పురిటినొప్పులతో మహిళ అవస్థలు.. ఆ యువకుల ధైర్యానికి హ్యాట్సాఫ్..!

by  |
narsampet-pregnant-lady
X

దిశ, నర్సంపేట : అనుకోకుండా నిండు గర్భిణీకి పురిటినొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళ్లే దారిలో ఓ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ముందుకు వెళ్లేందుకు ఆటో డ్రైవర్ సంశయించడంతో అక్కడే రోడ్డు దాటేందుకు వెయిట్ చేస్తున్న కొందరు యువకులు ధైర్యం చేసి ఎలాగోలా గర్భిణీని వాగు దాటించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆ యువకులు చూపిన తెగువకు అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ ఘటన నర్సంపేట పరిధిలోని చెన్నారావుపేట మండలంలో శుక్రవారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. నెక్కొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన స్రవంతి అనే మహిళ డెలివరీ కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో బయలుదేరింది. అయితే, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులన్నీ మత్తడి దూకుతున్నాయి. ఈ క్రమంలోనే చెన్నారావు పేట మండలం పాత మగ్ధుంపురం దగ్గరలో ఉన్న లెవెల్ బ్రిడ్జి వద్దకు స్రవంతి చేరుకోగానే మోకాలి లోతు మేర వరద పారుతోంది. అప్పటికే అటు ఇటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆటో ముందుకు వెళితే ప్రవాహంలో చిక్కుకోవడం ఖాయం.

కాగా, పురిటి నొప్పులతో అవస్థలు పడుతున్న మహిళను గమనించిన కొందరు యువకులు స్ట్రెచ్చర్ సాయంతో వాగు దాటించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. సమయానికి ఆస్పత్రికి చేరుకోవడంతో స్రవంతి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, విపత్కర పరిస్థితుల్లో సమయ స్పూర్తితో వ్యవహరించిన యువకులను స్థానికులు అభినందించారు. ఇదిలాఉండగా ప్రతీయేడు వర్షాకాలంలో ప్రజలు ఈ లెవెల్ బ్రిడ్జి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed