కృష్ణా జలాల వివాదంపై షర్మిల నిర్ణయం ఇదేనా..?

by  |
why YS sharmila no comments on krishna water dispute
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల తరలింపు వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయి. ఇన్ని రోజులు ఇద్దరు సీఎంలు జగన్, కేసీఆర్ మధ్య స్నేహబంధం కొనసాగింది. అయితే తాజాగా కృష్ణా జలాల తరలింపు అంశంపై విభేదాలు తలెత్తాయి. ఒకరినొకరు పరస్పరం దూషించుకునే వరకు వెళ్లింది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల నేతలు రాజకీయం చేస్తున్నా.. చిక్కులు మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయ షర్మిలకు తప్పేలాలేవు.

ఏపీ ప్రభుత్వం రాయలసీమలో సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది. కృష్ణా జలాలను అక్కడికి అక్రమంగా తరలించేందుకే ఆ ప్రాజెక్టును చేపడుతున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు ఎక్కుపెడుతోంది. ఈ అంశంలో తను ఎవరి తరుఫున నిలబడి పోరాడాలో తెలియక అయోమయంలో షర్మిల పడినట్లు తెలుస్తోంది. ఎవరికి మద్దతిచ్చినా ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా ఆమె పరిస్థితి మారింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది తన అన్న జగన్ ప్రభుత్వం. ఇక్కడ తెలంగాణలో కొత్త పార్టీ భవితవ్యం. ఎవరికి అనకూలంగా వ్యాఖ్యలు చేసినా సరే.. ఏదో ఒక ప్రాంత ప్రజల నుంచి ప్రతికూలత తప్పేలా కనిపించడంలేదు. అందుకే మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అటు వైపా.. ఇటు వైపా..

తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా పోరాడుతానని, ఆఖరికి అది తన అన్న అయినా సరే.. తగ్గేదేలేదని వైఎస్ షర్మిల ఒక సందర్భంలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కృష్ణా జలాల వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్నా ఆమె మాత్రం మౌనం వహిస్తున్నారు. ఇది తనకెంతో సున్నితమైన అంశం కావడంతోనే మిన్నుకుండిపోయినట్లు తెలుస్తోంది. ఏపీ తరుపున నిలవాలా? తెలంగాణ తరుపున నిలవాలా అని డైలమాలో పడింది. తను పుట్టిన గడ్డ రాయలసీమలోనే ప్రాజెక్టు చేపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అక్కడ తన అన్న ప్రభుత్వానికి మచ్చ పడే అవకాశాలున్నాయి. వైఎస్సార్ అభిమానులు, బంధుగణం, ప్రజల నుంచి ఆమెకు వ్యతిరేకత ఏర్పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆ ప్రాంత ప్రజలు తమకు ద్రోహం చేస్తోందని తిరస్కరించేందుకూ అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై స్పందించకపోయినా తెలంగాణలో పార్టీ మనుగడకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.

తెలంగాణలో పార్టీ మనుగడకే దెబ్బ

నీళ్లు, నిధులు, నియామకాలే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆయువుపట్టు. వాటికోసమే యావత్ తెలంగాణ పోరాడింది. ఎందరో బలిదానాల అనంతరం స్వరాష్ట్రం సాధించుకున్నాం. అలాంటిది తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని టీఆర్ఎస్ నేతలు ప్రతిరోజు ఏపీ సీఎం జగన్ పై విమర్శలు సంధిస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు వైఎస్ షర్మిల. జల వివాదం అంశంలో తెలంగాణకు మద్దతుగా పోరాటం చేయకుంటే ప్రజల్లో భరోసా కల్పించడం షర్మిలకు ఇబ్బందిగా మారే అవకాశముంది. లేకపోతే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదముంది. దీంతో ఆదిలోనే తన రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడే పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదంలో షర్మిల ఒక వేళ జగన్ కు, ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడితే తెలంగాణలో పార్టీకి పుట్టగతులుండవు.

పార్టీ ఆవిర్భావానికి ముందే షాకులు

తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు వైఎస్ షర్మిల అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూలై 8వ తేదీన తన తండ్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని పార్టీ జెండా, ఎజెండాను ఆమె ప్రకటించునున్నారు. పార్టీ ఆవిర్భావానికి మరికొద్ది రోజులే మిగిలుంది. ఈ సమయంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలు తరలిస్తున్నారన్న వివాదానికి తెరదీశారు. వారు ఇన్ డైరెక్ట్ గా తెలంగాణలో పార్టీ పెడతానన్న షర్మిలను కూడా టార్గెట్ చేశారు.

