ఫోన్ ఉన్నా.. ‘ఆయుష్మాన్ భారత్’ వర్తించదు

by  |
ఫోన్ ఉన్నా.. ‘ఆయుష్మాన్ భారత్’ వర్తించదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ పథకం ‘ఆయుష్మాన్ భారత్’ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అయితే ఇటుకతో కట్టుకున్న ఇల్లున్నా, బైక్ ఉన్నా, కనీసం ఫోన్ ఉన్నా ఈ పథకం వర్తించదని వైఎస్ షర్మిల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పేదలు కరోనా వైద్యం కోసం ఉన్న ఆస్తులు అమ్ముకోవడమే కాకుండా అప్పు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, అలాంటిది వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. సీఎం కేసీఆర్ దొర కొవిడ్ వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చకుండా ఆయుష్మాన్ భారత్‌లో చేర్చారని ఆమె ఎద్దేవా చేశారు. ఆరోగ్య శ్రీ లో చేర్చితే తెల్ల రేషన్ కార్డులున్న 80 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరేదని ఆమె పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలకే మేలు జరుగనుందని ఆమె తెలిపారు. మరి మిగిలిన పేదల పరిస్థితేంటని, తెలంగాణలో 26 లక్షల పేద కుటుంబాలు మాత్రమే ఉన్నాయా అంటూ ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం పేదరికంలో కూడా తేడాలు చూపడం సరికాదని విమర్శలు చేశారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చి అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

‘ఆయుష్మాన్ భారత్’ తో ఏడాదికి రూ.5 లక్షలే..

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఏడాదికి రూ.5 లక్షల ప్రయోజనాలు మాత్రమే పొందే అవకాశముందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అదే ఆరోగ్య శ్రీ ద్వారా అయితే ఏడాదికి రూ.13 లక్షల బెనిఫిట్స్ పొందే అవకాశముంటుందని ఆమె తెలిపారు. ఇటుకతో కట్టుకున్న ఇల్లున్నా, బైక్, ఫోన్ ఉన్నా కూడా ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదని, తద్వారా అతి కొద్దిమందికే లబ్ధి చేకూరుతుందని ఆమె సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. బైక్, ఫోన్ వంటివి కనీస అవసరాలని, అవి ఉంటే మాత్ర పేదలంతా కోటీశ్వరులైనట్లేనా అని ఆమె ప్రశ్నించారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో బిల్లులు చెల్లించే స్థోమత వారికుంటుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పేదరికానికి సరికొత్త అర్థం చెబుతున్నారంటూ మండిపడ్డారు. పాలకులు మనసుతో ఆలోచించాలని షర్మిల సూచించారు. కేసీఆర్‌కు నిజంగా పేదలంటే ప్రేమ ఉంటే కొవిడ్ వైద్యాన్ని ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఆరోగ్య శ్రీలో కూడా చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed