కేంద్రం ఇచ్చిన 1,400 వెంటిలేటర్లు ఏమైనయ్​?

by  |
కేంద్రం ఇచ్చిన 1,400 వెంటిలేటర్లు ఏమైనయ్​?
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడి గురించి ప్రభుత్వం చెబుతున్న మాటలు, కనిపిస్తున్న ఆచరణ పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. కేంద్ర వైద్య బృందాల మొదలు హైకోర్టు వరకు అనేక సందర్భాల్లో ప్రభుత్వం తీరు మీద విమర్శలు చేశాయి. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వివరణతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సందేహాస్పదంగా మారింది. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు 1,400 వెంటిలేటర్లను అందజేశామని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. మంత్రి ఈటల రాజేందర్ మాత్రం దాదాపు 750 వరకూ వచ్చి ఉండొచ్చు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం మాత్రం పాతవి, కొత్తవి కలిపి మొత్తం 1,117 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటోంది. ఇందులో ఏది నిజమో తెలియడం లేదు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, వెంటిలేటర్లు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు వచ్చాయో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించలేదు. స్వయంగా ఎన్ని కొనుగోలు చేసిందో తెలియదు. వివిధ కార్పొరేట్ సంస్థల నుంచి, ఎన్జీవోల నుంచి, వ్యక్తుల నుంచి విరాళంగా ఎన్ని వచ్చాయో తెలియదు. గాంధీ, ఛెస్ట్, ఉస్మానియా జనరల్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, మెడికల్ సిబ్బంది తమకు తగినంతగా పీపీఈ కిట్లు అందడం లేదని, నాణ్యత సరిగా లేదని, ప్లాస్టిక్ కవర్ తరహాలో ఉన్నాయని పదేపదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవసరాలకు తగినంతగా ఉన్నాయని మంత్రి, అధికారులు చెబున్నారు. గణాంకాలు మాత్రం వెలుగులోకి రావడం లేదు.

ఆర్టీఐ ద్వారా బహిర్గతం

రాష్ట్రానికి చెందిన జలగం సుధీర్ ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం కింద కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేశారు. వారు దీనికి సమాధానమిస్తూ, కేంద్రం నుంచి రాష్ట్రానికి జూలై 28వ తేదీ నాటికి 1,400 వెంటిలేటర్లు, 10.09 లక్షల ఎన్-95 మాస్కులు, 2.41 లక్షల పీపీఈ కిట్లు, 42.50 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు ఇచ్చామని వెల్లడించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ను పాత్రికేయులు మీడియా సమావేశంలో మంగళవారం ప్రశ్నించగా సుమారు 700-750 మధ్యలో వెంటిలేటర్లు వచ్చి ఉండొచ్చని బదులిచ్చారు. సరైన గణాంకాలు మాత్రం చెప్పలేదు. ప్రత్యేకంగా ఇవి కరోనా అవసరాల కోసం తయారుచేసిన మామూలు తరహా వెంటిలేటర్లేనని మంత్రి వ్యాఖ్యానించారు. అప్పటికే రాష్ట్రం దగ్గర సుమారు 240 వెంటిలేటర్లు ఉన్నట్లు గతంలో పలు మీడియా సమావేశాల్లో మంత్రి ఈటల, వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. రోజూ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ విడుదల చేస్తున్న బులెటిన్‌లో 1,117 వెంటిలేటర్లు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి 1,400 వెంటిలేటర్లు తెలంగాణకు వచ్చాయని తేలడం అనుమానాలకు తావిస్తోంది. పాత వెంటిలేటర్లు కూడా ఏమయ్యాయో అర్థం కావడం లేదు. కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం రాష్ట్రంలో రెండుసార్లు పర్యటించి కేంద్రం నుంచి రాష్ట్రానికి చేసిన సాయాన్ని ఏకరువు పెట్టారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం నుంచి వచ్చిన సాయాన్ని దాచిపెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.



Next Story

Most Viewed