తీవ్ర సంక్షోభంలో పత్రికా స్వేచ్చ

by Disha edit |
తీవ్ర సంక్షోభంలో పత్రికా స్వేచ్చ
X

ప్రజాస్వామ్య వికాసానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో, పత్రికా స్వేచ్ఛ వర్ధిల్లడానికి ప్రజాస్వామ్యం అంతే అవసరం. కావున పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల స్వేచ్ఛ హరించడమే.కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌ వ్యాఖ్యానించింది. పత్రికా స్వేచ్ఛ సూచి-2023లో భారత్ 180 దేశాలలో 161వ స్థానానికి పడిపోవడమే దీనికి నిదర్శనం.

పత్రికలు ప్రజాస్వామ్య సౌధానికి మూలాధారం. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల గురించి ప్రజలకు తెలియజేసేవి పత్రికలే. అదే విధంగా ప్రజల స్పందన ప్రభుత్వానికి అందించే ముఖ్యమైన సాధనాలు కూడా పత్రికలే. పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాయి. తద్వారా ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారితనం పెరిగి సమర్థవంతమైన పరిపాలన అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. అమెరికా లాంటి ప్రజాస్వామ్య సమాజంలో పత్రికలను ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా, ప్రజాకోర్టుగా పేర్కొంటారు. ఏ ప్రజాస్వామ్య సమాజంలోనైనా పత్రికలు సమాజంలో జరుగుతున్న సంఘటనల, పరిణామాలు తాలూకు సమగ్ర సమాచారాన్ని పౌరులకు అందజేస్తాయి, ఆ సమాచారం ప్రాధాన్యతను విశ్లేషిస్తాయి లేదా భాష్యం చెబుతాయి. సంపాదకీయ వ్యాసాలు ప్రచురిస్తాయి. వర్తమానంలో అందిన సామాజిక వారసత్వాన్ని రానున్న తరాలవారికి అందజేస్తాయి. కావున పత్రికల సామాజిక బాధ్యత అసమానమని చెప్పవచ్చు. ఈ బాధ్యతను నిర్వర్తించడానికి పత్రికలకు స్వేచ్ఛ అత్యవసరం.

సమర్థ పాలనకు దోహదకారి

పత్రికలు స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రజల యొక్క సాధకబాధకాలు తెలపడంతో పాటు ప్రభుత్వం యొక్క పని విధానాన్ని సమీక్షించడానికి వీలవుతుంది. అప్పుడే సమర్థవంతమైన పరిపాలనకు ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుతుంది. ఈ సంవత్సరం A Press for the Planet protecting journalists and scientists in defense of the environment అనే ఇతివృత్తంతో జరుపుకొంటున్నాము. ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం పరిస్థితుల్లో భూగోళ సంరక్షణ ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పత్రికలపై ఉన్నదనేది ఈ నినాదం ప్రాధాన్యత. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌ వ్యాఖ్యానించింది. పత్రికా స్వేచ్ఛ సూచి-2023 లో భారత్ 180 దేశాలలో 161వ స్థానానికి పడిపోవడమే దీనికి నిదర్శనం. గతేడారి 150వ స్థానంలో ఉండేది. మన చుట్టుపక్కన దేశాలైన భూటాన్(90), శ్రీలంక(135), పాకిస్తాన్(150), ఆఫ్ఘనిస్తాన్(152) మన కన్నా మెరుగైన స్థాయిలో ఉన్నాయి. ఈ సూచీలో 2016 నుంచి భారత్‌ స్థానం దిగజారుతూనే వస్తోందని పేర్కొంది.

ఆ స్వేచ్ఛే పత్రికా స్వేచ్ఛ

ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న తీవ్రవాదం,రాజకీయ ఒత్తిళ్ళు, కుల, మత విద్వేషాలు పెరగడం, జర్నలిస్టులపై దాడులతో పాటు పలు సంక్షోభాలు పత్రికా స్వేచ్ఛకు ఆటంకంగా మారాయి. వీటిని అధిగమించడానికి ప్రపంచస్థాయిలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రభుత్వాలు పత్రికలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో పత్రికల పాత్ర పరిశీలిస్తే.. స్వాతంత్రోద్యమ కాలం నుంచి నేటి వరకు ప్రజలను చైతన్యం చేసే ముఖ్య సాధనాలుగా పత్రికలు వ్యవహరిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ విషయంలో భారత రాజ్యాంగంలో ఎక్కడా అధికారికంగా ప్రస్తావించలేదు, కానీ భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగా పత్రికా స్వేచ్ఛను పేర్కొంటారు.

పత్రికలు బాధ్యతాయుతంగా మెదులుతూ, విశ్వసనీయతను చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెజారిటీ ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేయాలి. భాగస్వామ్య పార్టీల ఒత్తిళ్లతో ,ప్రతిపక్షాల ఎత్తుగడలతో సతమవుతున్న ప్రభుత్వాలకు మన పత్రికలు ఎజెండా తయారుచేసి సమర్పించే విధంగా ఉండాలి. పేదల కష్టాలను, నిరుద్యోగుల వేతలను,అధికారుల అవినీతిని ప్రభుత్వాల ముందు ఉంచాలి. దేశంలోని క్షేత్రస్థాయి సామాజిక, ఆర్థిక ,రాజకీయ సాంస్కృతిక సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా పత్రికలు వ్యవహరించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణం సంక్షోభాన్ని ప్రజలకు అవగాహన కలిగించి, వాటిని ప్రభుత్వాల ద్వారా పరిష్కరించే దిశగా కృషి చేయాలి.

(నేడు ప్రపంచ పత్రికా స్వేచ్చ దినోత్సవం)

సంపతి రమేశ్ మహారాజ్

సామాజిక విశ్లేషకులు

79895 79428

Next Story

Most Viewed