వీవీప్యాట్ స్లిప్పుల ధ్వంసంపై తొందరెందుకు

by Shamantha N |
వీవీప్యాట్ స్లిప్పుల ధ్వంసంపై తొందరెందుకు
X

‘ఎలాంటి ఎన్నికల్లోనైనా వీవీప్యాట్ స్లిప్పులను ఓ ఏడాది పాటు భద్రపరిచిన తరువాతే.. వాటిని నాశనం చేయాలి’ అని ఎన్నికల నియమావళి (1961)లోని నిబంధన 94(బి) చెబుతున్నది. కానీ, భారత ఎన్నికల సంఘం (ఈసీ) మాత్రం గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను కేవలం నాలుగు నెలల్లోనే ధ్వంసం చేసిందని ఓ జాతీయ మీడియా సంస్థ తన తాజా కథనంలో పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలను సదరు మీడియా సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించింది. దాని కథనం ప్రకారం.. వీవీప్యాట్ స్లిప్పులు ఎప్పుడో నాశనం చేశామని ఢిల్లీ ఎలక్షన్ కమిషన్‌లోని ప్రజాసమాచార అధికారి తెలిపారు. 2019సెప్టెంబర్ 24నే దేశంలోని చీఫ్ ఎలక్టోరల్ అధికారులందరికీ, వీవీప్యాట్‌లను నాశనం చేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

అయితే, మన ఓటు ఎవరికి పడిందో తెలిపే ఈ కీలకమైన స్లిప్పులను నాశనం చేయడానికి అంతతొందరేం వచ్చిందన్నదే ఇక్కడ ప్రశ్న. వీవీప్యాట్‌లో మనం ఓటు వేసిన అభ్యర్థి పేరు కనపడకపోతే ఆ యంత్రంలో ఏదో లోపం ఉన్నట్టే. ఓటింగ్ విధానంలో ఎలాంటి అవకతవకలు జరిగినా దానిని గుర్తిచేంది వీవీప్యాట్ మాత్రమే.

ఒకవేళ ఈవీఎంలలో ఏమైనా అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు అందితే, వాటిని విచారించడానికి వీవీప్యాట్ స్లిప్పులే కీలకమైన సాక్ష్యంగా ఉంటాయి. కానీ, ప్రస్తుతం వీవీప్యాట్ స్లిప్పులన్నీ నాశనమయ్యాయి. ఇది ఎన్నికల నియమాలకు పూర్తి విరుద్ధం. మన దేశంలో ఎన్నో ఉపయోగంలేని పత్రాలు నిల్వ ఉంచుతుండగా, వీవీప్యాట్ స్లిప్పులను ఎందుకు పారేశారో తెలియడం లేదనీ, నిబంధనలకు విరుద్ధంగా నాలుగు నెలల్లోనే ఈ వీవీప్యాట్ స్లిప్పులు ధ్వంసం చేయడం ఆందోళనకరమని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ తొందరపాటు చర్యకు గల కారణాన్ని ఈసీ వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే వీవీప్యాట్ స్లిప్పులను నాశనం చేసే హక్కు ఉంటుంది. కానీ, వీవీప్యాట్ స్లిప్పులను ఇంత తొందరగా ఎందుకు నాశనం చేశారో వివరించడానికి స్పష్టమైన కారణాన్ని ఆర్టీఐ జవాబులో పేర్కొనలేదు.

రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈవీఎంకు, వీవీప్యాట్‌ల ఓట్ల సంఖ్యకు భారీగా తేడా ఉందనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై ఎన్నికల సంఘం జూలై 2019లో విచారణకు ఆదేశించింది. అయితే, ఈ విచారణ వివరాలను తెలుపాలనీ ఆర్టీఐ ద్వారా ఈసీ కోరగా, దీనికి సంబంధించిన విచారణ ఇంకా పరిశీలనలోనే ఉన్నందున సమాచారం అందుబాటులో లేదని గత నవంబర్‌లో సమాధానం చెప్పింది. ఇప్పుడు, ఈ కేసులకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను ఈసీ నాశనం చేసిందా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది. ఒకవేళ నాశనం చేస్తే, ఈవీఎం, వీవీప్యాట్ ఓట్ల లెక్కింపులో వచ్చిన తేడాను ఎలా కనుక్కోవచ్చు. దేశంలోని అత్యంత కీలకమైన ఎన్నికలకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్‌లను ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఎందుకు నిల్వచేయలేదు? అంటూ సదరు మీడియా ప్రశ్నించింది.Next Story

Most Viewed