ఉత్సవ విగ్రహాల్లా జడ్పీ చైర్మన్లు

by  |
ఉత్సవ విగ్రహాల్లా జడ్పీ చైర్మన్లు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: జడ్పీ చైర్మన్ పదవులు.. రాష్ట్ర కేబినెట్ హోదాకు సరితూగేవి. కొన్ని సందర్భాలలో మంత్రుల కన్నా ఎక్కువగా జడ్పీ చైర్మన్‌లకే ప్రాధాన్యత ఉండేది. అది గతం.. ప్రస్తుతం జడ్పీ చైర్మన్‌లు అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానిస్తే తప్ప హాజరు కాని పరిస్థితి. ఒకవేళ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలలో పాల్గొన్నా జడ్పీ చైర్మన్‌లకు ఇవ్వవలసిన ప్రాధాన్యత దక్కడం లేదు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు జడ్పీ చైర్మన్ పదవులు ఉన్నాయి. మహబూబ్‌నగర్, వనపర్తి స్థానాలు జనరల్‌కు కేటాయించగా, నారాయణపేట బీసీ జనరల్, గద్వాల బీసీ మహిళ, నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఇందులో మహబూబ్‌నగర్ నుంచి స్వర్ణ సుధాకర్ రెడ్డి, నారాయణపేట నుంచి మనజన్మ, గద్వాల జిల్లా నుంచి సరిత తిరుపతయ్య, నాగర్ కర్నూల్ నుంచి పద్మావతి జడ్పీ చైర్‌పర్సన్‌లుగా కొనసాగుతున్నారు. వనపర్తి జడ్పీ చైర్మన్‌గా లోకనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమకు ఇబ్బందులు తలెత్తకుండా, తాము చెప్పినట్లు వినే వారినే, తమ అనుచరులను జిల్లా మంత్రుల సహాయంతో జడ్పీ చైర్మన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఒకటి రెండు చోట్ల ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా ఎంపికయ్యారు.

కారణాలు ఎన్నో..

జడ్పీ చైర్మన్ లకు గతంలో లాగా ప్రాధాన్యత లేక పోవడానికి అనేక కారణాలు వెలుగు చూస్తున్నాయి.. కొన్ని జిల్లాలలో సామాజిక నేపథ్యం, అనుభవం లేకపోవడం ప్రాధాన్యత లభించడం లేదని తెలుస్తున్నది. మరికొన్ని జిల్లాల్లో జడ్పీ చైర్మన్‌లకు ప్రజలలో మంచి పేరు సంపాదిస్తే రానున్న రోజులలో తమ పదవులకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందనే భయంతో వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది.

చెప్పినా ఏం ప్రయోజనం..

ఈ విషయమై పలువురు జడ్పీ చైర్మన్‌లతో దిశ మాట్లాడే ప్రయత్నం చేయగా.. ఏం జరుగుతుందో మీ కండ్ల ముందు కనిపించడం లేదా.. మమ్మల్ని ఏం చెప్పమంటారు..? చెప్పినా ప్రయోజనం ఏముంటుంది..? ఏం జరగాలో అవి జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. అంతకుమించి మేమేమీ కోరుకోము. అంటూ ముక్తసరిగా సమాధానాలు ఇచ్చారు.

ఇదీ పరిస్థితి..

– ఈ నెల 26న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన జడ్పీ చైర్మన్‌ను వేదికపైకి ఆహ్వానించకపోవడంతో ఆమె మధ్యలోనే కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోయారు.

– నాగర్ కర్నూలు జిల్లాలో జరిగే ఏ కార్యక్రమంలోనూ జడ్పీ చైర్మన్‌కు తగిన ప్రాధాన్యత లభించడం లేదు. ఏదైనా వేదికపై సాధారణ నాయకురాలిగా కూర్చుంటున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలు లోనూ ఆమె పేరు ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి.

– వనపర్తి నియోజకవర్గంలోనూ జెడ్పీ చైర్మన్‌‌కు కార్యక్రమాల నిర్వహణలో గానీ, ఇతర అంశాలలో గానీ ప్రాధాన్యత లభించడం లేదని ఇటీవల తన అనుచరగణం వద్ద వాపోయిన విషయం చర్చనీయాంశంగా మారింది.

– గద్వాల జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు, జడ్పీ చైర్మన్ కు పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. పలు కార్యక్రమాలకు సైతం ఆమెకు ఆహ్వానాలు అందడం లేదు.

Next Story