Explained: హౌతీలు ఎవరు? ఎర్ర సముద్రంలో దాడులు ఎందుకు చేస్తున్నారు?

by Dishanational5 |
Explained: హౌతీలు ఎవరు? ఎర్ర సముద్రంలో దాడులు ఎందుకు చేస్తున్నారు?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎర్ర సముద్రం ఎరుపెక్కింది. హౌతీలకు యూఎస్, యూకే కూటమి దేశాలకు మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గతకొన్ని వారాలుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా, బ్రిటన్ సైన్యాలు.. శుక్రవారం తెల్లవారుజామున యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై ప్రతీకార దాడులు నిర్వహించాయి. హౌతీల రక్షణ వ్యవస్థ స్థావరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలపై యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఆరుగురు ఫైటర్లు మరణించారని, ఇందుకు మూల్యం చెల్లించుకుంటారని హౌతీ హెచ్చరించింది. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా, హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాలతో తీవ్ర ఆందోళన చెందుతున్న ప్రపంచ దేశాలు.. తాజా పరిణామంతో మరోసారి ఉలిక్కిపడ్డాయి. కరోనా మహమ్మారి, యుద్ధాలతో దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు.. హౌతీల తాజా చర్యలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయింది. ఈ క్రమంలోనే అసలు హౌతీలు ఎవరు? ఎర్ర సముద్రంలోని నౌకలపై దాడులు ఎందుకు చేస్తున్నారు? వారి లక్ష్యం ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం.

హౌతీలు ఎవరు?

మధ్యప్రాచ్య దేశమైన యెమెన్ తొలి అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్‌కు(1990 నుంచి 2012వరకు పాలన) వ్యతిరేకంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి పేరే ‘హౌతీ’. ఈ సంస్థ 1992లో జైదీ(షియా ఇస్లాంలోని ఒక వర్గం) మత నాయకుడు హుస్సేన్ అల్-హౌతీ నాయకత్వంలో ఏర్పడింది. అబ్దుల్లా సలేహ్‌ అవినీతికి పాల్పడ్డారనేది హౌతీల ఆరోపణ. హౌతీలను తమ మద్దతుదారులు అన్సార్ అల్లా(దేవుడి మద్దతుదారులు) అని కూడా పిలుస్తారు. ఇదొక సాయుధ సంస్థ. యెమెన్‌ రాజధాని సనాతోపాటు పొరుగు దేశం సౌదీకి దగ్గరగా ఉండే పలు ప్రాంతాలు హౌతీల ఆధీనంలోనే ఉన్నాయి. హౌతీ సంస్థ 90లలో ఏర్పడినప్పటికీ, 2014లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. ఆ ఏడాది యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, కూల్చేసింది. దీని ఫలితంగా ఆ దేశంలో తీవ్ర మానవతా సంక్షోభం ఏర్పడింది. హౌతీలకు ఇరాన్ మద్దతు ఉంది. ఇరాన్ మద్దతుతోనే సౌదీ అరేబియా నేతృత్వంలోని సైనిక కూటమిపై కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఇరు పక్షాలు పలుమార్లు శాంతి చర్చలు జరిపినా ఓ కొలిక్కిరాలేదు.

17 దేశాల్లో విస్తరణ

హౌతీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 17దేశాల్లో విస్తరించి ఉందనేది అమెరికా రక్షణశాఖ అంచనా. హౌతీలకు ఇరాన్‌తోపాటు సిరియా, నార్త్ కొరియా, ఒమన్, లిబియా వంటి దేశాలు సహా ఉగ్రసంస్థలుగా ప్రకటించిన హెజ్‌బొల్లా, హమాస్(గాజా స్ట్రిప్) వంటి గ్రూప్‌లు మిత్రపక్షాలుగా ఉన్నాయి. అలాగే, యెమెన్ ప్రభుత్వంతోపాటు సౌదీ, భారత్, యూఎస్, యూకే, యూఏఈ, ఈజిప్ట్, జోర్డాన్, ఆస్ట్రేలియా, మలేషియా, జర్మనీ సహా అనేక దేశాలు హౌతీలకు శత్రువులు.

