గెహ్లాట్ వేసిన వలలో పైలట్?

by  |
గెహ్లాట్ వేసిన వలలో పైలట్?
X

న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజకీయ సంక్షోభానికి కారకులెవరు? కాంగ్రెస్ సర్కారుకే పెనుముప్పును తెచ్చిపెట్టిన ఈ పరిణామాలకు కారణం డిప్యూటీ సీఎం సచిన్ పైలట్? లేదా సీఎం అశోక్ గెహ్లాటేనా? ప్రస్తుత పరిణామాలు మాత్రం సీఎం కావాలన్న కాంక్షతో డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీతో సంప్రదింపుల్లో ఉండి తిరుగుబాటు చేశారన్నట్టుగా కనిపిస్తున్నాయి. కానీ, అసలు కథ వేరు అని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభాన్ని సీఎం అశోక్ గెహ్లాట్ ఉద్దేశ్యపూర్వకంగానే వండివార్చారని పేర్కొన్నారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం, తన తర్వాత సీఎంగా ఎదిగే అవకాశాన్ని తుంచేయాలని, సచిన్ పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకం చేసి కొడకు వైభవ్‌ కెరీర్ నిర్మించాలనే లక్ష్యంతో ఈ చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. రెబల్‌గా మారే పరిస్థితులు కల్పించి పార్టీలో ప్రాముఖ్యతను తగ్గించాలనే అశోక్ గెహ్లాట్ వలకు సచిన్ చిక్కారని వివరించారు. సచిన్ తిరుగుబాటు చేసినా సర్కారుకు ఢోకా ఉండదని ధ్రువీకరించుకున్నాకే ఈ ఉదంతానికి తెరలేపారని చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ఇతర ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 123 ఓట్లు వచ్చిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.

నోటీసులతో రెచ్చగొట్టి..

సర్కారును కూలదోయాలని కుట్రపన్నుతున్నారని ఇద్దరు బీజేపీ నేతల అరెస్టులకు సంబంధించిన కేసులో సచిన్ పైలట్ సహా పలువురికి సమన్లు జారీ అయ్యాయి. ఈ నోటీసులే సచిన్ పైలట్ రెబల్‌కు తక్షణ కారణంగా చెబుతున్నారు. నిజానికి డిప్యూటీ సీఎం, సీఎం, పార్టీ చీఫ్ విప్‌లకు ఈ నోటీసులు జారీ చేయాలన్న ఆదేశాలపై పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిసింది. మరోసారి సీఎం, హోం మినిస్టర్ అశోక్ గెహ్లాట్ నుంచి ధ్రువీకరించుకున్న తర్వాతే సమన్లు జారీ చేసినట్టు ఓ పోలీసు వివరించారు. తొలి నుంచి వర్గపోరు నడస్తున్న నేపథ్యంలో ఆ నోటీసులు ఇతరులకూ పంపినా లక్ష్యం మాత్రం తానేనని సచిన్ గ్రహించాలన్న ఉద్దేశ్యమే దీనివెనుక ఉన్న అసలు వ్యూహమని కనీసం నలుగురు సీనియర్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. తన పొలిటికల్‌ కెరీర్ ప్రమాదంలో పడిపోతున్నదని అంచనావేసే ఈ నోటీసులకు ముందే సచిన్ పైలట్ కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించుకున్నారు. కానీ అధిష్టానం లైట్ తీసుకున్నది. ఈ నేపథ్యంలోనే అదును చూసి నోటీసులు పంపారని, దీంతో రెబల్‌గా మార్చే ఎరను సచిన్‌కు గెహ్లాట్ వేశారని ఆ నేతలు వివరించారు.

ఇంతటి రిస్క్ దేనికోసం?

ఈ రిస్క్ దీర్ఘకాల ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నారని ఆ నేతలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కుర్చీకి సచిన పైలట్ ఫేవరేట్‌గా ఉన్న విషయం తెలిసిందే. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే టర్మ్‌లో కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తే సచిన్‌ ముఖ్యమంత్రి అవడం ఖాయం. అప్పటికి 73 ఏళ్లు నిండిన అశోక్‌కు ఇవ్వడం దాదాపు అసాధ్యమే. అందుకే పార్టీ అంతర్గత ప్రత్యర్థిని పక్కకు పెట్టే లక్ష్యంలో అశోక్ ఉన్నట్టు తెలిసింది. సర్కారులో సచిన్‌ ప్రాబల్యాన్ని తగ్గించినా పీసీసీ ప్రెసిడెంట్‌గా కీలకమైన పాత్రలో ఆయన ఉన్నారు. కాబట్టి 2014 నుంచి కొనసాగుతున్న పీసీసీ ప్రెసిడెంట్‌ నుంచి ఏకకాలంలో తొలగించాలని గెహ్లాట్ భావించినట్టు సమాచారం. సచిన్ పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకమైతే తన కొడుకు వైభవ్‌ను రాజకీయంగా ఎదిగించవచ్చునని ప్లాన్ వేశాడని ఆ కాంగ్రెస్ నేతలు వివరించారు. గెహ్లాట్‌కు మంచిపేరున్న జోధ్‌పూర్ నుంచి పార్లమెంటు స్థానంలో పోటీ చేసి వైభవ్ ఓడిపోయారు. ఈ ఓటమికీ పైలటే బాధ్యుడని గెహ్లాట్ ఆరోపించారు కూడా. ఈ నేపథ్యంలోనే అశోక్ వేసిన వలలో పైలట్ చిక్కారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.

Next Story