మాల్దీవులకు భారత్ గట్టి దెబ్బ.. 40 శాతం తగ్గిన పర్యాటకుల సంఖ్య

by Disha Web Desk 17 |
మాల్దీవులకు భారత్ గట్టి దెబ్బ.. 40 శాతం తగ్గిన పర్యాటకుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-మాల్దీవుల ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం జనవరి-మార్చి 2024 మధ్య కాలంలో భారత్ నుంచి మాల్దీవులను సందర్శించే వారి సంఖ్య 34,847గా ఉంది, ఇది అంతకుముందు 2023 జనవరి-మార్చి మధ్య కాలంలో 56,208 గా నమోదైనట్లు డేటా పేర్కొంది. ఇరుదేశాల ఘర్షణల తర్వాత పర్యాటకుల సంఖ్య దాదాపు 40 శాతం తగ్గింది. దీంతో మాల్దీవుల పర్యాటక రంగం భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోయింది.

అయితే అదే సమయంలో చైనా నుంచి మాల్దీవులను సందర్శించే వారి సంఖ్య 200 శాతానికి పైగా పెరగడం గమనార్హం. చైనా నుండి 17,691 మంది పర్యాటకులు జనవరి-మార్చి 2023లో మాల్దీవులను సందర్శించగా, జనవరి-మార్చి 2024లో వారి సంఖ్య 67,399కి పెరిగింది, అంటే దాదాపు ఇది 281 శాతం వృద్ధిని నమోదు చేసింది. పర్యాటకుల రాకపోకలపై మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ తన నెలవారీ నివేదికను ఇటీవల విడుదల చేయగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

గతంలో మాల్దీవులను సందర్శించే దేశాల జాబితాలో రష్యా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో ప్లేస్‌లో ఉండేది, ఆ తరువాత చైనా నుంచి పర్యాటకులు పెరగడం మొదలైంది. దీంతో మాల్దీవుల టూరిజంలో టాప్ 10 మార్కెట్‌లో చైనా మొదటిస్థానంలో ఉండగా, భారత్‌లో ఆరో స్థానానికి చేరింది. గతేడాది డిసెంబర్ వరకు అక్కడి టూరిజం మార్కెట్‌లో భారత్‌దే ఆధిపత్యం. అయితే ఈ ఏడాది జనవరి 2 నుండి దాని స్థానం క్షీణించడం మొదలైంది. జనవరి 21 నాటికి ఐదో స్థానానికి, మార్చి 3 నాటికి ఆరో స్థానానికి పడిపోయింది.

మహ్మద్ మొయిజ్జూ ఆ దేశ అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు దూరమవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌తో పెట్టుకున్న ఘర్షణ కారణంగా మాల్దీవుల పర్యాటకం తీవ్రస్థాయిలో దెబ్బతింది. ప్రస్తుతం మాల్దీవులకు పోటీగా భారత్ లక్ష్యదీప్‌ను పర్యాటక హబ్‌గా మారుస్తుంది. ఇప్పటికే అక్కడ పర్యాటకులకు అన్ని సదుపాయాలను అందించడానికి అభివృద్ధి పనులు మొదలుపెట్టారు.

Next Story

Most Viewed