బలమైన బ్యాటింగ్‌తో బలహీన బౌలింగ్ ఢీ

by  |
బలమైన బ్యాటింగ్‌తో బలహీన బౌలింగ్ ఢీ
X

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్ ఈ నెల 12(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే టెస్టు, టీ-20 సిరీస్‌లను రెండు దశల్లో ముగించిన ఇరు జట్లు.. చివరిగా వన్డే సిరీస్‌లో తలపడబోతున్నాయి. తొలి మ్యాచ్ ధర్మశాలలో జరుగనుండగా, దక్షిణాఫ్రికా జట్టులో కీలకమైన బౌలర్లు ఈ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయారు. మరోవైపు న్యూజిలాండ్‌లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కోహ్లీసేన పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. మరి ఈ సిరీస్‌లో ఇరు జట్ల బలాబలాలను ఓ సారి పరిశీలిస్తే..
భారత జట్టులోకి హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, శిఖర్ ధావన్‌లు తిరిగి రావడం పెద్ద బలంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రోహిత్, ధావన్‌‌లు జట్టులో లేకుండా న్యూజిలాండ్‌తో బరిలోకి దిగి, ఎంత మూల్యం చెల్లించుకుందో చెప్పనక్కర్లేదు. అయితే, ఇప్పుడు రోహిత్ లేకపోయినా.. శిఖర్ ధావన్ ఉండటం భారత జట్టు ఓపెనింగ్‌కు బలమనే చెప్పాలి. శిఖర్‌తో కలిసి పృథ్వీషా ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో వన్డేలలో పృథ్వీషా ఓపెనింగ్ ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు ధావన్‌కు తోడుగా పృథ్వీ బరిలోకి దిగితే ఓపెనింగ్ జోడీకి తిరుగుండదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ పృథ్వీని కాకుండా వేరే ఎవరినైనా పంపించాలని కెప్టెన్ కొహ్లీ భావిస్తే.. అతనికున్న రెండో ఆప్షన్ శుభ్‌మన్ గిల్ మాత్రమే. మరి పృథ్వీ, గిల్‌‌లలో ఎవరికి ఓపెనింగ్ చేసే ఛాన్స్ దొరుకుతుందో చూడాలి.
వన్డే వరల్డ్ కప్ తర్వాత వెన్నునొప్పి గాయంతో క్రికెట్‌కు దూరమైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో చేరడం అన్ని విధాలుగా భారత జట్టుకు కలిసి రానుంది. గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెట్ సాధించిన తర్వాత డీవై పాటిల్ టోర్నీలో పాండ్యా దుమ్ము లేపాడు. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. మంచి ఫామ్‌లో ఉన్న హార్దిక్ జట్టుకు అదనపు బలం. ఇక బౌలింగ్‌ను భువనేశ్వర్ లీడ్ చేయడం కూడా భారత్ విజయావకాశాలను మెరుగుపర్చే అంశమే. ఇండియాలోని స్లో పిచ్‌లపై సైతం భువీ స్వింగ్‌ చేయడం జట్టుకు కలిసొచ్చేదే. ఇప్పటికే ధర్మశాల, లక్నో పిచ్‌లపై రాణించిన అనుభవం భువీకి ఉండటం జట్టుకు శుభసూచకం.

దక్షిణాఫ్రికా పరిస్థితేంటి..?

భారత పిచ్‌లపై దక్షిణాఫ్రికా క్రికెటర్లకు చక్కని అవగాహన ఉంది. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం వారికి కలిసిరానుంది. గతేడాది టెస్టు, టీ-20 సిరీస్‌లూ ఆడటం వారికి కలిసొచ్చే అంశం. వాళ్ల కోచ్ మార్క్ బౌచర్‌కు మన దేశ పరిస్థితుల గురించి తెలుసు. అయితే, సఫారీల బౌలింగ్ దళంలో కీలకమైన బౌలర్లు లేకపోవడం మాత్రం ఆ జట్టుకు పెద్ద మైనస్. రబాడా, షంశీ వంటి ప్రధాన బౌలర్లు గాయాల కారణంగా వన్డే సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో బౌలింగ్ దళాన్ని నడిపించే నాథుడే దక్షిణాఫ్రికాకు లేకుండా పోయాడు.
బ్యాటింగ్‌లో కెప్టెన్ డూప్లెసిస్‌కు భారత పిచ్‌లపై మంచి అవగాహన ఉండగా, కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న క్లాసెన్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఇక తెంబా బవుమా, జన్నేమన్ మలన్‌ల ఫామ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే.
సొంత గడ్డపై మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన సఫారీలు.. పూర్తి విశ్వాసంతో భారత్‌లో అడుగుపెట్టారు. మరి స్వదేశంలో పులుల్లా గర్జించే టీమిండియా ఏ మేరకు పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి.

Tags: team india, south africa, dharma shala, ODI, one day series, kohli, dhawan, pruthvi shah, hardhik pandya



Next Story