట్టలతో లింకున్న ఆ మంత్రి ఎవరు ?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఝార్ఖండ్ లోని రాంచీలు ఈడీ రైడ్స్ కలకలం సృష్టించాయి. ఓ హౌస్ కీపర్ ఇంటి నుంచి రూ.20 కోట్లకు పైగా నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. లోక్ సభ ఎన్నికల వేళ ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది. కాగా.. నిందితుడికి ఝార్ఖండ్ మంత్రి అలంఘీర్ ఆలంతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అలంఘీర్ కార్యదర్శి సంజీవ్ లాల్ దగ్గర నిందితుడు జహంగీర్ పనిచేస్తున్నట్లు తేలింది. ఇది కాస్తా రాజకీయంగా దుమారం రేగింది. ఇక, అలంఘీర్ ఆలం ఎవరు అనేది చర్చ జరుగుతోంది.

ఇకపోతే, ఈడీ దర్యాప్తు పూర్తికాకముందే.. దాడుల గురించి మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు ఝార్ఖండ్ మంత్రి. ఓపిక, సంయమనం పాటించాలని కోరారు. దాడులను బట్టి.. ఇప్పుడే ఏదేదో ఊహించుకోవద్దని తెలిపారు.

అలంఘీర్ ఆలం ఎవరంటే?

1954లో జన్మించిన అలంఘీర్‌ 1974లో భాగల్పూర్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన అలంఘీర్.. ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. పకూర్‌ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

సాహెబ్‌ గంజ్‌ జిల్లాకు చెందిన అలంఘీర్‌ 2000లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లోనూ గెలిచారు. 2006లో ఝార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. 2009లో ఓటమి పాలైన అతడు 2014, 2019లో వరుసగా విజయం సాధించారు.

2023లో ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాచీ చీఫ్‌ ఇంజినీర్‌ వీరేంద్ర కుమార్‌ రామ్‌ పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు నిర్వహించింది. ఈ కేసు తర్వాత అలంఘీర్‌ పైనా ఈడీ నజర్ వేసింది. వీరేంద్ర కుమార్‌ కాంట్రాక్టర్ల వద్ద కమిషన్‌ పేరిట భారీగా వసూళ్లు చేసినట్లు పేర్కొంది ఈడీ. వీరికి టెండర్లను ఆశ చూపి ఈ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.

Next Story

Most Viewed