51 ఏళ్ల తర్వాత బయటపడ్డ హంతకుడి మెసేజ్

by  |
51 ఏళ్ల తర్వాత బయటపడ్డ హంతకుడి మెసేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: 50 ఏళ్ల క్రితం జోడియాక్ కిల్లర్ పేరుతో ఉత్తర కాలిఫోర్నియాను గజగజ వణికించిన హంతకుడు పంపిన క్రిప్టిక్ మెసేజ్ ఒకదాన్ని కొందరు క్రిప్టోగ్రఫీ నిపుణులు పరిష్కరించారు. ఆ హంతకుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ క్రిప్టిక్ మెసేజ్‌ను డీకోడ్ చేయడానికి కొన్నేళ్లుగా క్రిప్టోగ్రఫీ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ మెసేజ్ ఏంటో తెలిసింది. మరి హంతకుడు ఎవరనే సంగతి తెలిసిందా? ‘340 సైఫర్’ అని పిలిచే ఈ మెసేజ్‌లో 340 అక్షరాలు ఉన్నాయి. 1969లో హంతకుడు శాన్‌ఫ్రాన్సిస్కో క్రొనికల్‌కు ఈ కోడెడ్ మెసేజ్‌ను పంపించాడు. వర్జీనియాకు చెందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ డేవిడ్ ఒరాంచక్, బెల్జియం దేశానికి చెందిన కంప్యూటర్ ప్రోగ్రామర్ యార్ల్ వాన్ ఐకీ, ఆస్ట్రేలియాకు చెందిన గణిత నిపుణుడు సామ్ బ్లేక్ కలిసి ఈ మెసేజ్‌ను డీక్రిప్ట్ చేశారు.

అయితే ఇందులో హంతకుడి గుర్తింపు గురించి ఎలాంటి సమాచారం లేదు. ఈ మెసేజ్‌లో జోడియాక్ కిల్లర్ కేవలం తన గురించి గొప్పలు చెప్పుకున్నాడు. ‘మీరు నన్ను పట్టుకోవడంలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు కావొచ్చు. గ్యాస్ చాంబర్ గురించి నాకు భయం లేదు. అది నన్ను స్వర్గానికి పంపిస్తుంది. ఇప్పుడు నాకు కావాల్సినంత మంది బానిసలు ఉన్నారు’ అని ఆ మెసేజ్‌లో ఉందని డేవిడ్ వెల్లడించారు. మొత్తం క్యాపిటల్ అక్షరాలలో, పంక్చుయేషన్‌లు లేకుండా ఐమూలగా చదివినపుడు ఈ మెసేజ్ అర్థమవుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి క్రిప్టిక్ టెక్నిక్‌ను 1950ల్లో అమెరికా ఆర్మీలో ఉపయోగించేవారని డేవిడ్ అన్నారు. ఈ జోడియాక్ కిల్లర్.. హత్యలు చేసి పోలీసులకు, మీడియాకు ఇలాంటి క్రిప్టిక్ సందేశాలు పంపించేవాడు. వాటిలో ఈ 340 సైఫర్‌ను డీకోడ్‌ చేయడానికి ఇంత కాలం పట్టింది. అయినప్పటికీ ఆ కిల్లర్ గురించి వివరాలు తెలియకపోవడం కొంత నిరాశను కలిగిస్తోంది.

Next Story

Most Viewed