అడవుల్లో వేట.. వన్య ప్రాణులకు రక్షణ ఏది..?

by  |
అడవుల్లో వేట.. వన్య ప్రాణులకు రక్షణ ఏది..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని అడవుల్లో ఆదివారం ఇతర ప్రాంతాల నుండి వేటగాళ్లు వచ్చి జంతువులను వేటాడుతుండడం.. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఆఫీసర్ల బృందం వచ్చి దాడులు చేయడం చూస్తుంటే జిల్లా పరిధిలోని అడవుల్లో వన్యప్రాణులకు ఉన్న రక్షణ ఏపాటిదో అర్థమవుతోంది. అదే ఫారెస్ట్ జిల్లా అధికారుల పనితనాన్నీ తెలియజేస్తోంది. వేటగాళ్లు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నా అధికారులకు తెలియడం లేదంటే ఇక స్థానిక వేటగాళ్ల వేట ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే తెలిసిపోతోంది. గోదావరి, మంజీర నది పరీవాహక ప్రాంతాల్లోని జింకలపైనే వేటగాళ్ల గురి ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ పరిస్థితులను చూస్తుంటే వన్యప్రాణుల రక్షణపై అటవీ శాఖ చేతులెత్తేసినట్లేనా అనే సందేహాలు కలుగుతున్నాయి.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా చిట్టడవులకు ప్రసిద్ధి. ఇక్కడ అడవుల్లో చిరుతలు, మనుబోతులు, జింకలు, సాంబర్, ఎలుగుబంట్లు, కొండగొర్రెలు, కుందేళ్లు జీవిస్తున్నాయి. గోదావరి, మంజీర పరీవాహక ప్రాంతాల్లో మాత్రమే వేల సంఖ్యలో ఉన్న కృష్ణ జింకలు(బ్లాక్ డగ్) ఇక తెలంగాణలో మరెక్కడా లేవని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం నది పరీవాహక ప్రాంతాలల్లో నీటి ప్రవాహం తగ్గడంతో అవి సమీప పంటచేలల్లో తిరుగుతున్నాయి. దీనిని గమనించిన వేటగాళ్లు మంజీర సరిహద్దులోని హున్సా నుంచి శ్రీరాం సాగర్ బ్యాక్ వాటర్‌లో ఉన్న బాసర ట్రిపుల్ ఐటీ వరకు వన్యప్రాణులను వేటాడుతున్నారు. ఈ విషయం నిజామాబాద్ అటవీ శాఖ అధికారులకు తెలిసినా సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలుస్తోంది.

‘జాకోరా’ ఘటనతో తేటతెల్లం..

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలోని ఒక ప్రైవేట్ రైస్‌మిల్ ప్రాంగణంలోని గెస్ట్‌హౌస్‌పై 30 మంది సభ్యులు ఉన్న హైదరాబాద్ యాంటీ పోచింగ్ స్క్వాడ్, విజిలెన్స్-2, ఫ్లయింగ్ స్క్వాడ్ దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అక్కడ హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు వేటగాళ్లు విందులో మునిగితేలుతుండగా అధికారులు ఆకస్మాత్తుగా రైడ్ చేసి పట్టుకున్నారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. అయితే హైదరాబాద్ నుంచి స్పెషల్ టీం వచ్చి దాడులు చేసేంతవరకూ అటవీ శాఖ స్థానిక అధికారులకు కనీస సమాచారం లేకపోవడం గమనార్హం. ఈ ఘటనతో వన్యప్రాణులకు రక్షణ లేదనేది స్పష్టమైంది. నిజామాబాద్ జిల్లాలో అటవీ రేంజ్‌లు, ప్లైయింగ్ స్క్వాడ్ టీంలు ఉన్నా అవి నామాత్రంగానే ఉన్నాయని తెలిసిపోయింది.

కనుమరుగవుతున్న అటవీ సంపద

జిల్లాలో స్మగ్లర్ల కాటుకు అడవిలో కలప మాయం కాగా, పోడు వ్యవసాయం కారణంగా అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. మిగిలిన ఎకైక వన్యప్రాణి సంపదపై వేటగాళ్ల కన్ను పడటంతో అరుదైన అడవి జంతువులు కనుమరుగవుతున్నాయి. గాంధారి చద్మల్ నుంచి వర్ని మండలం బడాపహడ్, జాకోరా, నిజామాబాద్ నార్త్ రెంజ్ పరిధిలోని కాల్పోల్, బైరాపూర్, మంచిప్ప వరకు విస్తరించి ఉన్న అడవిలో రాత్రివేళ జోరుగా వేట సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టిసారించి అడవులను, వన్యప్రాణులను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

Next Story

Most Viewed