విధులకు వెళ్లి.. విగత జీవిగా ఇంటికి..

by  |
విధులకు వెళ్లి.. విగత జీవిగా ఇంటికి..
X

దిశ,మునుగోడు: అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అద్దంకి గ్రామానికి చెందిన వేముల ఆంజనేయులు(42) కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చి వనస్థలిపురంలో స్థిరపడ్డాడు. అతడు అంకిరెడ్డిగూడం గ్రామ శివారులోని ఐశ్వర్య రిఫైనరీ ఆయిల్ పరిశ్రమలో స్టోర్ ఇంచార్జీగా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి విధుల్లో ఉన్న సమయంలో ఆంజనేయులు అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులకు కంపెనీ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. అనంతరం అతన్ని చౌటుప్పల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆంజనేయులు మృతి చెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

కాగా ఆస్పత్రికి కుటుంబ సభ్యులు చేరుకునే లోపే కంపెనీ ప్రతినిధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన భర్త ఎలా చనిపోయాడో తెలపాలంటూ ఫోన్ లో కంపెనీ ప్రతినిధులను మృతుడి భార్య కోరగా గుండెనొప్పి వచ్చి చనిపోయాడని నిర్లక్ష్యపు సమాధానమిచ్చారు. తన భర్తకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవనీ, కంపెనీలో ఏదో ప్రమాదానికి గురై చనిపోతే గుండెనొప్పితో చనిపోయాడంటూ కట్టు కథలు చెపుతున్నారని ఆరోపించింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. దీంతో రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఎక్స్ గ్రేషియా విషయమై కంపెనీ యాజమాన్యంను కుటుంబ సభ్యులు శుక్రవారం సంప్రదించగా ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు. దీంతో సాయంత్రం కంపెనీ ముందు ఆంజనేయులు మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఈ విషయంపై చౌటుప్పల్ సీఐ వెంకన్నను వివరణ కోరగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరణానికి గల కారణం తెలుస్తుందని అన్నారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed