వారికి మంత్రి పదవి ఇస్తే కేసీఆర్ పొగ పెట్టుకున్నట్లేనా..?

by  |
Legislative Council
X

దిశ, తెలంగాణ బ్యూరో : శానసమండలిలో అందరూ సీనియర్లే. మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన అనుభవం ఉన్నది. కొంత మంది రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం సైతం ఉండటంతో మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్‌లో ఒక స్థానం మాత్రమే ఖాళీ అయ్యింది. మండలిలో ఐదు నామినేటెడ్ పోస్టులు ఉండగా, అందులో ఒక చీఫ్ విప్, నాలుగు ప్రభుత్వ విప్ పదవులు ఉన్నాయి. అయితే కేసీఆర్ మాత్రం ఎవరికి అవకాశం కల్పిస్తారోనని ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ శాసనమండలిలో 19 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా అందులో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, 6 ఎమ్మెల్యే కోటా, ఒకటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలను అన్నీ అధికారపార్టీకి చెందినవే కావడంతో తిరిగి ఆ పార్టీకి చెందినవారే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన వారిలో దండె విఠల్‌, ఎల్‌.రమణ, టి.భానుప్రసాద్‌రావు, తాతా మధు, ఎంసీ కోటిరెడ్డి, డాక్టర్‌ వి.యాదవరెడ్డి, కల్వకుంట్ల కవిత , పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, గవర్నర్ కోటాలో మధుసూదనాచారి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, నల్లగొండ టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, బండ ప్రకాశ్ ఉన్నారు. ఇందులో తొలిసారిగా విఠల్, రమణ, తాతా మధు, ఎంసీ కోటిరెడ్డి, వెంకట్రాంరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఉన్నారు. మిగతా వారంతా రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై, రాజకీయ అనుభవం ఉన్నవారున్నారు. దీంతో నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు.

కరీంనగర్ నుంచి స్థానిక సంస్థల సభ్యుడిగా ఎన్నికైన ఎల్.రమణకు సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. టీడీపీ హయాంలో హ్యాండ్లూం టెక్స్ టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. రెండోసారి ఎన్నికైన భాను ప్రసాద్ రావు మండలిలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. మరోసారి విప్‌గా అవకాశం కల్పిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డి సైతం రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఆయనకు మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరిగింది.

ఇదిలా ఉంటే గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి మాజీ చైర్మన్ గా పనిచేశారు. ఆయనకు రెండోసారి చైర్మన్ అవకాశం ఇస్తారా? మంత్రిని చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయడంతో ఆయన సైతం నామినేటెడ్ గానీ మంత్రి పదవి ఇస్తారనే ఆశతో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌ను సీఎం కేసీఆర్ అనుహ్యంగా ఎమ్మెల్సీ అవకాశం కల్పించి మండలికి తీసుకొచ్చారు. మరో రెండేళ్లకు పైగా పదవికాలం ఉన్నప్పటికీ మండలిలో కూర్చోబెట్టారు. రాజ్యసభలో ప్రాచీన స్మారక కట్టడాలపై సెలక్టు కమిటీ స్యభుడిగా, కార్మిక చట్టాలు, సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా, టీఆర్ఎస్ పక్ష ఉపనాయకుడిగా పనిచేశారు. ఈటల రాజేందర్ ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి కావడం, ఆయన టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరడంతో ఆయనకు కులపరంగా, రాజకీయ పరంగా చెక్ పెట్టేందుకు బండను తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈటలతో ఖాళీ అయిన మంత్రి పదవిని అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే మంత్రిని చేస్తారా? లేకుంటే మండలిలో డిప్యూటీ చైర్మన్ ను చేస్తారా? అనేది పార్టీలో చర్చనీయాశంమైంది.

ఇదిలా ఉంటే అసలు సీనియార్టీని ప్రాతిపదికన తీసుకుంటారా? లేకుంటే ఆయా జిల్లాల్లోని రాజకీయ, సామాజిక పరంగా ఆలోచించి వారికి పదవులు అప్పగిస్తారా? లేదానేది ప్రశ్నార్ధకంగా మారింది. మండలిలో మొత్తం 5 నామినేటెడ్ ఉండగా అందులో ఒకటి ప్రభుత్వ చీఫ్ విప్, నాలుగు విప్ పదవులు ఉన్నాయి. ఇవి కేబినెట్ హోదా కావడంతో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కొందరికి ఇంతకు ముందే మంచి పదవి ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

పదవులు ఇచ్చి… పొగపెట్టుకున్నట్లేనా?

హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలకు టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో కూడా ఆయా జిల్లాలకు చెందిన పలుపార్టీల సీనియర్ నేతలు గులాబీ గూటికి చేరారు. అందులో భాగంగా పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్న నేతలకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. అయితే అందులో ఎక్కువగా మంత్రులుగా పనిచేసిన, సుధీర్ఘరాజకీయ అనుభవం ఉన్నవారున్నారు. అయితే నామినేటెడ్ పోస్టులు తక్కువగా ఉండటం, ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఎవరికి ఇచ్చినా అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. అయితే ఎంతమందికి ఇచ్చి ఎవరిని శాంతింపజేస్తారనేది పార్టీలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మరి పొగపెట్టుకున్నట్లవుతుందా? అనేది పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed