ఈసీ నుంచి ‘నో’ పర్మిషన్.. తెలంగాణ కేబినెట్ భేటీపై తీవ్ర ఉత్కంఠ..!

by Satheesh |
ఈసీ నుంచి ‘నో’ పర్మిషన్.. తెలంగాణ కేబినెట్ భేటీపై తీవ్ర ఉత్కంఠ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోడానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ కారణంగా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. రెండు రోజుల క్రితమే రాతపూర్వకంగా రిక్వెస్టు చేసినా అనుమతి లభించలేదు. దీంతో కేబినెట్ సమావేశం జరుగుతుందా?.. లేదా?.. అనే డైలమా నెలకొన్నది. పర్మిషన్ రాకపోయినా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించుకోవచ్చని, కానీ అందులో చర్చించిన అంశాలను లేదా తీసుకున్న నిర్ణయాలను బహిర్గతం చేయరాదన్న నిబంధన ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు.

‘కేబినెట్ సమావేశం’ పేరుతో నిర్వహించడానికి లీగల్ చిక్కులు ఉన్నట్లు భావిస్తే మీటింగ్ ‘మంత్రుల సమావేశం’ పేరుతో జరగనున్నది. కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు అనుమతి లేని కారణంగా ఆ సమావేశంలో జరిగిన చర్చల వివరాలను అధికారికంగా వెల్లడించడం కోడ్ ఉల్లంఘన అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రకటన రూపంలో వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు.

కేబినెట్ సమావేశం కోసం ఎజెండాను తయారుచేసుకుని, వివరాలన్నింటినీ చర్చకు అనుగుణంగా రిపోర్టుల రూపంలో జీఏడీ సిద్ధం చేసినా ఈసీ నుంచి అనుమతి లభించని కారణంగా ‘మంత్రులు వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు’ అనే అర్థంలో ఈ మీటింగ్ కొనసాగనున్నది. ఎలాగూ మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేసే అంశంపై విడిగా ఆ శాఖ మంత్రి, అధికారులతో సీఎం రేవంత్ ఒక సమావేశాన్ని నిర్వహించారు. భూ సమస్యలపై ధరణి కమిటీ మీటింగ్ కూడా షెడ్యూలు ప్రకారమే జరిగింది. కేబినెట్ సమావేశం మాత్రమే కోడ్ ఆంక్షల కారణంగా రివ్యూ మీటింగ్ తరహాలో జరగనున్నది.

Next Story

Most Viewed