మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ రెండు వేర్వేరా? భేదమేంటి?

by  |
miss wirld and miss univers
X

దిశ, ఫీచర్స్ : 21 ఏళ్ల తర్వాత 21 ఏళ్ల ఇండియన్.. 79 దేశాల సుందరీమణులను వెనక్కి నెట్టి ‘చక్ దే ఫట్టే’ అంటూ ‘విశ్వసుందరి’ కిరీటాన్ని చేజిక్కించుకుంది. అమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని, మరోసారి భారతదేశం గర్వపడేలా చేసిన ఆ పంజాబీ గుడియానే హర్నాజ్ సంధు. అయితే ఇక్కడే ఓ అంశం కొందరిని అయోమయంలో పడేసింది. సుష్మితా సేన్, లారాదత్తా, హర్నాజ్ సరే.. ‘ఐశ్వర్యరాయ్’ సంగతేంటి? ఆమె విశ్వసుందరి కాదా? అయితే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ రెండు వేరువేరా? ఒకటేనా? ఈ రెండింటికి తేడా ఏంటి? ఇవి కాకుండా అంతర్జాతీయ అందాల పోటీలు ఇంకేం ఉన్నాయి? వంటి విశేషాలు మీకోసం.

భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ -2021 టైటిల్ విన్నర్ కాగా, మిస్ వరల్డ్ కాంటెస్ట్ డిసెంబర్ 16న జరగబోతోంది. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ రెండు కూడా ‘బ్యూటీ కాంటెస్ట్’ పోటీలే. అయితే ఏ టైటిల్ పెద్దదో చెప్పలేం కానీ ఈ రెండింటి మధ్య కొన్ని వ్యత్యాసాలైతే ఉన్నాయి.

* మిస్ వరల్డ్ పోటీలు 1951, జూలైలో ప్రారంభం కాగా ఇదే పురాతన అంతర్జాతీయ అందాల పోటీగా పేరొందింది. దీని తర్వాత 1952 జూన్‌లో మిస్ యూనివర్స్ కాంటెస్ట్ మొదలైంది.

* మిస్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ లండన్ కాగా దీన్ని మిస్ వరల్డ్ లిమిటెడ్ ఆర్గనైజ్ చేస్తుంది. ఇది ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ద్వారా మానవతా సమస్యలను వాదిస్తుండగా, దీనికి జూలియా మోర్లే ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక మిస్ యూనివర్స్ విషయానికి వస్తే.. న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్‌గా ‘మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్’ ఈ పోటీలను నిర్వహిస్తుంది. మిస్ యూనివర్స్ మానవతా వాదాన్ని సమర్థిస్తూనే, ప్రపంచంలో సానుకూల మార్పులను తీసుకువచ్చే స్వరాన్ని వినిపిస్తుంది. పౌలా షుగర్ట్ దీనికి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

* స్వీడన్ దేశానికి చెందిన కికి హకన్సన్ తొలి మిస్ వరల్డ్‌ విజేతగా నిలవగా.. ఫిన్‌లాండ్‌కు చెందిన ఆర్మీ కుసేలా మొట్టమొదటి మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది.

*1966లో భారత్‌కు చెందిన రీటా ఫారియా ప్రపంచ సుందరిగా అవతరించింది. ఆ తర్వాత 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తా ముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ఈ అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఇక మిస్ యూనివర్స్‌ను 1994లో సుష్మితా సేన్, 2000లో లారా దత్తా, ప్రస్తుతం హర్నాజ్ సంధు(2021)లు గెలుచుకున్నారు.

ప్రతిష్టాత్మక పోటీలు :

ప్రపంచవ్యాప్తంగా ఏటా గణనీయ సంఖ్యలో అందాల పోటీలు జరుగుతాయి. అయితే గ్లోబల్ కవరేజ్ కారణంగా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ బ్యూటీ కాంటెస్ట్‌లను మాత్రమే అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తారు.

మిస్ ఇంటర్నేషనల్: టోక్యో ఆధారిత అంతర్జాతీయ అందాల పోటీ. ఇవి 1960లో ప్రారంభం కాగా, దీనిని ది ఇంటర్నేషనల్ కల్చర్ అసోసియేషన్ నిర్వహిస్తోంది. దీనిని ‘మిస్ ఇంటర్నేషనల్ బ్యూటీ’ అని కూడా అంటారు. మొదటి మిస్ ఇంటర్నేషనల్‌ కిరీటాన్ని కొలంబియాకు చెందిన స్టెల్లా మార్క్వెజ్ కైవసం చేసుకుంది.

మిస్ ఎర్త్: ఇది 2001లో తొలిసారిగా నిర్వహించిన వార్షిక అంతర్జాతీయ పర్యావరణ నేపథ్య అందాల పోటీ. మిస్ ఎర్త్ ఫౌండేషన్ ద్వారా ఫిలిప్పీన్‌కు చెందిన ‘కరౌసెల్ ప్రొడక్షన్స్’ ద్వారా ఈ పోటీలను నిర్వహిస్తుండగా, ఇవి పర్యావరణ అవగాహనను ప్రోత్సహిస్తాయి. డెన్మార్క్‌కి చెందిన కాథరినా స్వెన్సన్‌ మొదటి మిస్ ఎర్త్‌.

Next Story

Most Viewed