వింబుల్డన్‌లో తొలిసారి ‘యూనిసెక్స్’ టవల్స్

by  |
వింబుల్డన్‌లో తొలిసారి ‘యూనిసెక్స్’ టవల్స్
X

దిశ, ఫీచర్స్ : పిల్లలు పుట్టినప్పటినుంచే ఆడ, మగ తేడాలు చూపిస్తూ పెంచుతారు పేరెంట్స్. బట్టలు, బొమ్మలు, ఆటల విషయంలోనూ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఇటీవల కాలంలో కొన్ని రంగులు కూడా జెండర్‌ను చెప్పేస్తున్నాయి. పింక్ వర్ణం అమ్మాయికి ప్రతీకగా, బ్లూ కలర్ పురుషుడి చిహ్నంగా మారిపోయింది. అందువల్లే జెండర్ రివీల్ పార్టీల్లో థీమ్‌గా ఆ రంగులను ఎంచుకోవడం చూస్తూనే ఉన్నాం. దుస్తుల‘రంగు’కు సెక్స్ ఆపాదించే విషయంలో వింబుల్డన్ నిర్వాహకులు ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు యూనిసెక్స్ టవల్స్ అందించి స్టీరియోటైప్స్‌ను బ్రేక్ చేశారు.

ప్రపంచంలోనే ఓల్డెస్ట్ టెన్నిస్ టోర్నమెంట్‌ ‘వింబుల్డన్’. 1877లో ఔట్‌డోర్ గ్రాస్‌ కోర్డులో ప్రారంభమైన ఈ ఆటకు విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇక ప్రతి ఏటా లండన్‌లో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలకు వివిధ దేశాల నుంచి ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆటలో పాల్గొనే పురుషులు, మహిళా ప్లేయర్స్‌కు ఇదివరకు వేర్వేరు రంగు తువ్వాళ్లను అందించేది. గత ఏడాది మేల్ ప్లేయర్స్‌కు ఆకుపచ్చ, ఊదా రంగు ‘చాంపియన్‌షిప్’ టవాల్స్ అందించగా.. మహిళా క్రీడాకారులకు కాలానుగుణంగా వివిధ రంగుల తువ్వాళ్లు ఇవ్వగా.. 2019లో మాత్రం పింక్ తువ్వాళ్లను ఇచ్చారు. దాంతో వింబుల్డన్ చరిత్రలో తొలిసారి ఆటగాళ్లకు యునిసెక్స్ తువ్వాళ్లను అందించడం విశేషం.

‘సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నాం. అయినా ఇదే ఎందుకు సంప్రదాయం అని ఆలోచిస్తున్నాం. జెండర్ ఈక్వాలిటీ ప్రదర్శించే అతి కొన్ని క్రీడల్లో ఇది ఒకటి’ అని వింబుల్డన్ నిర్వాహకులు తెలిపారు. అంతకుముందు కూడా వింబుల్డన్ సమాజం హర్షించదగ్గ నిర్ణయాలు తీసుకుంది. మహిళల మ్యాచ్‌లలో ‘మిస్’, ‘మిసెస్’ టైటిళ్లతో స్కోర్‌లను ప్రకటించే పద్ధతిని విరమించుకోగా, మేల్, ఫిమేల్ ప్లేయర్స్‌ వేతన విషయంలోనూ సమాన పద్ధతికి శ్రీకారం చుట్టింది.

వింబుల్డన్ ఆటగాళ్లు ఉపయోగించిన తువ్వాళ్లను కూడా ఇక్కడ విక్రయిస్తారు. ఎందుకంటే అవి ప్రేక్షకులకు మధుర జ్ఞాపకంగా ఉండిపోతాయి. 2019 రెండు వారాల టోర్నమెంట్‌లో 27,419 ఛాంపియన్‌షిప్స్ తువ్వాళ్లు అమ్ముడు పోవడం విశేషం.

Next Story