King Charles Coronation | కింగ్ చార్లెస్‌కు ముంబై డబ్బావాలాల ప్రత్యేక కానుక

by Dishanational1 |
King Charles Coronation | కింగ్ చార్లెస్‌కు ముంబై డబ్బావాలాల ప్రత్యేక కానుక
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రిటన్‌ రాజు కింగ్ చార్లెస్‌కు ముంబై డబ్బావాలాలు ప్రత్యేక కానుక పంపించారు. మే 6(2023)న పట్టాభిషిక్తుడు కానున్న రాజు చార్లెస్ కు ముంబై డబ్బావాలాలు ‘పునెరీ పగఢీ’ని (సంప్రదాయ తలపాగా) కానుకగా పంపారు. 2003లో భారత్‌ పర్యటనకు వచ్చిన చార్లెస్ డబ్బావాలలను కలిసి వారి సేవలను ప్రశంసించారు. దీంతో ముంబై డబ్బావాలాలు రాజు పట్టాభిషేకం సందర్భంగా తమ వంతు కానుకగా పునెరీ పగఢీ (మరాఠీ పురుషులు తలనుంచి భుజాలపై ధరించే తలపాగా)ని పంపించారు.

క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తరువాత రాజుగా కింగ్ చార్లెస్ పట్టాభిషేకం జరుగనుంది. ఈ వేడుక సందర్భంగా ముంబై డబ్బావాలాలు చార్లెస్ కు తమ సంప్రదాయ తలపాగాను కానుకగా పంపించారు.‘పునెరీ పగఢీ’తో పాటు పురుషులు మెడలో ధరించే కండువాను (ఉపర్నీ) కూడా పంపించారు. మహారాష్ట్రలోని పుణె నగరంలో 19వ శతాబ్దం నుంచి హోదాకు, గౌరవానికి ప్రతీకగా పునెరీ పగఢీని ధరిస్తారు. సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో ఉపర్నీని పురుషులు ధరిస్తారు.

అటువంటి గౌరవనీయమైన చిహ్నాలను బ్రిటన్ రాజుకు పంపించారు డబ్బావాలాలు. "బ్రిటన్ రాజు పట్టాభిషేకానికి తమకు ఆహ్వానించకపోయినా ఆయన భారత్ వచ్చినప్పుడు తమపై చూపించిన అభిమానానికి..తాము చేసే పనిని గౌరవించి గుర్తించిన ఆ ఘటన మాకు ఎప్పటి గుర్తుండిపోతుందని అందుకే ఈ అపురూప కానుకను పంపించామని డబ్బావాలాల సంఘం అధ్యక్షుడు రాందాస్‌ కర్వాండే తెలిపారు.

ఇటీవల ముంబైలో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి తమలో కొందరిని బ్రిటన్‌ దౌత్య అధికారులు పిలిచారని..ఈ సందర్భంగా వారికి పునెరీ పగఢీని, ఉపర్నీని అందజేశామని రాందాస్‌ కర్వాండే గురువారం (మే 4,2023) తెలిపారు. కాగా ముంబై డబ్బావాలాలకు బ్రిటన్‌ రాజ కుటుంబంతో సుదీర్ఘకాలంగా సంబంధాలు కొనసాగుతున్నాయి.


Next Story

Most Viewed