‘26/11’ కీలక సూత్రధారి మృతి: ఐరాస ధ్రువీకరణ

by Dishanational5 |
‘26/11’ కీలక సూత్రధారి మృతి: ఐరాస ధ్రువీకరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలోని 26/11 ఉగ్రదాడిలో కీలక సూత్రధారి, ఉగ్రసంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకులలో ఒకరైన హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టావి(77) మృతిచెందాడు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి(ఐరాస) భద్రతామండలి తాజాగా ధ్రువీకరించింది. ఐరాస తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన ప్రెస్ నోట్ ప్రకారం, పాక్ కస్టడీలో ఉన్న భుట్టావి.. పంజాబ్ ప్రావిన్సులోని మురిడ్కేలో గతేడాది మే 29న గుండెపోటుతో మృతిచెందాడు. కాగా, 2008 నవంబర్ 26న ముంబైలో ఉగ్రదాడులు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 10మంది పాకిస్తాన్ జీహాదీలు ముంబై నగరంలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, మెట్రో సినిమా హాల్‌తోపాటు 8 చోట్ల దాడులకు పాల్పడ్డారు. నాలుగు రోజులపాటు కొనసాగిన ఈ మారణకాండలో 173 మంది చనిపోగా, 300 మందికిపైగా గాయపడ్డారు.ఈ దాడికి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ కాగా, అతని డిప్యూటీగా భుట్టావి ఉన్నాడు. దాడి అనంతరం హఫీజ్ సయీద్‌ను పాక్ ప్రభుత్వం కస్టడీలోకి తీసుకోగా, అతను కస్టడీలో ఉన్నంతకాలం లష్కరే తోయిబా బాధ్యతలను భుట్టావి తీసుకున్నాడు. 2009లో భుట్టావిని సైతం కస్టడీలోకి తీసుకుంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం పాక్ జైల్లోనే ఉన్న హఫీజ్ సయీద్ 78ఏళ్ల కారాగార శిక్షను అనుభవిస్తున్నాడు.




Next Story

Most Viewed