నత్త జిగురుతో.. బాతింగ్ సోప్స్

by  |
నత్త జిగురుతో.. బాతింగ్ సోప్స్
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా చాలామంది శునకాలు, పిల్లులు, పక్షుల్ని ఇష్టపడుతుంటారు. కానీ 28 ఏళ్ల ఫ్రెంచ్ శిల్పకారుడు డామిన్ డెస్రోచెర్ మాత్రం ‘నత్త’లపై మక్కువ పెంచుకున్నాడు. వైమానిక దళంలో కంప్యూటర్ టెక్నీషియన్‌గా పనిచేసిన డామిన్ కొంతకాలంగా తన పెరట్లో వేలాది నత్తలను పెంచడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే డామిన్ తన చేతుల్ని శుభ్రం చేసుకునేందుకు నత్తల జిగురు ఉపయోగించుకునేవాడు. అయితే అదే జిగురు పదార్థంతో గతేడాది సబ్బులు తయారు చేయడం ప్రారంభించిన డామిన్.. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో నత్త సబ్బులు విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు.

సృష్టిలోని ప్రతీ జంతువుకు ఏదో ఒక ప్రత్యేకత ఉండటం సహజం. అయితే నత్తలు మాత్రం ఓ రకమైన జిగురు పదార్థాన్ని (బురద) స్రవిస్తూ ఉంటాయి. ఆ పదార్థం వల్లే శరీర, ఆరోగ్య సమస్యలను తమకు తాముగా బాగుచేసుకుంటాయి. ఈ విషయం తెలుసుకున్న డామిన్ ఆ పదార్థాన్ని సేకరించి సబ్బుల తయారీ మొదలుపెట్టాడు. అయితే ఇప్పటికే నత్తలపై జరిగిన పరిశోధనల ప్రకారం నత్త జిగురులో కొల్లాజెన్ (collagen), ఎలాస్టిన్ (elastin) అనే ప్రోటీన్స్ ఉంటాయని తేలింది. సాధారణంగా కొల్లాజెన్‌ను సబ్బుల తయారీలో వినియోగిస్తుంటారు.

కనెక్టివ్ టిష్యూలోనూ భాగమైన ఈ పదార్థం చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇక ‘ఎలాస్టిన్’.. ఎక్స్‌ట్రాసెల్యూలర్ మాతృకలోని ముఖ్య ప్రోటీన్ కాగా, ఇది సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. శరీరంలోని అనేక కణజాలాలను సాగదీయడం లేదా కుదించడం తర్వాత వాటి ఆకారాన్ని తిరిగి పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ రెండు ప్రోటీన్స్ కూడా గాయాలను నయం చేయగలవు. చర్మ కణాలను రిపేర్ చేయడంతో పాటు ముసలితనం రాకుండా ఆపగలవని పరిశోధకులు తెలిపారు. ఇక నత్త జిగురుతో ఉత్పత్తి చేసిన సబ్బుల వల్ల చర్మానికి, ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నట్టు తేలడంతో ఫ్రాన్స్‌లో ఈ ఉత్పత్తులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ప్రస్తుతం నేను 60,000 నత్తల్ని పెంచుతున్నాను. పునరుత్పత్తి దశకు చేరుకున్నప్పుడు వాటిని విశాలమైన ప్రాంతంలో వదిలేయాలి. ఒక నత్త సుమారు 2 గ్రాముల జిగురును ఇస్తుంది. అంటే 80 గ్రాముల జిగురుకు 40 నత్తలు అవసరమవుతాయి. ఈ పరిమాణం పదిహేను 100-గ్రాముల సోప్ బార్లను తయారు చేయడానికి సరిపోతుంది. జిగురులోని కొల్లాజెన్, ఎలాస్టిన్ ప్రొటీన్ అణువులు యాంటీ ఏజింగ్‌లా ఉపయోగపడతాయి. నత్తలు కూడా సహజంగా జిగురును ఉపయోగించి దెబ్బతిన్న వాటి షెల్స్‌ను బాగుచేసుకుంటాయి. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున సబ్బులు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
– డామిన్ డెస్రోచర్

Next Story

Most Viewed