ఒకేసారి పట్టభద్రులైన తాత-మనవరాలు!

by  |
Grandfather
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో అనుకున్నది సాధించకపోయినా పర్వాలేదు కానీ ప్రయత్నంలో లోపమైతే ఉండకూడదు. కానీ కొందరు మాత్రం ‘ఈ వయసులో ఏం చేస్తాంలే.. మన వల్ల కాదులే’ అని మొగ్గ దశలోనే తమ ఆలోచనల్ని తుంచేస్తారు. అదే కార్యసాధకులు మాత్రం.. ఆర్థిక కష్టాలు, సమయం, సందర్భం, వయసు, జెండర్ వంటి ఏ కారణాన్ని సాకుగా చూపరు. కచ్చితంగా అనుకున్నది సాధించి తీరతారు. 87 ఏళ్ల ముసలితనాన్ని ఎదిరించి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందిన ‘రెనే నీరా’ ఇందుకు నిదర్శనం. అంతేకాదు తన మనవరాలు ‘మెలానీ సలాజర్’ సైతం అదే రోజు మాస్ కమ్యూనికేషన్స్‌లో బీఎ పట్టా పుచ్చుకోవడం విశేషం. ఇక ఆరోగ్యం సహకరించకున్నా వీల్‌చైర్‌లో వచ్చి మరీ తన గ్రాండ్ డాటర్‌‌తో కలిసి గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

1950లో సెయింట్ మేరీస్ యూనివర్సిటీలో చదువుకున్న నీరా.. పెళ్లి తర్వాత చదువు ఆపేశాడు. అయితే భార్య మరణం తర్వాత తిరిగి స్టడీస్ కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు 2016లో ‘UTSA కాలేజ్ ఆఫ్ లిబరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌’లో మనవరాలితో కలిసి జాయిన్ అయ్యాడు. 82 ఏళ్ల వయసులో కాలేజీలో అడుగుపెట్టిన నీరా.. మొత్తానికి తను అనుకున్నది సాధించి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. వీరిద్దరూ పట్టా అందుకున్న స్ఫూర్తిదాయక క్షణాలను UTSA కాలేజీ యాజమాన్యం తమ అధికారిక ఫేస్‌బుక్, ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఈ తాత, మనవరాలి స్టోరీకి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే, టెక్సాస్ ప్రతినిధుల సభ సభ్యుడు డియెగో బెర్నాల్, స్క్రీన్ రైటర్ & ఫొటో జర్నలిస్ట్ రొలాండో గోమెజ్, సెనేటర్ జోస్ మెనెండెజ్‌ కూడా ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

వృద్ధాప్యంలో పట్టా పుచ్చుకోవాలన్న కలను నెరవేర్చుకున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. 2015లో 94 ఏళ్ల US వ్యక్తి పట్టభద్రుడు కాగా.. రిటైర్డ్ ప్రొఫెసర్ MK ప్రేమ్ రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో బహుళ కోర్సుల్లో చేరాడు. కొందరికి జ్ఞాన దాహం ఎప్పటికీ తీరదని ఈ కథలు రుజువు చేస్తున్నాయి.

Next Story

Most Viewed