పవన్‌ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారిందా?

by  |
పవన్‌ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారిందా?
X

దిశ వెబ్‌డెస్క్: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే సామెత వినే ఉంటారు. ఇప్పుడు దాని గురించి ఎందుకు అనుకుంటున్నారా?.. రాజకీయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి అలాగే మారిపోయిందా?.. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దానికి కారణం బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడమేనంటున్నారు.

ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా ఇవాళ బంద్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చిన ఈ బంద్‌కు ఏపీ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష టీడీపీ, ఇతర రాజకీయ పక్షాలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నాయి. మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు, బ్యాంకులు, ప్రభుత్వం కార్యాలయాలన్నీ మూతపడనున్నాయి. ప్రస్తుతం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కానీ బీజేపీతో పొత్తులో ఉండటం వల్లన జనసేన మాత్రం ఈ బంద్‌కు మద్దతు ప్రకటించలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై పోరాటం చేస్తామని గతంలో ప్రకటించిన పవన్.. ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ అగ్రనేతలను కలిశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దని కోరారు.

కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నా.. పవన్ మాత్రం ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పిన పవన్.. ఇప్పుడు బంద్‌లో ఎందుకు పాల్గొనలేదని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీని పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని విమర్శిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి పవన్ అన్యాయం చేస్తున్నారని, రాష్ట్ర సమస్యల మీద గొంతెత్తడం లేదని రాజకీయ పక్షాలు చేస్తున్న విమర్శలు రాజకీయంగా జనసేనకు ఏపీలో మైనస్‌గా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవైపు చూస్తే.. బీజేపీతో పొత్తులో ఉండటం వల్లన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనసేన పోరాటం చేసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు చూస్తే.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే…. పవన్‌పై బీజేపీ ఒత్తిడి పెట్టే అవకాశముంది. ఇప్పటికీ ఇప్పుడు బీజేపీతో పొత్తు వదులుకుని జనసేన బయటికి వచ్చే అవకాశం లేదు. దీంతో పవన్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారిందనే చర్చ ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా జరుగుతోంది. మరి భవిష్యత్‌లో విశాఖ ప్రైవేటీకరణపై పవన్ ఎలాంటి పొలిటికల్ స్టాండ్ తీసుకుంటానేది వేచి చూడాలి.

Next Story

Most Viewed