ఫ్రాన్స్‌తో సత్సంబంధాలపై చైనా ఫోకస్: మాక్రాన్ భారత పర్యటన తర్వాత కీలక పరిణామం

by Dishanational2 |
ఫ్రాన్స్‌తో సత్సంబంధాలపై చైనా ఫోకస్: మాక్రాన్ భారత పర్యటన తర్వాత కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత్, ఫ్రాన్స్ మధ్య పలు రక్షణ ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చైనా-ఫ్రాన్స్ భాగస్వామ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఫ్రాన్స్ సంబంధాలను బలోపేతం చేయాలని తెలిపారు. శాంతి, భద్రత, మానవ అభివృద్ధికి ఇరు దేశాలు తోడ్పడాలని పిలుపునిచ్చారు. చైనా-ఫ్రాన్స్‌ల మధ్య దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవం సందర్భంగా జిన్ పింగ్ ప్రసంగించారు. భవిష్యత్‌లో ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టంగా మార్చడానికి ప్రయత్నిస్తామన్నారు. మాక్రాన్‌తో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రపంచం మరోసారి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున చైనా- ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా నూతన మార్గాలను అన్వేషించాలని తెలిపారు.

దిగుమతులను పెంచడానికి ప్రతిపాదించాం: వాంగ్ యిూ

ఫ్రాన్స్‌ నుంచి దిగుమతులను పెంచడానికి తాము ప్రతిపాదించామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెల్లడించారు. ‘వినియోగదారు, పెట్టుబడి మార్కెట్ డిమాండ్‌ను విడుదల చేయడం కొనసాగిస్తాం. అంతేగాక ఫ్రాన్స్ నుంచి అధిక-నాణ్యత ఉత్పత్తులు, సేవల దిగుమతిని విస్తరిస్తాం’ అని తెలిపారు. ‘ఫ్రాన్స్ సైతం చైనా కంపెనీలకు న్యాయమైన, ఊహాజనిత వ్యాపార వాతావరణాన్ని అందిస్తుందని ఆశిస్తున్నట్టు వాంగ్ యీ చెప్పారు. కాగా, మాక్రాన్ ఐరోపాలో అమెరికా, చైనాల మధ్య సమతుల్య శక్తిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నందున చైనా ఫ్రాన్స్‌తో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది.

ఆ నిర్ణయంతో చైనా ఆందోళన!

భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హిందూ మహా సముద్రం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రతిష్టాత్మకమైన రక్షణకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించారు. దీంతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం పటిష్టంగా తయారయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతోనే చైనా ఆందోళన చెందుతోంది. అంతేగాక చైనాను ఎదుర్కోవడానికి అమెరికా, ఐరోపా సమాఖ్యలు భారత్‌ను ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా అప్రమత్తమై ఫ్రాన్స్‌తో సత్సంబంధాలను పెంచుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నది.

Next Story

Most Viewed