మళ్లీ కారుకు ఓటేస్తే.. మన బొంద మనం తవ్వుకున్నట్లే : ఆర్ఎస్పీ

by Disha Web Desk |
మళ్లీ కారుకు ఓటేస్తే.. మన బొంద మనం తవ్వుకున్నట్లే : ఆర్ఎస్పీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ మాయలకు మోసపోయి మళ్ళీ కారు గుర్తుకు ఓటు వేస్తే మన బొంద మనం తవ్వుకున్నట్లేనని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శనివారం ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామంలో టీఆర్ఎస్ గూండాల దౌర్జన్యాలకు అడ్డు అదుపులేకుండా పోతున్నదని తెలిపారు. ముకుందాపురం గ్రామంలో దాడులు జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఎక్కడుందని ప్రశ్నించారు.

చికాగో నగరంలో ఆర్ఎస్పీ

అమెరికాలోని చికాగో నగరంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ సమావేశంలో ఆర్ఎస్పీ పాల్గొన్నారు. గురుకుల పాఠశాలల్లో చదివి అమెరికాలో స్థిరపడిన ఎన్నారైలు, ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థులు సైతం వారి అనుభవాలను ఆర్ఎస్పీ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. అబ్రహం లింకన్ మెమోరియల్ మ్యూజియం సందర్శించినట్లు వారికి వివరించారు. అబ్రహంలింకన్ మాట '' నేను బానిసగా ఉండను అలాగని ఒక మాస్టర్‌గా కూడా ఉండను'' అని మ్యూజియంలో ఒక గోడపై ఉందన్నారు. మన పాలకులు మాత్రం ఆ మాటలకు భిన్నంగా ఉన్నారని తెలిపారు.

తన చిన్నతనంలో లారీ డ్రైవర్‌ కావాలని ఆశయం ఉండేదని ఆర్ఎస్పీ అన్నారు. తర్వాత తను చదివిన విధానం, ఐపీఎస్ ఎలా అయ్యారో వారికి వివరించారు. తెలంగాణ ఉద్యమంలో తను స్టూడెంట్స్ త్యాగాలను చూసి తను పోలీస్ సర్వీస్ నుంచి ఎడ్యూకేషన్ ఫీల్డ్‌లో సర్వీస్ చేయాలని అనుకున్నట్లు తెలిపారు. చదువనేది బహుజనులకు ఎంతో ముఖ్యమన్నారు. దుబాయ్‌లో తెలంగాణ ప్రజలు బానీసలుగా బతుకున్నారని, చదువులేకనే వారు కార్మికులుగా పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టు షాపులు ఉన్నాయని, చాలా మంది కూలీలు మద్యానికి బానిస అయ్యి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయన్నారు.

ఇప్పటివరకు సీఎం రాష్ట్రంలో ఒక్క యూనివర్సీటిని కూడా సందర్శించలేదన్నారు. యూనివర్సీటిల్లో విద్యార్థులకు సరిపడ ప్రొఫెసర్‌లు లేరని అన్నారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, నాయకులు మాత్రం వారి సమస్యలు పక్కన పెట్టి ఫాంహౌజ్‌లు నిర్మించుకుంటున్నారని అన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సమవేశంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం ప్రతినిధులు రాయ్‌దాస్ మంతెనా, వెంకట్ మారోజు, సాయి, బిందు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed