చనిపోయిన రెండు వారాల తర్వాత నావల్నీ అంత్యక్రియలు

by Dishanational4 |
చనిపోయిన రెండు వారాల తర్వాత నావల్నీ అంత్యక్రియలు
X

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ రాజకీయ ప్రత్యర్ధి, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ ఫిబ్రవరి 16న అనుమానాస్పద స్థితిలో జైలులో చనిపోయారు. ఎట్టకేలకు రెండు వారాల తర్వాత ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం మాస్కోలో జరిగాయి. నావల్నీ భౌతిక కాయాన్ని తొలుత మాస్కోలోని ఓ చర్చిలోకి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం బోరిసోవ్‌స్కోయ్ శ్మశానవాటికలో నావల్నీకి అంత్యక్రియలు చేశారు. పోలీసుల కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ వేలాది మంది ప్రజలు నావల్నీకి తుది వీడ్కోలు పలికారు. ‘‘నావల్నీ.. నావల్నీ..’’, ‘‘మీరు భయపడలేదు.. మేం బెదరలేదు!’’, ‘‘యుద్ధం వద్దు’’ అంటూ అంత్యక్రియల్లో పాల్గొన్నవారు నినాదాలు చేశారు. నావల్నీ తల్లిదండ్రులు, అమెరికా రాయబారి లిన్ ట్రేసీ సహా పశ్చిమ దేశాల దౌత్యవేత్తలు, అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయాలని ఆశించిన బోరిస్ నదేజ్దిన్, యెకథెరినా దంత్సోవా తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖుల జాబితాలో ఉన్నారు. నావల్నీ భార్య, కుమార్తె, కుమారుడి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. విదేశాల్లో తలదాచుకుంటున్న నావల్నీ రాజకీయ సన్నిహితులు యూట్యూబ్ ఛానెల్‌లో అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఇక ఈ అంత్యక్రియలకు ముందు మాస్కోలో అధికార వర్గాలు కీలక ప్రకటన చేశాయి. ప్రజలు పెద్దఎత్తున ఒకచోట గుమిగూడితే చట్టపరమైన ఉల్లంఘనగా పరిగణిస్తామని హెచ్చరించాయి. అయినప్పటికీ నావల్నీ అంత్యక్రియల్లో పెద్దసంఖ్యలోనే ప్రజలు పాల్గొన్నారు. కాగా, నావల్నీ మరణానికి గల కారణాన్ని రష్యా ప్రభుత్వ అధికారులు ఇంకా ప్రకటించలేదు.



Next Story

Most Viewed