నిరుద్యోగుల ఎదురుచూపులు.. నోటిఫికేషన్లు ఎప్పుడు?

by  |
Unemployed Students
X

దిశ, తెలంగాణ బ్యూరో: కష్టపడి చదివి కన్నవారి కలలను నిజం చేయాలని కోటి ఆశలతో ఉన్న నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కన్నబిడ్డల భవిష్యత్​ కోసం ఆర్థిక కష్టాలను ఎదుర్కొని అప్పులు చేసి మరీ తల్లిదండ్రులు తమ పిల్లలను కోచింగ్​ సెంటర్లు, ఇనిస్టిట్యూట్లలో ట్రైనింగ్​కు పంపిస్తున్నారు. తెలంగాణ సర్కార్ ​నిరుద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటనలు తప్ప నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. దీంతో విద్యార్థులు హాస్టళ్లు, స్టడీ సెంటర్లకే పరిమితమవుతున్నారు. దీంతో యువకులు, నిరుద్యోగులు త్వరగా నోటిఫికేషన్లు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్లు చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అదిగో ఉద్యోగాలు.. ఇదిగో నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగులు, యువతను ఊదరగొడుతోంది. హుజురాబాద్​ ఉప న్నికలున్న నేపథ్యంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తారనే ఆశతో కొద్ది నెలల ముందే ఎంతో మంది నిరుద్యోగులు హైదరాబాద్ బాట పట్టారు. ప్రభుత్వం సడెన్ గా నోటిఫికేషన్​ఇస్తే చదువుకునేందుకు సమయం దొరకదనే ఉద్దేశ్యంతో వారు ముందస్తుగానే మహానగరానికి తరలివచ్చి కోచింగ్​ తీసుకుంటున్నారు. స్టడీ హాళ్లలో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రతి ఏటా డిగ్రీ పట్టా పట్టుకొని కాలేజీల నుంచి లక్షల్లో వస్తోన్న యువకులతో ఉద్యోగాలకు పోటీ పెరుగుతుండటం వల్ల ఎన్నో రోజులుగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినా పోటీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థంకాక నిరుద్యోగ యువతీ యువకులు సతమతమవుతున్నారు.

మహానగరంలోని ఏ కోచింగ్​సెంటర్, ఏ స్టడీ హాల్​కు వెళ్లినా నిరుద్యోగులే దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా అమీర్ పేట, కూకట్​పల్లి, దిల్​సుఖ్​నగర్, అశోక్​నగర్, నారాయణగూడ వంటి ప్రాంతాల్లోని ఏ కోచింగ్ సెంటర్‌లో చూసినా ఏదో ఒక కాంపిటీటివ్ పరీక్షకు ప్రిపేర్ ​అవుతున్న వారు కనిపిస్తున్నారు. ఒక్క అశోక్ నగర్ లోనే దాదాపు 100కు పైగా స్టడీ హాళ్లు ఉన్నాయి. అమీర్​పేటలోనూ దాదాపు 500కు పైగా కోచింగ్​సెంటర్లున్నాయి. ఇలా నగర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఐదు వేలకుపైగానే ఇనిస్టిట్యూట్లు ఉంటాయి. ఇవే కాక కళాశాలలు, యూనివర్సిటీల్లోని లైబ్రరీలు అదనంగా ఉన్నాయి.

టీఆర్ఎస్ ​అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2020 వరకు 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా ప్రకటించారు. శాఖలవారీగా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో కూడా పేర్కొన్నారు. అయినా పీఆర్సీ నివేదిక ప్రకారం ఇంకా భర్తీ చేయాల్సినవి 1.90 లక్షల ఖాళీలుండటం గమనార్హం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో త్వరలో 50 వేల ఉద్యోగాలు అని చెప్పినా అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఎన్నికలప్పుడు మాత్రమే ఉద్యోగాల భర్తీ చేస్తామని ఓట్లు దండుకోవడం తప్ప టీఆర్ఎస్​ చేసిందేంలేదని నిరుద్యోగ యువత ప్రభుత్వంపై మండిపడుతోంది. తెలంగాణ గవర్నమెంట్​ ఇప్పటి వరకు ఎక్కువ మొత్తంలో కానిస్టేబుల్, ఎస్సై పోస్టులనే భర్తీ చేసింది. ఎగ్జిక్యూటివ్​స్థాయి పోస్టులను మాత్రం పట్టించుకోవడంలేదు. ఈ పోస్టులు భర్తీ చేస్తే ఆ ఉద్యోగితో పాటే సమాజం బాగుపడుతుందని నిరుద్యోగులు చెబుతున్నారు.



Next Story

Most Viewed