డబ్ల్యూటీసీ 2021-23 షురూ.. రెండో ట్రోఫీ షెడ్యూల్ విడుదల

by  |
WTC-2021-23
X

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 23న ముగిసింది. తొలి టెస్టు ఛాంపియన్‌షిప్‌ను న్యూజిలాండ్ జట్టు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. టీ20 దెబ్బకు పడిపోయిన టెస్టు క్రికెట్‌కు తిరిగి ఆదరణ తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఐసీసీ డబ్ల్యూటీసీని ప్రతీ రెండేళ్లకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే తొలి సీజన్ ముగియడంతో రెండో సైకిల్‌ను ప్రారంభించనున్నారు. ఆయా టెస్టు క్రికెట్ జట్ల మధ్య జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌ల మ్యాచ్‌లనే టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా చేశారు.

2019-21 సీజన్‌లో ఐసీసీ పలు నిబంధనలను చాలా సార్లు మార్చేసింది. కరోనా కారణంగా పాయింట్లను బట్టి కాకుండా విజయాల శాతం ఆధారంగా టాప్ 2 జట్లను నిర్ణయించింది. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. ఐసీసీ అకస్మాత్తుగా రూల్స్ మార్చడంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లు ఫైనల్స్ చేరుకోలేక పోయాయి. మరోవైపు టీమ్ ఇండియా కూడా ఫైనల్ బెర్తు కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. దీంతో 2021-23 సీజన్‌లో పాత నిబంధనలనే తిరిగి తీసుకొని వచ్చారు. కరోనా నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి 2018లో ఐసీసీ ఏ నిబంధనలు అయితే ప్రకటించిందో వాటినే అమలు చేయనున్నారు.

కోహ్లీ సూచన పక్కకు..

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక సూచన చేశాడు. ఫైనల్‌ను కేవలం ఒక మ్యాచ్‌కే పరిమితం చేయకుండా బెస్టాఫ్ త్రీగా ఆడించాలని అన్నాడు. ఒక టెస్టు జట్టు సామర్థ్యాన్ని కేవలం ఒకే టెస్టుతో నిర్దారించడం సబబు కాదని అన్నాడు. అంతకు ముందు వీవీఎస్ లక్ష్మణ్, సునీల్ గవాస్కర్ కూడా ఇలాంటి సూచనే చేశారు. అయితే కరోనా కారణంగా సమయం వృధా కావడంతో పాటు ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ) చాలా సంక్లిష్టంగా మారడంతో కేవలం ఒకే మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు ఐసీసీ కూడా స్పష్టం చేసింది. రాబోయే సీజన్‌లో కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌ను కేవలం ఓకే మ్యాచ్‌కు పరిమితం చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఇండియాను ఓడించిన కివీస్ జట్టు ఇదే ఏడాది ఇండియాలో పర్యటించనున్నది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నది. భారత జట్టు ఫైనల్‌లో ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఈ సిరీస్ ద్వారా రానున్నది.

ఇదీ టీమ్ ఇండియా షెడ్యూల్

1. ఇండియా Vs ఇంగ్లాండ్
ప్రస్తుతం ఇండియా జట్టు ఇంగ్లాండ్‌లో ఉన్నది. ఇండియా జట్టు ఇంగ్లాండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ అగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఆడనున్నది. 2021-23 డబ్ల్యూటీసీ సీజన్‌లో ఇదే తొలి టెస్టు సిరీస్ కానున్నది.

2. ఇండియాలో న్యూజిలాండ్ పర్యటన
న్యూజిలాండ్ జట్టు ఈ ఏడాది నవంబర్‌లో ఇండియాలో పర్యటించనున్నది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఈ సిరీస్ ప్రారంభం కానున్నది.

3. ఇండియాలో శ్రీలంక పర్యటన
ఐపీఎల్ 2022కు ముందు శ్రీలంక జట్టు ఇండియాలో పర్యటించనున్నది. భారత జట్టు స్వదేశంలో 3 టెస్టుల సిరీస్ ఆడనున్నది.

4. ఇండియాలో ఆస్ట్రేలియా పర్యటన
ఆస్ట్రేలియా జట్టు 2022 అక్టోబర్-నవంబర్ మాసాల్లో ఇండియాలో పర్యటించనున్నది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ జరుగనున్నది.

5. బంగ్లాదేశ్‌లో ఇండియా
టీమ్ ఇండియా తొలి సారిగా బంగ్లాదేశ్‌లో టెస్టు మ్యాచ్ కోసం పర్యటించనున్నది. డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా టీమ్ ఇండియా ఆడే చివరి సిరీస్ ఇదే కానున్నది. ఈ పర్యటనలో రెండు టెస్టులను ఆడనున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed