670 మంది సజీవ సమాధి.. కొండచరియలు విరిగిపడి విషాదం

by Hajipasha |
670 మంది సజీవ సమాధి.. కొండచరియలు విరిగిపడి విషాదం
X

దిశ, నేషనల్ బ్యూరో : పసిఫిక్‌ దేశం పపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగిపడి చోటుచేసుకున్న బీభత్సంలో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగింది. మూడు రోజుల క్రితం ఎన్గా ప్రావిన్స్‌లోని కౌకలం గ్రామంలో సంభవించిన ఈ ఘటనలో తొలుత 100 మంది చనిపోయి ఉండొచ్చని భావించారు. అయితే కొండ చరియల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ విషాద ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఆదివారం మధ్యాహ్నం నాటికి 670 దాటింది. శుక్రవారం వేకువజామున కొండ చరియలు విరిగి ఇళ్ల మీద పడటంతో.. వీరంతా గాఢ నిద్రలోనే సజీవ సమాధి అయ్యారు.

నాలుగు ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణంలో శిథిలాలు

రెస్క్యూ వర్క్స్ నెమ్మదిగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారి సంఖ్య మరింత పెరగొచ్చని ‘అంతర్జాతీయ వలసల సంస్థ’ (ఐఓఎం) తెలిపింది. కొండ చరియలు విరిగిపడి కౌకలం గ్రామాన్ని రాళ్లదిబ్బగా మార్చాయని.. దీనివల్ల దాదాపు నాలుగు ఫుట్‌బాల్ మైదానాల మేర విస్తీర్ణంలో శిథిలాలు పరచుకున్నాయని వెల్లడించింది. కొండచరియల ధాటికి వందలాది ఇళ్లు నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకు పోయాయని తెలిపింది. బాగా ఎత్తు నుంచి కొండచరియ విరిగి పడటంతో.. ఆ ఒత్తిడికి దాదాపు ఆరు నుంచి ఎనిమిది మీటర్ల లోతు దాకా ఇళ్ల శిథిలాలు పేరుకుపోయాయి. దీంతో వాటిలోని ప్రజలు బతికే అవకాశం అస్సలు ఉండదని ఐఓఎం అధికార వర్గాలు తెలిపాయి. లక్కీగా గాయాలతో బయటపడిన కొందరిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈ గ్రామంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడే ముప్పు ఉండటం.. ఎన్గా ప్రావిన్స్‌ రాజధాని వాబాగ్‌ నుంచి ఘటనాస్థలానికి చేరుకునే మార్గంలో తెగల ఘర్షణల కారణంగా బాధితులకు సహాయక సామగ్రి చేరడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. సైనిక భద్రత నడుమ సహాయక కాన్వాయ్‌ల తరలింపు జరుగుతోంది.

Next Story