కాళేశ్వరంతో క్యా ఫయిదా.. కోటి ఎకరాల మాగాణి ఉత్త ముచ్చటేనా..?

by  |
కాళేశ్వరంతో క్యా ఫయిదా.. కోటి ఎకరాల మాగాణి ఉత్త ముచ్చటేనా..?
X

ఏప్రిల్​ 1, 2016 “ ఐదేండ్లలో కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తాం – మీ బిడ్డగా.. కేసీఆర్‌గా.. సీఎంగా.. ఆ బాధ్యత నాది. లివ్ అండ్ లెట్‌లివ్.. ఐదేండ్లలో నీరందిస్తా.. మా ప్రస్థానాన్ని ఎవరూ ఆపలేరు. నో మోర్ ప్రాణహిత-చేవెళ్ల. ఇక అది కాళేశ్వరం ప్రాజెక్ట్. నా ప్రాణం పోయినా సరే.. రాబోయే ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తా. – శాసనసభలో సీఎం కేసీఆర్​

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చుతామన్న సీఎం కేసీఆర్​ మాటల్లో తేడా వస్తున్నది. లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసి నిర్మించిన కాళేశ్వరం జలాలతో వరి కాకుండా ఏ పంటలు పండించాలని రైతాంగం ప్రశ్నిస్తున్నది. ఆరు తడి పంటల సాగు కోసం భారీ జలాశయాలు, ఎత్తిపోతల పథకాల నిర్మాణం ఎందుకు అని సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు తెలంగాణను ‘సీడ్​ బౌల్​ ఆఫ్ ఇండియా’ అని పేర్కొన్న సీఎం.. ఒక్కసారిగా మాట మార్చడం రాష్ట్రంలో హాట్​టాపిక్​గా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేస్తామంటూ సీఎం కేసీఆర్​ ప్రాజెక్టుల గొప్పతనాన్ని ఆవిష్కరించారు. కానీ ఆరేండ్లలో అంతా మారిపోయింది. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు అక్కరకు రాకుండా పోయే ప్రమాదంగా ఏర్పడింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా ఉమ్మ‌డి 10 జిల్లాల్లోని 18 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల‌కు కొత్త‌గా నీరందించడం, మరో 18 లక్షల ఎకరాల స్థిరీకరించనున్నట్టు మొన్నటివరకు చెప్పుకొచ్చారు. ఉత్తర తెలంగాణలో వరి ప్రధాన పంట. కానీ, ఇప్పుడు అదే పంటను వద్దంటున్నారు. సీఎం దేనికోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారో.. అదే ఇప్పుడు రివర్స్​ అయింది.

మరేం చేయాలి..?

కాళేశ్వరం ప్రాజెక్టు చివరి అంకానికి చేరింది. మూడో టీఎంసీ మళ్లించుకునే పనులు 70% పూర్తి అయ్యాయి. మిడ్​ మానేరు నుంచి నేరుగా మల్లన్నసాగర్​కు జలాలను చేర్చే కొత్త ప్రతిపాదన సైతం రెడీ అయ్యింది. మరోవైపు సీఎం కేసీఆర్​ సహా.. మంత్రివర్గం ఏ జిల్లాకు వెళ్లినా ముందుగా చెప్పేది ఒక్కటే. “కలలో నైనా గోదావరి జలాలు సూర్యాపేటకో, సిద్దిపేటకో వస్తాయని ఊహించామా..” ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు గోదావరి జలాలు ఎక్కడికొచ్చినా లాభమేమిటనేదే.. రైతుల ముందున్న అతిపెద్ద ప్రశ్న. వరి సాగు వద్దన్నప్పుడు ఇక ఈ నీళ్లు ఎందుకు. ఆరు తడి పంటల సాగు కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరమేమిటి.?

ప్రభుత్వమే చెప్పింది కదా!

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి సిరులు కురిపించినట్లు ప్రభుత్వం లెక్కలేసింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ స్థాయిలో పంట దిగుబడులు రావడం ఓ రికార్డు అంటూ ప్రకటించుకుంది. ఒక్క వరి పంట గతేడాదితో పోల్చుకుంటే.. 66 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు దిగుబడిని సాధించినట్టు చెప్పుకొచ్చారు. గతంలో తెలంగాణలో వరి సాగు చేయొద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచించేవారు.

కానీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ఫలితంగా ఊహించని విధంగా బీడు భూములు పంట భూములుగా మారాయని, లక్షల ఎకరాలు సస్యశ్యామలంగా మారాయని, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ గ్రామాల్లోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నట్లు చప్పట్లు కొట్టించుకున్నారు. నిజానికి వరి పంట పూర్తిగా నీటి ఆధారితం. నీటి లభ్యత ఉన్నవారు మాత్రమే సాగు చేసేవారు. పంట చివరి వరకు నీటి సౌకర్యం లేక పంటలు ఎండిపోయేవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు వరి నుంచి ఇతర పంటల సాగు వైపు రైతులు వెళ్లారు. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇవ్వడంతో రైతులు అధికంగా వరిసాగు వైపునకు మళ్లినట్లు ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి.

చరిత్ర కోసమే కేసీఆర్​ ఆరాటం..

ఇప్పుడు కేసీఆర్​ వైఖరి తేలిపోతున్నది. ప్రాజెక్టులు నిర్మించింది ప్రజల కోసం కాదనేది స్పష్టమైంది. తన హయాంలో ఏదో పెద్ద ప్రాజెక్టు నిర్మించాలి, కమీషన్లు తీసుకోవాలనే లక్ష్యంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఇప్పుడు వరి సాగు వద్దు.. మేం కొనలేం.. సెంట్రల్​ సహకరించడం లేదంటూ కథలు చెబుతున్నాడు. ఒక ప్రాజెక్టును నిర్మించే ముందే చాలా అంశాలను పరిశీలించాలి. ఏమీ లేకుండానే కాళేశ్వరం కట్టారా..? విజన్​ లేని సీఎం కేసీఆర్​.

-కృష్ణసాగర్​ రావు, బీజేపీ నేత

ఇదేనా రైస్​బౌల్​ ఆఫ్​ ఇండియా : ​

మొన్నటికి మొన్న తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు వరి సాగు వద్దంటున్నారు. మన రాష్ట్రంలో లక్షల మంది రైతులు వరిసాగుపైనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏమిటి..? కేంద్రం కొనుగోలు చేస్తలేదు కాబట్టి మేం కొనమంటున్నాడు. కానీ రాష్ట్రంలో పండిన పంటలను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

-దొంతుల లక్ష్మీనారాయణ, ఇరిగేషన్​ రిటైర్డ్​ ఇంజినీర్

కమీషన్ల ప్రాజెక్టులని తేలిపోయింది..

రైతుల కోసం కాదు.. కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు తేలిపోయింది. కాంగ్రెస్​ హయాంలో చాలా ప్రాజెక్టులను పూర్తి చేసి నీరందించాం. అప్పటి నుంచే వరి సాగు పెరిగింది. రైతులకు ఇబ్బంది రాకుండా ఐకేపీ, సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేయించిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వానిది. కానీ, ఇప్పుడు వరి సాగు చేయవద్దు.. మేం కొనమని ప్రకటిస్తే రైతులు ఎక్కడ పోవాలి.

-పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి


Next Story

Most Viewed