ప్రాజెక్టుల మాటున ఎన్నో త్యాగాలు!వారి కన్నీళ్లు ఆగేదెప్పుడు?

by Disha edit |
ప్రాజెక్టుల మాటున ఎన్నో త్యాగాలు!వారి కన్నీళ్లు ఆగేదెప్పుడు?
X

సంవత్సరాలుగా బాధితులు పోరాటాలు చేస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు నామమాత్రంగానే స్పందిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు, పెద్దలు కూడా ఏమీ చేయలేక, కక్కలేక మింగలేక అయోమయంలో ఉన్నారు. 2016 మే మొదటి వారంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాసితులను పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వారికి కొత్త జీవితం ప్రసాదించాలని, కోల్పోయే వ్యవసాయ భూమికి, ఇల్లు-పశువుల కొట్టం-చెట్లు తదితర ఆస్తులకు, కొత్త ఇంటి నిర్మాణానికి, మూడింటి చెక్కులను ఒకేసారి ఇవ్వడం వలన నిర్వాసితులు తమకిష్టమొచ్చిన రీతిలో, ఇష్టమొచ్చిన ప్రాంతంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇవేవీ ఆచరణలోకి రాలేదు. నిర్వాసితులకు జీవనోపాధి చూపించాకే ప్రాజెక్టులు నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ అమలు చేయకపోవడం దురదృష్టకరం.

మా నీళ్లు మాకే, మా నిధులు మాకే, మా నియామకాలు మాకే' అనే నినాదాలతో, వందలాది మంది త్యాగాలతో తెలంగాణను కొట్లాడి సాధించుకున్నం. తెలంగాణ వచ్చి ఎనిమిది సంవత్సరాలు గడిచినా ప్రజల ఆకలి, ఆకాంక్షలు, ఆశయాలు అలాగే ఉన్నాయి. నిధులు, నియామకాలు దేవుడెరుగు కానీ, నీళ్ల కోసం మాత్రం పెద్ద పెద్ద సాగు నీటి ప్రాజెక్టులు కడుతున్నారు. ఆ సాగునీటి ప్రాజెక్టుల కింద పంట పొలాలు, ఇళ్లు కోల్పోయిన నిరుపేద నిర్వాసితుల బాధలు మాత్రం తీరేలా లేవు, ఊళ్లకు ఊళ్లు, ఇండ్లకు ఇండ్లు త్యాగం చేసినవారికీ సరైన పరిహారం, పునరావాసం కల్పించడంలో ప్రభుత్వాలు నిజాయితీగా వ్యవహరించడం లేదు. యేండ్లకు యేండ్లు గడుస్తున్నప్పటికీ కొన్నిచోట్ల పరిహారం చెల్లింపులో విపరీత జాప్యం జరుగుతోంది. పునరావాస కాలనీలలో నిర్వాసితులకు కనీస మౌలిక వసతులు కూడా అందుబాటులోకి రావడం లేదు.

కోటి ఎకరాల మాగాణి సరే

మాట మాట్లాడితే చాలు పదే పదే 'కోటి ఎకరాల మాగాణి స్వప్నం, బంగారు తెలంగాణ నిర్మాణం మా చిరకాల వాంఛ' అంటుంటారు. మరి ఆ కోటి ఎకరాల మాగాణి కోసం ప్రాజెక్టులకు అవసరమైన భూములు ఇచ్చిన రైతులను మాత్రం పట్టించుకోరు. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం పరిహారం ఇవ్వకుండా, తక్కువ రేట్ ఇవ్వడంతో రైతులు దిక్కులేక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఏం చేయాలో పాలుపోక కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ఎకరా భూమి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు తక్కువగా లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. రిజర్వాయర్ల కింద ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు పూర్తిస్థాయిలో పునరావాస సహాయం (ఆర్‌అండ్‌ఆర్), న్యాయమైన సహకారం అందడం లేదు. కాపాడాల్సినవారే కనికరించకపోవడంతో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 14 ప్రాజెక్టుల పరిధిలో 94 గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. 16 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయి. బాధిత గ్రామాలలోని 45,250 కుటుంబాల కోసం 87 పునరావాస కేంద్రాలను ప్రతిపాదించగా, ఇప్పటివరకు 25 వేల ఇండ్లు మాత్రమే నిర్మించారు. ఆర్‌అండ్‌ఆర్ కోసం మొత్తంగా రూ. 3,250 కోట్లు అవసరమని అంచనా వేయగా, ఇంతవరకు రూ.2,600 కోట్ల మేరకు ఖర్చు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కిందే రూ.780 కోట్లు, పాలమూరు-రంగారెడ్డి కింద రూ.181 కోట్లు. ఎల్లంపల్లి కింద రూ.483 కోట్లు, వరద కాల్వ కింద రూ.561 కోట్లు ఖర్చు చేసినట్లు నీటిపారుదల శాఖ లెక్కలు చెబుతున్నాయి. పునరావాస కాలనీలలో రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ నిర్మాణం పూర్తిగా జరగలేదు. కట్టిన ఇండ్లు కూడా నాణ్యతగా లేవు. మామూలు వర్షాలకు కూడా ఉరుస్తుండగా, మరికొన్నిచోట్ల పెచ్చులు ఊడిపోతున్నాయి.

