మాకు నమ్మకం లేదు దొర.. ఢిల్లీని వీడుతున్న వలసకార్మికుల కన్నీటి గాథలు

by  |
Migrant workers
X

న్యూఢిల్లీ : రెండు భుజాలకు వేలాడుతున్న సంచులు.. సంకలో చంటి పిల్లాడు.. నెత్తి మీద మూట పెట్టుకుని వేసవికాలం ఎండలు ఠారెత్తిస్తున్నా.. ఎండ వేడిమికి డాంబర్ రోడ్లు సలసలకాగే నూనెలా బుసలు కక్కే వేడిని కురిపిస్తున్నా.. కాలికి చెప్పుల్లేకున్నా.. ఎలాగోలా ఇంటికి చేరితే అదే పదివేలు అన్న ఆశతో గతేడాది వలస కార్మికులు స్వగ్రామాలకు చేరిన కన్నీటి దృశ్యాలను దేశం ఎప్పటికీ మరిచిపోదు. పరిస్థితి కాస్త కుదుటపడుతుందన్న తరుణంలో గ్రామాల్లో పనులు దొరక్క మళ్లీ పట్టణాల బాట పట్టిన వలసజీవులను కరోనా సెకండ్ వేవ్ రెండోసారి దెబ్బ కొట్టింది. పాలకుల వైఫల్యమో, ప్రజల నిర్లక్ష్యమో గానీ ఈసారి దాని ఉధృతి గతేడాది కన్నా రెండు రెట్లు ఎక్కువే ఉంది. దీంతో ప్రభుత్వాలు తిరిగి ప్రజలను ఆంక్షల వలయంలోకి నెడుతున్నాయి.

 Migrant workers

ఇదే క్రమంలో సోమవారం ఢిల్లీ ప్రభుత్వం వారం రోజుల పాటు కర్ఫ్యూ విధించింది. ఏప్రిల్ 19 నుంచి 25 దాకా ఇది అమల్లో ఉండనుంది. ఇక తదుపరి సంకేతాలు మరోసారి కఠిన లాక్‌డౌన్ వైపే దారితీస్తాయని ఆందోళన చెందారో..! లేక ఇక్కడ ఆకలికి అలమటించడం కంటే స్వగ్రామానికి వెళ్లి కలో గంజో తాగుదామనుకున్నారో..! గానీ వలస కార్మికులు తిరిగి ఇంటి బాట పట్టారు. ఢిల్లీలో సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారం రోజుల కర్ఫ్యూ ప్రకటించగానే దేశ రాజధానిలో ఉన్న ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ తో పాటు రైల్వే స్టేషన్లు వలస కార్మికులతో కిక్కిరిసిపోయాయి. వలసకార్మికులను ఆదుకుంటామని, వాళ్లెవరూ ఢిల్లీని వీడొద్దని కేజ్రీవాల్ చేతులెత్తి వేడుకున్నా వలసజీవులు మాత్రం ఆయన మాటలు నమ్మలేదు. వారిని కదిలిస్తే కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. గతేడాది మాటమాత్రానికైనా చెప్పకుండా అప్రకటిత లాక్‌డౌన్ ప్రకటించిన మోడీ సర్కారైనా.. ప్రస్తుతం కర్ఫ్యూ విధించిన కేజ్రీవాల్ సర్కారైనా.. తమకు చేసిందేమీ లేదని వాళ్లు వాపోతున్నారు. ఏ ప్రభుత్వం మీదా తమకు నమ్మకం లేదని తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.

ఆ పరిస్థితులు మళ్లీ చూడలేం : శంకర్, బీహార్

లాక్‌డౌన్ కారణంగా మా నాన్న ఉపాధి కోల్పోయాడు. ఈ ఫ్రస్టేషన్‌లో నాన్న మా అమ్మను, నన్ను విపరీతంగా కొట్టేవాడు. ఢిల్లీలో కర్ఫ్యూను పొడిగిస్తే మా బతుకులు మరింత అధ్వాన్నమవుతాయి. గతేడాది లాక్‌డౌన్ వల్ల మేం ఇక్కడే ఉండి ఆకలితో అలమటించాం. ఆ పరిస్థితులను మేం మళ్లీ చూడాలనుకోవడం లేదు. అందుకే మేం బీహార్ వెళ్లిపోతున్నాం.

ఏ ప్రభుత్వమైనా మాకు నమ్మకం లేదయ్యా.. : రమేశ్ కుమార్, యూపీ

‘నేను రోజూవారీ కూలిని. పేయింటర్‌గా పనిచేస్తున్నాను. నాకు భార్య, ముగ్గురు పిల్లలు. నాకు పని ఇచ్చే ఓనర్ ఇప్పుడు పనుల్లేవ్, పరిస్థితులు చక్కబడేదాకా పనివ్వలేను అని చెప్పారు. గతేడాది మాదిరిగానే ప్రస్తుత కర్ఫ్యూనూ పొడిగిస్తారని మాకు తెలుసు. కానీ ఈసారి మేం వేచి చూడాలనుకోవడం లేదు. ఏ ప్రభుత్వం మీదా మాకు నమ్మకం లేదు. నాకు కొవిడ్ అంటే భయం లేదు. కానీ నా పిల్లలను ఆకలికి చంపుతానేమోననే ఆందోళనగా ఉంది. అందుకే నా సొంతూరు గొండా (యూపీ)కి వెళ్తున్నాను. ఇంతకుమించి నాకు వేరే ఆప్షన్ లేదు..’ అంటూ కన్నీరుమున్నీరయ్యాడు.

మా ఇంటికెళ్లి చచ్చిపోతా గానీ.. : మురళి, జార్ఖండ్

నేను ఢిల్లీలోని వారాంతపు మార్కెట్లలో సంచులు అమ్ముతూ జీవనం సాగిస్తు్న్నాను. కర్ఫ్యూ కారణంగా ఇప్పుడు నా ఉపాధి పోయింది. గతేడాది లాక్‌డౌన్ కారణంగా ఇంటికెళ్లి ఈ ఏడాది జనవరిలోనే తిరిగి వచ్చాం. కానీ ఇంతలోనే మళ్లీ ఈ దుస్థితి దాపురించింది. ఢిల్లీలో కరోనా వ్యాప్తి, ఆస్పత్రుల వద్ద క్యూలు, శ్మశానాల వద్ద పరిస్థితులు చూస్తుంటే భయంగా ఉంది. మా ఊరుకెళ్లి కుటుంబసభ్యుల ముందు చచ్చిపోయినా ఫర్వాలేదు గానీ ఇక్కడ దిక్కులేని చావు చావాలని లేదు.

Next Story

Most Viewed