యెమెన్‌లో అంతర్యుద్ధం

దేశంలోని పలు ప్రాంతాలను హౌతీలు తమ ఆధీనంలో ఉంచుకోవడంతో యెమెన్‌లో దశాబ్దకాలంగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. దేశ రాజధాని సనా హౌతీల ఆధీనంలోనే ఉండటంతో ఆ దేశ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి నేతృత్వంలోని ప్రభుత్వం అడెన్ సిటీ నుంచి పాలన సాగిస్తోంది. దేశ బహిష్కృత అధ్యక్షుడు అబ్ద్-రబ్బు మన్సూర్ హదీ తర్వాత అల్-అలిమి 2022లో పదవిలోకి వచ్చారు. అంతర్యుద్ధం కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభం యెమెన్‌లో ఏర్పడిందని ఐక్యరాజ్య సమితి గతేడాది మార్చిలో వెల్లడించింది. దేశంలో మూడింట రెండొంతుల జనాభాకు(దాదాపు 2.16కోట్ల మంది) మానవతా సాయం, రక్షణ సేవలు చాలా అవసరమని నివేదికలో పేర్కొంది. హౌతీలు, సైనిక సంకీర్ణాల మధ్య పోరు గతేడాది చాలా వరకు తగ్గింది. 2023లో హౌతీలు, ప్రభుత్వ దళాలు సుమారు 800 మంది బంధీలను పరస్పరం మార్చుకున్నాయి. అంతేకాకుండా, శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి సౌదీ అరేబియాతో హౌతీలు చర్చలు జరుపుతున్నారు. పైగా, హౌతీలకు మద్దతిస్తున్న ఇరాన్‌తో తన సంబంధాలను 2023లో సౌదీ పునరుద్ధరించుకోవడం శాంతి ఒప్పందంపై ఆశలు పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులెందుకు?

తాము ఇజ్రాయెల్‌తో సంబంధమున్న వాణిజ్య, మిలిటరీ నౌకలపైనే దాడులు చేస్తున్నామని హౌతీలు చెబుతున్నారు. గాజాపై యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగానే నౌకలపై దాడులు చేస్తున్నామని వెల్లడించారు. ‘‘ఎర్ర సముద్రంలో మేం చేపడుతున్న కార్యకలాపాలన్నీ గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా ప్రజలకు మద్దతుగానే చేస్తున్నాం. ముట్టడి, దురాక్రమణలు జరుగుతున్నప్పుడు చేతులు కట్టుకుని నిల్చోలేము’’ అని హౌతీ ప్రతినిధి మహ్మద్ అబ్దుల్‌సలామ్ గత డిసెంబర్‌లో వెల్లడించారు. యెమెన్‌పై యూఎస్, యూకే సైన్యం దాడులు జరిపిన తర్వాత కూడా తాము ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలపై దాడులు చేస్తూనే ఉంటామని హౌతీలు ప్రకటించడం గమనార్హం. అయితే, ఈ దాడులు హౌతీలకు ఇతర మార్గాల్లో లబ్ధి చేకూరుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దాడుల అనంతరం దేశీయంగా గ్రూప్ రిక్రూట్‌మెంట్‌లో అనూహ్య పెరుగుదల కనిపించిందని వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కంటైనర్ షిప్ ట్రాఫిక్‌లో 30శాతం ఎర్ర సముద్రం, సూయజ్ కాలువల నుంచే ఉంటుంది. కాబట్టి, ప్రపంచ వాణిజ్యానికి ఈ మార్గాలు వెన్నెముకలాంటివి. ఈ మార్గాల్లో ఎలాంటి ఆటంకం కలిగినా దాని ప్రభావం దాదాపు ప్రపంచ దేశాలన్నింటిపైనా పడుతుంది. కాబట్టి, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడుల వల్ల ఇతర దేశాలు, ప్రభుత్వాలతో చర్చలు జరిపే వీలుంటుందని, ఈ చర్చల ద్వారా యెమెన్‌లో అధికారిక ప్రభుత్వంగా హౌతీలకే అంతర్జాతీయంగా చట్టబద్ధతను సాధించవచ్చని అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed