బాబ్బాబు.. ఈ ఒక్కసారికి వాట్సాప్ వాడుకోండి

73

దిశ,వెబ్‌డెస్క్:బాబ్బాబు అంటూ వాట్సాప్ యూజర్లను బ్రతిమలాడుకుంటుంది. ఈ ఒక్కసారి చూడండి. మేం తెచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ వల్ల మీకు ఎలాంటి నష్టం వాటిల్లదంటూ ప్రాధేయపడుతుంది. అంతేకాదు మీ వాట్సాప్ పర్సనల్ మెసేజ్ లు,ఫోటోలు, ఇన్ఫర్మేషన్ ను షేర్ చేయం. మీరు చేసే కాల్స్ కూడా మేం వినం. మీ కాంటాక్ట్ నెంబర్లను షేర్ చేయం’అంటూ నచ్చజెబుతోంది.

అప్పట్లో బ్రిటీష్ వాడు టీ ని అలవాటు చేసి దానికి మనల్ని బానిసలుగా మార్చేశాడు. వ్యాపారం పేరుతో మనల్నే ఆక్రమించేశాడు. ఇప్పుడు అదే విధంగా మార్క్ జూకర్ బెర్గ్ ఫేస్ బుక్, వాట్సాప్ ను అలవాటు చేశాడు. బానిసలుగా మార్చాడు. చివరకు మన సమాచారాన్ని మొత్తం వాడేసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో ఫేస్ బుక్ ఓ రారాజు. ఫేస్ బుక్ తో పాటు తన అనుబంధ అప్లికేషన్లు. వాట్సాప్, మెసెంజర్, ఇన్ స్టా గ్రామ్ గుత్తాదిపత్యం వహిస్తున్నాయి. ఫేస్ బుక్ నెలవారి యాక్టీవ్ యూజర్లు 270కోట్లకు పైమాటే. వాట్సాప్ కు 200కోట్లు, మెసెంజర్ కు 130కోట్లు, ఇన్ స్టాగ్రామ్ కు 100కోట్లమంది వినియోగదారులున్నారు. ఈ కొత్త ప్రైవసీ పాలసీతో యూజర్ల డేటాను అమ్ముకునేందుకు కుట్రలకు పాల్పడుతుంది.

నిజానికి ప్రైవసీ పాలసీకి అగ్రి అని చెప్పడం పెద్ద డ్రామ అనే చెప్పుకోవాలి. ఇప్పటికే మనడేటా అంతా కుప్పలు తెప్పులగా ఫేస్ బుక్ వాడి చేతిలో ఉంది. ఆ డేటాను అమ్ముకొని సొమ్ము చేసుకునేందుకు ఇప్పుడు ప్రైవసీ పాలసీని అప్ డేట్ చేశాం. ఒప్పుకోండి అని అడగడం… వాట్సాప్ కు భవిష్యత్ లో ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా ఉండేందుకేనని తెలుస్తోంది. ఒక్కసారి మీరు ప్రైవసీ పాలసీకి ఒప్పుకుంటే మీ డేటా అంతా ఫేస్ బుక్ కు వెళ్లిపోతుంది. ఈ అంశంపై యూజర్లు అనుమానం వ్యక్తం చేయడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది. తాము తెచ్చిన ప్రైవసీ పాలసీపై అనేక అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేస్తాం. కొత్త ప్రైవసీ పాలసీ మీ వ్యక్తిగత డేటాపై ఎలాంటి ప్రభావం పడబోదు’ అని వాట్సాప్ పేర్కొంది.