చెట్టు పోయిందని బాలుడి ఫిర్యాదు..పోలీసులు చేసిందిదే!

by  |
చెట్టు పోయిందని బాలుడి ఫిర్యాదు..పోలీసులు చేసిందిదే!
X

దిశ, వెబ్ డెస్క్: ‘నేను లోకల్’ మూవీలో ఓ పిల్లాడు తన పెన్సిల్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే అది చూసి అందరం నవ్వుకున్నాం. కానీ, కేరళలో ఓ పన్నెండేండ్ల బాలుడు ఇచ్చిన ఫిర్యాదు మాత్రం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. అతను ఇచ్చిన ఫిర్యాదుకు పోలీస్ స్టేషన్ మొత్తం తన ఇంటి గుమ్మం ముందు నిలబడింది. తాను ఇష్టంగా పెంచుకున్న చెట్టు పోయిందని ఆ బాలుడు బాధపడుతూ ఇచ్చిన ఫిర్యాదుకు అక్కడి పోలీసుల కళ్లు చెమ్మగిల్లాయి. అందరూ ఇలా చెట్లను ప్రేమిస్తే ప్రస్తుతం వాతావరణం ఎంతో బాగుండేదని అనిపిస్తుంది. మరి ఆ బాలుడు పోగొట్టుకున్న చెట్టు దొరికిందా? అతన్ని సంతోషపెట్టడానికి పోలీసులు ఏం చేశారు? అనేది తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

ఎర్నాకులం జిల్లాలోని న్యారంబాలంలో ఉన్న లొబేలియా స్కూల్‌లో పన్నెండేళ్ల పిల్లాడు పవన్ ఆరో తరగతి చదువుతున్నాడు. అతను నాలుగో తరగతిలో ఉన్నపుడు అతని పాఠశాలలో ఒక ఉసిరి చెట్టును ఇచ్చారు. దాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు గోడ దగ్గర పవన్ నాటు పెట్టాడు. ఆ రోజు నుంచి దాన్ని ప్రేమగా పెంచుకుంటూ, ఉసిరి కాయలు ఎప్పుడు కాస్తాయా అని ఎదురుచూడసాగాడు. ఇటీవల ఒకరోజు ఉదయాన లేచి చూస్తే ఆ పెరిగిన చెట్టు కనిపించలేదు. ఆ చెట్టు స్థానంలో చిన్న కర్ర మాత్రమే ఉంది. దీంతో పవన్ చాలా బాధ పడ్డాడు. అలా ఏడుస్తూ ఉన్న పవన్‌ను చూసి ఇంట్లో అందరికీ జాలి కలిగింది. కొద్దిసేపటికీ గేమ్స్ ఆడుకుంటానని చెప్పి పవన్ తన అక్క మొబైల్ తీసుకున్నాడు. ఆమె ఫోన్‌లో ఖాకీ దుస్తులు వేసుకుని ఉన్న ఆమె ఫ్రెండ్ ఒకతను ఉంటాడు. పవన్ అతనికి కాల్ చేశాడు. ఏడుస్తూ తన చెట్టు గురించి ఫిర్యాదు చేశాడు. అయితే, అతను పోలీసు కాకపోవడంతో వేరే నెంబర్ ఇచ్చి దానికి కాల్ చేయాలని చెప్పాడు.

ఆ వ్యక్తి ఇచ్చిన నెంబర్ చిరి హెల్ప్‌లైన్ నెంబర్. లాక్‌డౌన్‌లో పిల్లల మానసిక పరిస్థితి మీద పడే ప్రభావాలను తీర్చడానికి కేరళ ప్రభుత్వం ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఆ నెంబర్‌కు కాల్ చేసి పవన్ బోరున ఏడ్చాడు. దీంతో పవన్ సమస్య మొత్తం చిరి పైఅధికారుల వరకు చేరింది. చివరికి ఈ విషయం చిరికి నోడల్ ఆఫీసర్‌గా ఉన్న ఇన్‌స్పెక్టర్ జనరల్ పి.విజయన్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన స్పందించి, న్యారక్కల్ పోలీస్ స్టేషన్‌కు ఆదేశాలు జారీచేశాడు. ఆ మరుసటిరోజు ఉదయం ఎనిమిది మంది కానిస్టేబుల్‌లు ఎనిమిది మొక్కలు పట్టుకుని పవన్ గుమ్మం ముందు నిలబడ్డారు.

ఈ తతంగం మొత్తం తెలియని పవన్ తల్లిదండ్రులు, పొద్దున్నే కానిస్టేబుల్స్ తమ ఇంటిముందు నిలబడటంతో కంగుతిన్నారు. ఏం జరిగిందోనని కంగారు పడ్డారు. చివరికి పవన్ చేసిన పనికి పోలీసులు మెచ్చుకోవడం చూసి ఆనందపడ్డారు. తర్వాత అందరూ కలిసి కానిస్టేబుల్‌లు తీసుకొచ్చిన ఉసిరి, జామ, చింత మొక్కలను నాటారు. ఇంతకీ పవన్ ఉసిరి చెట్టుకు ఏమైందో తెలుసా? కొందరు ఆకతాయిలు వారి ఇంటి ముందు క్రికెట్ ఆడుతూ, ఆ గొడవలో ఉసిరి చెట్టును పాడుచేశారు. పవన్ గురించి ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న స్మార్ట్ గార్డ్ అనే ఓ సంస్థ, వారి ఇంటి ముందు పెట్టుకోవడానికి సీసీటీవీని బహుమతిగా అందించింది. పోయిన చెట్టు ఎలాగూ పోయింది, కొత్తగా పెట్టిన చెట్లనైనా సురక్షితంగా ఉంచుకోవడానికి తమ సీసీటీవీ కెమెరాలు ఉపయోగపడాలనే ఉద్దేశంతో తాము ఇలా బహుమతి ఇచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది.



Next Story

Most Viewed