వ‌ర‌ల్డ్ టూర్‌లో 22 ఏళ్లు గ‌డిపి ఇంటికొచ్చిన‌ అర్జెంటీనా ఫ్యామిలీ! ఈ లోపే 4 పిల్ల‌లు..!!

by Disha Web Desk 20 |
వ‌ర‌ల్డ్ టూర్‌లో 22 ఏళ్లు గ‌డిపి ఇంటికొచ్చిన‌ అర్జెంటీనా ఫ్యామిలీ! ఈ లోపే 4 పిల్ల‌లు..!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌తి మ‌నిషి జీవ‌న‌ ప్ర‌యాణం ప్ర‌త్యేక‌మైన‌దే. అయితే, కొంద‌రి జీవిత‌కాల ప్ర‌యాణం మ‌రింత ప్ర‌త్యేకంగా ఉంటుంది. ఈ అర్జెంటీనా కుటుంబ ప్ర‌యాణం స‌రిగ్గా అలాంటిదే. 22 ఏళ్లపాటు 100 దేశాలు తిరిగి త‌మ‌ జీవితకాల యాత్రను పూర్తి చేసుకున్నారు. 2000 సంవ‌త్స‌రంలో ప్రారంభమైన ఈ సాహసయాత్రలో ఐదు ఖండాలను చుట్టి వ‌చ్చారు. 1928 నాటి ఓ వింటేజ్ వాహ‌నంలో చేసిన ఈ యాత్ర‌లో న‌లుగురు పిల్ల‌ల్ని క‌ని, వారిని పెంచుకుంటూ తిరిగారు. తాజాగా వారు సొంత దేశం అర్జెంటీనాలోని త‌మ ఇంటికి చేరుకున్నారు.

హెర్మన్, కాండేలారియా దంప‌తులు త‌న కుటుంబంతో మొత్తం 3,62,000 కిలో మీటర్లు (225,000 మైళ్ళు) ప్ర‌యాణించారు. జనవరి 25, 2000న ప్రారంభమైన ఈ యాత్ర 2022 మార్చ్ 13న‌, ఉరుగ్వే సరిహద్దుకు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన హెర్మ‌న్ "మేము ఒక కలను ముగించాము. ఒక కలను నెరవేర్చుకున్నాము" అని అన్నారు. "ఇంకా ఈ ప్ర‌యాణం ఆగ‌లేదు ఇప్పుడు ఏమొస్తుందో తెలియ‌దు? వేల మార్పులు, వేల ప్ర‌త్యామ్నాయాలు.. ఇంకా కొన‌సాగుతూనే ఉంటాయి" అని వెల్ల‌డించారు. 53 ఏళ్ల వయస్సులో, ఇప్పటికీ ప్రపంచాన్ని మ‌రింత తిర‌గేయాల‌నే ఆలోచనలో ఉన్నాడు హెర్మ‌న్.




అదే 'అపురూపం'

ఈ యాత్ర ప్రారంభమైనప్పుడు హెర్మ‌న్ భార్య కాండేలారియాకు 29 ఏళ్లు. అప్ప‌టికి వీరికి పెళ్ల‌యి ఆరేళ్లు. మంచి ఉద్యోగాలు... పిల్ల‌ల్ని క‌ని, హాయిగా జీవించాల‌ని ఓ ఇల్లును కూడా క‌ట్టుకున్నారు. అయితే, "వండ‌ర్ ల‌స్ట్" మైండ్‌లో ప‌డ‌గానే, బ్యాక్ ప్యాక్ వేసుకొని, అల‌స్కా నుంచి ప్ర‌యాణం ప్రారంభించారు. ఈ ప్ర‌యాణం మ‌ధ్య‌లోనే ఎవరో వారికి ఒక కారును బ‌హుమానంగా ఇచ్చారు. 1928 నాటి అమెరికన్ మేక్ మోడల్ గ్రాహం-పైజ్ అది. డొక్కు ఇంజిన్‌, మాసిన రంగు, చిరిగిన సీట్లు, స‌రైన క‌ప్పు కూడా లేదు. ఇక ఎయిర్ కండీష‌న్ మాటే ఎత్తనే కూడ‌దు... అలాంటి కారులో ఊహ‌కంద‌ని ఓ అంద‌మైన క‌ల‌ను, అద్భుత‌మైన ప్ర‌పంచాన్ని క‌లియ‌దిరిగారు. ఇప్పుడు 51 ఏళ్ల వయస్సు ఉన్న ఆమె ఈ ప్ర‌యాణంలో ఎంతో నేర్చుకున్నానంటారు. అన్నిటిక‌న్నా తాను తెలుసుకున్న‌ గొప్ప విష‌యం "ప్రజలు అద్భుతమైనవారు. మానవత్వం అపురూపమైనది," అని అంటారు. 102 దేశాల‌కు త‌గ్గ‌కుండా తిరిగిన వీరి ప్రయాణంలో కొన్నిసార్లు యుద్ధాలు, ఇతర సంఘర్షణల కారణంగా పక్కదారి పట్టవలసి వ‌చ్చింద‌ని చెప్పారు.

అద్భుత అనుభ‌వం

22 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్ర‌యాణంలో కేవలం ఎనిమిది సెట్ల టైర్లను మాత్ర‌మే మార్చ‌డం విశేషం. ఇక‌, రెండుసార్లు మెయిన్ ఇంజిన్‌ చేయాల్సి వచ్చింది. క్యాంప్ అవుట్‌కి వెళ్లేట‌ప్పుడు పిల్లలు పడుకోవడానికి పైన టెంట్‌ను ఏర్పాటు చేసేవారు. ఇక‌, పుట్టిన మొదటి ఇద్దరు పిల్లల్లో పంపా(19), అమెరికాలో పుట్ట‌గా 16 ఏళ్ల టెహ్యూ, అర్జెంటీనాలో జ‌న్మించింది. కెనడాలో పలోమా (14), ఆస్ట్రేలియాలో వాలబీ (12) జ‌న్మించారు. కుటుంబంలో టిమోన్ అనే కుక్క, హకునా అనే పిల్లి చేరాయి. అయితే, ఈ ప్ర‌యాణం అనుకున్నంత‌ సులవుగా జరగలేదు. హెర్మన్ కుటుంబం ఆయా ప్రాంతాల్లో ఆయా సంద‌ర్భాల‌ను బ‌ట్టి మలేరియా, బర్డ్ ఫ్లూ వ్యాధుల‌కు గుర‌య్యారు. ఆఫ్రికాలో ఎబోలా, మధ్య అమెరికాలో డెంగ్యూ జ్వరంతో బాధ‌ప‌డ్డారు. అన్ని అనుభ‌వాల‌ను క్రోడీక‌రించి వాళ్లు రాసిన "క్యాచింగ్ ఏ డ్రీం" పుస్త‌క‌మే వారికి జీవనాధారమ‌య్యింది. అవును, ఈ ప్ర‌యాణంలో దాదాపు ల‌క్ష‌ కాపీలు అమ్ముకుంటూ, ఆ డ‌బ్బుల‌తో ప్ర‌యాణాన్ని కొన‌సాగించారు. ఈ ప్ర‌యాణం దంప‌తులిద్ద‌రి అనుభ‌వం మాత్ర‌మే కాదు వారి న‌లుగురు పిల్ల‌ల‌కు పంచిచ్చిన అత్య‌ద్భుత అవ‌కాశం, అనిర్వ‌చ‌నీయమైన‌ బ‌హుమానం!





Next Story

Most Viewed