ఇందిరా గాంధీ హత్య పోస్టర్లపై స్పందించిన కెనడియన్ హైకమిషనర్ కామెరాన్

by Harish |
ఇందిరా గాంధీ హత్య పోస్టర్లపై స్పందించిన కెనడియన్ హైకమిషనర్ కామెరాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కాలంలో ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కెనడా ఉదాసీనత కారణంగా భారత్ పట్ల అనేక ఆగడాలకు పాల్పడుతున్నారు. తాజాగా వాంకోవర్ నగరంలో ఇందిరా గాంధీని హత్య చేస్తున్నట్లు పోస్టర్లు ఏర్పాటు చేయడం తీవ్ర కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై తాజాగా భారతదేశంలోని కెనడా హైకమిషనర్ కామెరూన్ మాకే స్పందించారు. ఎక్స్‌లో వ్యాఖ్యానించిన ఆయన, ఆదివారం బ్రాంప్టన్‌లో ఏర్పాటుచేసిన మరిన్ని పోస్టర్ల గురించి కెనడా ప్రభుత్వానికి తెలుసు, కెనడాలో హింసను ప్రోత్సహించడం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదు, ఈ విషయంలో దేశం స్పష్టంగా ఉందని ఒక పోస్ట్‌లో తెలిపారు.

ఆదివారం గ్రేటర్ టొరంటో ఏరియా (GTA)లో ఆపరేషన్ బ్లూస్టార్ 40వ వార్షికోత్సవం నిర్వహించగా, భారత రాయబార కార్యాలయం ఎదుట మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేస్తున్నట్లు పోస్లరు కనిపించాయి. ఇది కాస్త తీవ్ర దుమారానికి కారణమైంది. 1984లో ఖలిస్తానీ తీవ్రవాదులను ఏరివేయడానికి భారత సైన్యం గోల్డెన్ టెంపుల్‌పై దాడి చేసింది. అదే సంవత్సరం ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులు కాల్చి చంపారు. అయితే ఇప్పుడు కెనడాలో వెలసిన పోస్టర్లలో ఇందిరా గాంధీ శరీరంపై బుల్లెట్ రంధ్రాలు ఉండడం గమనార్హం.

సోమవారం కెనడా పార్లమెంట్‌లో భారత సంతతికి చెందిన చంద్ర ఆర్య, దేశంలో ఖలిస్తానీ ఉగ్రవాదుల చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లు అంటించి 'హిందూ-కెనడియన్లలో' హింసాత్మక భయాందోళనలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో కెనడాకు భారత్‌‌కు మధ్య సంబంధాలు క్షీణించాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చి చంపిన ఘటనలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

Next Story