ఎర్రజెండా పార్టీలు పోరుబాట వదిలాయా..?

by  |
ఎర్రజెండా పార్టీలు పోరుబాట వదిలాయా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : సమాజంలో అణగారిన వర్గాలకు, అభాగ్యులకు ఆపద వస్తే ఏ సమయంలోనైనా, ఎక్కడైనా ముందుండేది వామపక్ష పార్టీలే. ఓట్లతో సంబంధం లేకుండా, ప్రయోజనాలు ఆశించకుండా పేదల పక్షాన పోరాడేది కేవలం కమ్యూనిస్టులు మాత్రమే. బలహీన వర్గాల కుండల్లోని గంజినే తింటూ వారి కష్టాలు తీర్చేంత వరకూ ఆ కుటుంబ పెద్దగా ముందుండి పోరాడే వామపక్షాలు.. నేడు ఫక్తు రాజకీయ పార్టీలుగా మారిపోయాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కష్టమొచ్చిందంటే ముందుడే లెఫ్ట్ పార్టీల కోసం నేడు పేద ప్రజలు భూతాద్దాలు వేసి వెతికినా దొరకడం లేదు. ప్రజా నాయకులు నిలబడాల్సిన స్థానంలో బీజేపీ, కాంగ్రెస్‌ వచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరతీస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఎజెండా అంశంగా మారిన ‘వరద సాయం అక్రమాల’పై వామపక్షాల మౌనం వెనక రహస్యమేమిటో అంతు చిక్కడం లేదు. నెల రోజులుగా వరద బురదతో బాధలు పడుతున్న పేదలు, పరిహారం కోసం ఆర్తనాదాలు చేస్తున్నా.. వారి జాడ కనిపించడం లేదు. వారి గొంతుక వినిపించడం లేదు.

కీలక సమయంలో ఎక్కడికి పోయారు..?

గ్రేటర్ పరిధిలో వరద సాయం కోసం పేదలు రోడ్లెక్కి నెల రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. పరిహారం అందజేతలో అక్రమాలు జరిగాయన్నది తేలిపోయింది. నిజమైన బాధితులకు సాయం అందలేదన్నది స్పష్టమైంది. ఇలాంటి సందర్భాల్లో వామపక్ష నాయకులు క్షేత్రస్థాయిలో ముందుండి బాధితుల పక్షాన పోరాడుతూ వారికి అండగా నిలుస్తారు. కానీ ఈ సారి అలా జరగలేదు. వామపక్ష పార్టీల స్థానాన్ని కాంగ్రెస్, బీజేపీలు భర్తీ చేశాయి. ఎర్రదండు నాయకుల స్థాయిలో ఆయా పార్టీలు నిర్వహించిన ఆందోళనలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. రాష్ట్ర స్థాయి నాయకులు సైతం జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలపై పోరాటాలు నిర్వహించారు. ఇలాంటి కీలక సమయంలో లెఫ్ట్ పార్టీలు ఎక్కడ పోయాయన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.

‘గుడ్డిలో మెల్లా’గా పోరాటం

వరద బాధితుల సమస్యలపై సీపీఎం, సీపీఐలు రెండుసార్లు జీహెచ్ఎంసీ ఎదుట ధర్నాలు నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో పద్మారావు ఇంటి వద్ద నిరసనతో పాటు, అడ్డగుట్ట, పాతబస్తీ ఏరియాల్లోనూ పోరాటాలు, సహాయ కార్యక్రమాలు కొంతమేర నిర్వహించారు. అయితే ఆయా పార్టీల నగర, జోనల్ కమిటీలు మాత్రమే ఈ సమస్యలపై పోరాటాలకు పరిమితమయ్యాయి. రాష్ట్రంలోని మూడో వంతు జనాభా నివసించే ప్రాంతంలో సమస్యలపై పోరాటంలో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకత్వాల అలసత్వం స్పష్టంగా తేలిపోయింది. అయితే వాస్తవ పరిస్థితులకు సమాన స్థాయిలో తమ పోరాటాలు లేవన్న సత్యాన్ని కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడొకరు అంగీకరించారు.

నిజమే.. మేం పోరాడలేకపోయాం..

లెఫ్ట్ పార్టీల్లో పార్లమెంటరీ రాజకీయాల్లో ఉన్నవే ఇప్పుడు ప్రజల్లో ప్రత్యక్షంగా ఉండి పనిచేస్తున్నాయి. అయితే కోటిన్నర జనాభా జీవితాలను అతలాకుతలం చేసిన వరదలు, తదనంతర సమస్యలపై ఆ పార్టీలు శక్తి మేర పనిచేయడంపై దృష్టి సారించలేదు. లీడింగ్ లెఫ్ట్ పార్టీ నాయకుడొకరు ‘దిశ’తో ఆ విషయాన్ని అంగీకరించారు కూడా. కాంగ్రెస్, బీజేపీలు తమకంటే ముందుండి పోరాడిన విషయాన్ని తాము గుర్తించామని, అయితే ఆ పార్టీలు ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని మాత్రమే పనిచేస్తాయని, క్షేత్రస్థాయిలో వామపక్ష పార్టీలతో అవి పోటీ పడలేవని వివరించారు. తమకున్న పరిమితుల దృష్ట్యా శక్తి మేర పని చేయలేకపోయామని, లోపాలపైన పునర్ సమీక్షించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కోటిన్నర జనాభా సమస్యలపై వామపక్ష పార్టీలు ఇకనైనా క్షేత్రస్థాయి పోరాటాలకు దిగాలని బాధిత ప్రజలు కోరుకుంటున్నారు. లెఫ్ట్ పార్టీలు ఉంటే తప్ప తమకు న్యాయం జరగదన్న సామాన్యుల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఎర్ర జెండా నాయకులదే…

Next Story

Most Viewed