టీఆర్ఎస్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

by  |
YS Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘భవిష్యత్‌లో పెట్టబోయే పార్టీ ద్వారా రాజకీయంగా ఢీకొట్టేది పెద్ద కొండలనేనని నాకు తెలుసు. ఒక మహిళ పార్టీ పెట్టి నడిపించడమంటే అంత ఆషామాషీ విషయం కాదు. కొండకు తాడు వేస్తున్నా.. కొండ కదులుతుందో.. తాడే తెగుతుందో చూస్తా.. నా ఆత్మ విశ్వాసం చాలా గట్టిదని నిరూపిస్తా’’ అని వైఎస్ షర్మిల అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో షర్మిల పెట్టబోయే పార్టీలో ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులతో సోమవారం చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. ఏపూరి ప్రతి మాట ఒక తూటా అని కొనియాడారు. తెలంగాణకు ఊపిరి జానపదాలని, అలాంటి జానపదానికి ఏపూరి వన్నె తెచ్చారని అన్నారు. రాష్ట్ర సాధనలో ఉద్యమాన్ని ఉరకలెత్తించి పోరాడిన కళాకారులందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ఉద్యమంలో ముందుండి పోరాడిన గళం నేడు మూగబోయిందని, అన్యాయం చేస్తే ఎవరినైనా ధిక్కరిస్తామని చాటి చెప్పేందుకు ఆ గళాన్ని తిరిగి వినిపించాల్సిన అవసరం ప్రస్తుతం ఏర్పడిందని ఆమె అన్నారు. తాను ఢీ కొట్టేది పెద్ద కొండలనని తనకు తెలుసని, అందరం ఐకమత్యంగా ఉంటే సాధించలేనిదేదీ ఉండదని ఆమె తెలిపారు. ఏపూరి సోమన్న చేరికతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాకారులు తనకు అండగా నిలిచారని, అన్యాయాలపై తమ గళాన్ని వినిపించాలని ఆమె సూచించారు.

వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను తిరిగి అందిస్తా..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా పుట్టడం తన అదృష్టమని, తన తండ్రి లేకపోయినా తమ కుటుంబంపై అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్సార్ రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల వల్లే ఇంతమంది అభిమానులు తనకు అండగా నిలుస్తున్నారని అన్నారు. వైఎస్సార్ మరణం వార్త విని ఆయనతో పాటే సుమారు 700 మందికి పైగా ప్రాణాలు విడిచారని, ఇదంతా ఆయన మీద ఉన్న అభిమానానికి నిదర్శమని అన్నారు. ముఖ్యమంత్రిగా తన తండ్రి కేవలం ఐదేళ్లే పనిచేశారని, ఆ కొద్ది సమయంలోనే రాష్ట్రానికి కావాల్సిన అన్ని వనరులను, సంక్షేమ పథకాలను అందించారని వివరించారు. కానీ నేడు ధనిక రాష్ట్రంగా చెబుతున్న తెలంగాణలో సామాన్యుడి బతుకు హీనంగా మారిందన్నారు. వైఎస్సార్ పేదలకు ఇచ్చిన భద్రతను మళ్లీ సంక్షేమ పథకాల ద్వారా అందిస్తానని షర్మిల స్పష్టం చేశారు.

పాటే కాదు.. రాజకీయం కూడా తెలుసు : ఏపూరి సోమన్న

తనకు పాటలు పాడటమే కాదు.. రాజకీయం చేయడం కూడా తెలుసని తన మనసులోని మాటను బయటపెట్టారు ఏపూరి సోమన్న. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల ఆశీస్సులతో అవసరమైతే తుంగతుర్తి నుంచి బరిలోకి దిగేందుకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ప్రతిపక్షాలు కూడా తమ కర్తవ్యాన్ని పక్కనపెట్టి సీఎం సీటు నాదంటే నాదని కొట్టుకుంటున్నారని సోమన్న అన్నారు. కొంచెం ఎదిగినా అందులోని నాయకులే ప్రత్యర్థులకు డబ్బులిచ్చి ఓడించే నీచ సంస్కృతి కాంగ్రెస్‌లో ఏర్పడిందన్నారు. అమరవీరుల గోరీల మీద తెలంగాణ భవన్‌ను నిర్మించారని, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే తెలంగాణ కావాలి కానీ ఈ దొరల పాలన తమకు అక్కర్లేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ గడ్డ మీద రాజకీయ సునామీ రానుందని, కళాకారుల పాటతో తెలంగాణ భవన్ దద్దరిల్లే రోజు దగ్గర్లోనే ఉందని ఏపూరి పేర్కొన్నారు. సాంస్కృతిక విభాగంలో సీఎం కేసీఆర్ తనకు ఉద్యోగమిచ్చారని, అక్కడుండి ఆయనకు భజన చేయడం ఇష్టంలేక ఉద్యోగాన్ని కూడా వదిలేశానని ఏపూరి తెలిపారు. తెలంగాణలో స్వచ్ఛమైన రాజకీయాలు అవసరమని, అది కేవలం వైఎస్సార్ కుటుంబసభ్యలకు సాధ్యమని ఆయన అన్నారు.

సోమన్నపై బాధ్యత పెరిగింది : ఇందిరా శోభన్

తెలంగాణ లో ఆట, పాట అంటే గుర్తుకొచ్చే పేరు ఏపూరి సోమన్న అని ఇందిరా శోభన్ కొనియాడారు. ‘ఎవడి పాలైందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నాడురో తెలంగాణ’ అనే పాటతో ఉద్యమాన్ని ఉరకలెత్తించిన గొంతుక ఏపూరిది అని అన్నారు. రాష్ట్రంలో అన్యాయలపై గళమెత్తిన గొంతుక షర్మిలకు మద్దతు తెలపడం హర్షనీయమని పేర్కొన్నారు. షర్మిల సంకల్పం ఎంతో గట్టిదని అందుకే అందరూ ఆమెకు మద్దతు తెలిపేందుకు తరలివస్తున్నారని అన్నారు. ఇదిలా ఉండగా లోటస్ పాండ్ కు చేరుకున్న ఏపూరి సోమన్నకు ఇందిరా శోభన్ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. మహిళలు బోనాలతో తరలిరాగ కళాకారుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

Next Story

Most Viewed