వైఎస్ షర్మిల తన పుట్టినిల్లు రాయలసీమ అయితే మెట్టినిల్లు తెలంగాణ అని, తన విద్యాభ్యాసంతో పాటు, తన పిల్లలు కూడా తెలంగాణలోనే జన్మించారని పలు సందర్భాల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే షర్మిల ఒక ప్రాంతానికి మద్దతు తెలిపితే మరో ప్రాంత ప్రజలు ఊరుకోరు. షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతోంది కాబట్టి ఇక్కడి ప్రాంత ప్రజలకు అనుకూలంగా మాట్లాడక తప్పదు. తన మద్దతు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఇదే అదునుగా భావించి షర్మిలను కావాలనే ఇరకాటంలో పెట్టేందుకు అధికార పార్టీ నేతలు ప్రణాళికలు చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఏపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే జగన్ కు మచ్చే..

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన దృష్ట్యా కృష్ణా జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే జగన్ ప్రభుత్వానికి మచ్చగా మారే అవకాశం కనిపిస్తోంది. దీన్ని ఏపీలోని ప్రతిపక్షాలు ఆసరాగా తీసుకుని మరింత ఎక్కువగా విమర్శనాస్త్రాలు సంధించే అవకాశాలున్నాయి. సొంత చెల్లి కూడా విమర్శించే పరిస్థితికి జగన్ తీసుకొచ్చారని విమర్శలు ఎక్కుపెట్టే అవకాశముంది. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టు రాయలసీమలో ఉండటంతో ఆ ప్రాంత ప్రజలకు పుష్కలంగా నీరుంటుంది. షర్మిల పుట్టిన గడ్డ కావడంతో ఏపీకి వ్యతిరేకంగా ఆమె మాట్లాడితే అక్కడి ప్రజలు, వైఎస్సార్ అభిమానుల్లో విశ్వసనీయత కోల్పేయ ప్రమాదముంది. దీంతో ఆమె ఎలాంటి కౌంటర్ ఇచ్చినా ఇబ్బందిగానే మారే అవకాశముంది. మొత్తానికి షర్మిల పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారింది.

తండ్రిని, అన్నను విమర్శించినా మౌనం!

తనకు తన తండ్రే స్ఫూర్తి అని తెలంగాణలో పార్టీ ప్రకటన నేపథ్యంలో వైఎస్ షర్మిల ప్రకటించింది. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని, రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రజలు సంతోషంగా ఉండేలా చేస్తానని పలుమార్లు ప్రస్తావించింది. జెండాలోనూ ఆయన ఫొటో ఉండేలా ప్రణాళికలు చేసుకుంది. ఎజెండాలోనూ ఆయన ఆశయాలనే లక్ష్యంగా పెట్టుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాంటిది ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా దోచుకుంటోందని ఆయన తండ్రిపై, తోడబుట్టిన అన్నపై తెలంగాణ ప్రభుత్వం ఎన్ని విమర్శలు వచ్చినా షర్మిల మౌనం వహిస్తున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు వైఎస్సార్ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారని, ఆయనొక రాక్షసుడు, మోసగాడు, దొంగ అని, ఆయన కుమారుడు జగన్ గజదొంగ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన రక్తసంబంధీకులపై అలా విమర్శలకు దిగినా షర్మిల మాత్రం కనీసం నోరుమెదపకపోవడం గమనార్హం. కనీసం ఆమె స్పందించకపోవడం వెనుక ఉన్న వ్యూహమేంటో కూడా తెలియడంలేదు.

రాజన్న రాజ్యం సాధ్యమేనా?

తెలంగాణలో తిరిగి రాజన్న రాజ్యస్థాపన చేస్తానని పార్టీ పెట్టేందుకు సిద్ధమైంది వైఎస్ షర్మిల. తాను కూడా తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నానని ఇటీవల పలు సమావేశాల్లో చెప్పుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోందని, వారందరికీ తాను అండగా నిలబడతానని షర్మిల ముందుకొచ్చింది. కానీ ఇవ్వాళ అదే తెలంగాణ ప్రజలకు జలాలు దక్కకుండా ఏపీ ప్రభుత్వం చేస్తోందని విమర్శలు వచ్చినా షర్మిల స్పందించకపోవడంపై పలువురు తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నోరు కూడా మెదపకపోవడాన్ని తప్పపడుతున్నారు. ఇలా అయితే తెలంగాణలో రాజన్న రాజ్యం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏర్పండింది. షర్మిల తెలంగాణ ప్రజల పక్షాన నిలవకుంటే రాజన్న రాజ్యం కలగానే మిగిలే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. దీంతో షర్మిలకు కృష్ణా జలాల విషయం కత్తి మీద సాములా మారింది.



Next Story

Most Viewed