‘టీకా ముడి సరుకులను పంపిస్తాం’

by  |
‘టీకా ముడి సరుకులను పంపిస్తాం’
X

న్యూఢిల్లీ: కరోనా ఆపత్కాలంలో భారత్‌ను ఆదుకోవడానికి సంసిద్ధమని అమెరికా తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో తయారవుతున్న కొవిషీల్డ్ టీకాకు అవసరమైన ముడిసరుకులను వెంటనే పంపించడానికి ఏర్పాట్లు చేస్తామని వివరించింది. భారత్‌కు ప్రస్తుతం అవసరమైన థెరపాటిక్స్, ర్యాపిడ్ డయగ్నస్టిక్ టెస్టు కిట్లు, వెంటిలేటర్లు, పీపీఈ సూట్లనూ గుర్తించామని, త్వరలోనే వాటిని పంపిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా భద్రత సలహాదారు భారత భద్రత సలహదారు అజిత్ దోవల్‌కు తెలియజేశారు. అంతేకాదు, ఆక్సిజన్, దాని ఉత్పత్తియంత్రాలనూ భారత్ అత్యంత వేగంగా అందించే మార్గాలను అన్వేషిస్తున్నట్టు వివరించారు. మహమ్మారి తొలుత అమెరికాలో విజృంభించినప్పుడు భారత్ తమ దేశానికి సహకరించిందని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు తాము సహకరిస్తామని తెలిపారు. కొవిషీల్డ్ టీకా ఉత్పత్తి అత్యంత కీలకమైన ముడి సరుకుల ఎగుమతులపై అమెరికా నిషేధం ఎత్తేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ఇటీవలే ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌కు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

యూకే నుంచి వెంటిలేటర్లు

భారత్‌కు వెంటిలేటర్లు, మెడికల్ డివైజ్‌లను పంపడానికి బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సహా సుమారు 600 మెడికల్ డివైజులను ఆదివారం పంపించింది. ఇవి ఢిల్లీకి మంగళవారం ఉదయానికల్లా చేరుతాయని బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో భారత్ సతమతమవుతున్న సందర్భంలో తాము ఆ దేశానికి భాగస్వామిగా మద్దతునిస్తున్నామని, ఈ పోరాటంలో అండగా నిలుస్తామని వివరించింది. ఈ ఆపత్కాలంలో భారత్‌తో దగ్గరగా కలిసి పనిచేస్తుందని, కరోనాపై పోరుకు అంతర్జాతీయవర్గానికి మద్దతుగా నిలవడానికి తాము సిద్ధమని స్పష్టం చేసింది.

Next Story

Most Viewed