50ఏళ్లలో సాధించలేనిది ఆరునెలల్లో సాధించాం

by  |
50ఏళ్లలో సాధించలేనిది ఆరునెలల్లో సాధించాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాగునీటిపారుదల శాఖలో 50ఏళ్లుగా సాధించలేని పనిని ఆరు నెలల్లో ఇరిగేషన్ ఇంజనీర్లు సాధించారని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. ప్రస్తుతం సాగునీటి శాఖ ఆస్తుల సమగ్రమైన వివరాలు ప్రాజెక్ట్ మానిటరింగ్ సిస్టమ్‌లో అందుబాటులో ఉన్నాయని, వీటిని తయారు చేయడంతోనే పని అయిపోలేదని, దీనిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నారు. సాగునీటి శాఖ ఆస్తుల ఇన్వెంటరీ నిర్వాహణపై మంగళవారం జలసౌధలో వర్క్‌షాప్ నిర్వహించారు. సాగునీటిపారుల శాఖ సేకరించిన భూమి, తదితర ఆస్తుల ఇన్వెంటరీని సమగ్రంగా తయారు చేయాలని సీఎం కేసీ‌ఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఆరు నెలలుగా సాగునీటి శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి సమగ్రమైన ఇన్వెంటరీ తయారు చేశారు.

ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే సాగునీటి పారుదలశాఖలో పునర్‌వ్యవస్థీకరణ అమలవుతుందని, దీనిలో ఈ ఇన్వెంటరీ కీలకం అవుతుందన్నారు. వివిధ అవసరాలకు సాగునీటి శాఖ సేకరించిన భూమి 12.80 లక్షల ఎకరాలను ఆధారాలతో సహా పొందుపరచామని, ఈ భూమి అంతా కూడా రెవెన్యూ అధికారులు సాగునీటి శాఖ పేరు మీదకు బదిలీ చేశారని వివరించారు. 125 జలాశయాలు, 8661 కి.మీ. ప్రధాన కాలువలు, 13,373కి.మీ. డిస్ట్రిబ్యూటరీలు, 17,721 కి.మీ. మైనర్లు, 910 కి.మీ. పైపులు, 125 మేజర్ ఎత్తిపోతలు, 20మధ్యతరహా ఎత్తిపోతలు, 13చిన్న తరహా ఎత్తిపోతలు, 38,510 చెరువులు, కుంటలు, 8,021 చెక్ డ్యాంలు, ఆనకట్టలు, 175 కిమీ సొరంగాలు, కాలువల మీద 1,26,477 స్ట్రక్చర్లు, 108 విద్యుత్ సబ్‌స్టేషన్లు, 64 రెయిన్ గేజులు, 21 రివర్ గేజులు ఉన్నాయని వివరించారు.

Next Story

Most Viewed