గౌరవెల్లిలో దౌర్జన్యం

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల పరిధిలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ గొడవ ఇప్పటిది కాదు. ఉన్నది కొద్దిపాటి భూమి. అండగా ఉండాల్సిన ప్రభుత్వం పోలీసులను ఎగదోసి చెదరగొట్టింది. లాఠీలను ఝళిపించింది. రైతుల తలలు పగిలాయి. మహిళల చేతులు విరిగాయి. అయినా, ప్రభుత్వం నుంచి స్పష్టమైన అవగాహనతో కూడిన పరిహారం ప్రతిపాదనలు, సహాయం లేక రైతులు అల్లాడిపోతున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం పరిసర ప్రాంతాలలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుది మరో దుస్థితి. మొదట 2010 ప్రకారం పరిహారం ఇస్తామని చెప్పి ఎకరాకు ఐదు లక్షల చొప్పున రైతులకు చెక్కులు ఇచ్చారు. అదే మల్లన్నసాగర్ ముంపు రైతులకు 2012 చట్టం ప్రకారం పరిహారం ఇచ్చారు. దీనిని కొందరు రైతులు వ్యతిరేకిస్తూ దీక్షలు చేపట్టారు.

అధికార టీఆర్ఎస్ నుంచి ప్రతిపక్ష కాంగ్రెస్ దాకా సంఘీభావం తెలిపినా రైతులకు పరిహారం మాత్రం అందలేదు. నిరాహార దీక్ష శిబిరంలోనే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు రక్షిత మంచి నీటిని అందించేందుకు చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకం పరిస్థితీ అంతే. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు రిజర్వాయర్ల పరిధి భూసేకరణ, సహాయ పునరావాస పనులలో అనేక అవాంతరాలున్నాయి. న్యాయమైన పరిష్కారం కోసం కొట్లాడి కొట్లాడి అలసిపోయారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో దీక్షకు కూర్చోని చావో రేవో తేల్చుకుందామనుకుంటే కనీసం వారిని పట్టించుకునే దిక్కు లేదు.

దుఃఖ 'సాగరం'

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను నీళ్లతో నింపినా ఇంకా నిర్వాసితులందరికీ పరిహారం, పునరావాస సహాయం లభించలేదు. రిజర్వాయర్ నిర్మాణం వలన తొగుట మండలంలో పల్లెపహాడ్, వేములఘాట్. ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి. కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ప్రతి కుటుంబానికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ. 7.5 లక్షల తో పాటు ఇల్లు, ఇల్లు వద్దనుకున్న వారికి ఖాళీ జాగా తో పాటు మరో రూ. ఐదు లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. కుటుంబంలో 18 ఏళ్లకు పైబడిన వారుంటేనే ఇవ్వాలని నిర్ణయించడంతో కొన్ని కుటుంబాలు ప్యాకేజీకి నోచుకోలేదు.

ఉమ్మడి కుటుంబాలలోనూ ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవడంతో కుటుంబ కలహాలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. ముంపు గ్రామాలలో గుర్తించిన కుటుంబాల సంఖ్యకు, వాస్తవ సంఖ్యకు కూడా పొంతన లేకపోవడం కూడా మరిన్ని ఇబ్బందులను సృష్టిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆరు రిజర్వాయర్లు కట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లపూర్ అంజనగిరి, వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలో ఏదుల వద్ద వీరాంజనేయ, బిజినేపల్లి మండలంలో వట్టెం వద్ద వెంకటాద్రి, మహబూబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెనలో కురుముర్తిరాయ, జడ్చర్ల మండలంలో ఉదండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లు అందులో ఉన్నాయి. కరివెన, వట్టెం బాధితులకు కొంతవరకు పునరావాసం కల్పించారు. మిగిలినవారు పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రతిపక్షాలు ఎక్కడ?

సంవత్సరాలుగా బాధితులు పోరాటాలు చేస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు నామమాత్రంగానే స్పందిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు, పెద్దలు కూడా ఏమీ చేయలేక, కక్కలేక మింగలేక అయోమయంలో ఉన్నారు. 2016 మే మొదటి వారంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాసితులను పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వారికి కొత్త జీవితం ప్రసాదించాలని, కోల్పోయే వ్యవసాయ భూమికి, ఇల్లు-పశువుల కొట్టం-చెట్లు తదితర ఆస్తులకు, కొత్త ఇంటి నిర్మాణానికి, మూడింటి చెక్కులను ఒకేసారి ఇవ్వడం వలన నిర్వాసితులు తమకిష్టమొచ్చిన రీతిలో, ఇష్టమొచ్చిన ప్రాంతంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇవేవీ ఆచరణలోకి రాలేదు.

నిర్వాసితులకు జీవనోపాధి చూపించాకే ప్రాజెక్టులు నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ అమలు చేయకపోవడం దురదృష్టకరం. నిర్వాసితులకు భూమికి బదులు భూమి, ఇంటికో ఉద్యోగం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, కోరుకున్నచోట ఇంటి స్థలం ఇవ్వాలి. పునరావాస కాలనీలలో శాశ్వత నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎదగడానికి ప్రభుత్వాలే నిజాయితీగా చొరవ చూపాలి.

డా. బి. కేశవులు. ఎండీ.

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

8501061659



Next Story

Most Viewed