- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మీకు ఎందుకు ఓటెయ్యాలి.. ప్రభుత్వం తీరుతో విసిగిపోయాం..
దిశ, తెలంగాణ బ్యూరో :
“ఆపదలో ఆదుకునేది మేమే.. మా ప్రాణాలతో పేషెంట్లకు పునర్జన్మనిస్తాం.. ఎంతోమంది మా సేవలందుకున్నారు.. కరోనా టైమ్‌లో మా విలువెంతో ప్రభుత్వాలకు తెలిసొచ్చింది.. కానీ మాకు గుర్తింపూ లేదు.. మా సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధీ ప్రభుత్వానికి లేదు.. ఏళ్ళు గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి.. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు.. అందుకే ఇప్పుడు ప్రభుత్వానికి మా సత్తా చాటాలనుకుంటున్నాం.. కనీసం కనువిప్పు కలిగించాలనుకుంటున్నాం..” అందుకే నర్సుల ప్రతినిధిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని నర్సింగ్ ప్రొఫెసర్ రాజేశ్వరి అన్నారు. ఆమె ’దిశ‘కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
దిశ: పోటీ చేయాలన్న ఆలోచనకు కారణమేంటి? గెలిస్తే ఏం చేస్తారు.
రాజేశ్వరి : సమాజంలో నర్సుల విలువ ప్రభుత్వానికి తెలియందేమీ కాదు. సమస్యలకు తగిన పరిష్కారం లేనందువల్లనే ప్రభుత్వం గుర్తించేలా నర్సుల అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నర్సుల తరఫున ఇప్పటివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ పోటీచేయలేదనుకుంటున్నా. ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిస్తే వాటిపై గొంతెత్తి ప్రభుత్వం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తాను.
మీ బలమేంటి? గెలుస్తారన్న నమ్మకం ఉందా?
నర్సులు, వైద్య సిబ్బందే నా బలం. నేను పోటీ చేస్తున్ననియోజకవర్గంలో దాదాపు నలభై వేల మంది నర్సులు ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకున్నారు. వారంతా నాకే మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో నర్సులంతా నా వెనకే ఉన్నారు. వారి సూచన మేరకే పోటీలోకి దిగాను. కేవలం వారి ఓట్లతోనే గెలుపు సాధ్యం కాదు. కానీ వీరి కుటుంబ సభ్యులు, బంధువులు, వారి సన్నిహితుల ఓట్లు కూడా వేయిస్తామని చాలా ధీమాగా చెప్పారు. పడతాయనే అనుకుంటున్నాను. నేను గెలవలేకపోయినా నా వెనక ఎంత మంది ఉన్నారో, మా ఐక్యత ఎంతో తెలిసిపోతుంది. నాకు పడిన ఓట్లతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందనే తృప్తి మిగులుతుంది.
నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి?
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఒక్క నర్సింగ్ స్కూలు, కాలేజీ కూడా కొత్తగా రాలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న ఆరు నర్సింగ్ కాలేజీల్లో మూడింటికి ప్రిన్సిపాళ్ళు కూడా లేరు. బోధనా సిబ్బంది లేరు. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. కొత్తగా నర్సుల్లో చేరడానికి అవకాశాలు కూడా లేవు. ఏఎన్ఎం లాంటి శిక్షణ పూర్తిచేసుకున్నవారికి సర్టిఫికెట్లు ఇవ్వడానికి నెలలు, సంవత్సరాలు పడుతున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య విధాన పరిషత్‌లో వేల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదు. కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు జరుగుతున్నాయి. సరైన వేతనం సకాలంలో ఇవ్వట్లేదు. ఔట్‌సోర్సింగ్ నర్సులకు అటు వేతనం లేదు.. ఇటు ఉద్యోగ భద్రత లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ. 20 వేల కనీస జీతం ఇవ్వాలి. ప్రైవేటు ఆస్పత్రులు ఇవ్వవు.. ప్రభుత్వం పట్టించుకోదు.
నర్సింగ్ డైరెక్టరేట్‌కు చెప్పుకోవచ్చు కదా!
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2017లోనే నర్సింగ్ డైరెక్టరేట్‌ను నెలకొల్పుతానని హామీ ఇచ్చారు. నాలుగేళ్లయింది. అతీగతి లేదు. వైద్య విద్య డైరెక్టరే కొనసాగుతున్నారు. నర్సులకు చెందిన క్లినికల్, ఎడ్యుకేషన్, ప్రజారోగ్య శాఖలకు డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిల్లో నర్సులకు సంబంధించినవారే ఉండాలి. కానీ గ్రూప్-1 ఆఫీసర్ కొనసాగుతున్నారు. వారికి మా సమస్యలపై కనీస అవగాహన కూడా ఉండదు. నర్సింగ్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్దామంటే ఇప్పటివరకు ఎన్నికలే జరగలేదు. కొత్తగా కోర్సు పూర్తిచేసిన నర్సులకు సర్టిఫికెట్ తీసుకోడానికి కూడా నెలలు, సంవత్సరాలు పడుతోంది. అన్ని స్థాయిల్లోనూ నిర్లక్ష్యమే.
ఖరీదైన ఎన్నికల్లో తట్టుకోగలరా?
నాకు ఆర్థిక బలం లేదు. రాజకీయ పలుకుబడి లేదు. ఏ పార్టీ సపోర్టు లేదు. పోటీ చేయాలనుకునే ముందే ఇవన్నీ ఆలోచించుకున్నాను. ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చు గురించి ఆలోచించాను. ఓట్లు కొనుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో పనిచేస్తున్న నర్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులే నాకు ఓటు బ్యాంకు. నైతికంగా నాకు లభిస్తున్న మద్దతే నా బలం. వారి అండతోనే జిల్లాలు తిరిగి ప్రచారం చేసుకుంటున్నాను.
పోటీ ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?
తప్పకుండా గెలుస్తాననే నమ్మకం ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని నర్సులు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు పడే ఓట్లతోనైనా ముఖ్యమంత్రికి, మంత్రులకు, అధికారులకు తెలుస్తుంది. మా కమ్యూనిటీ ఎంత బలమైనదో ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇంతకాలం జరిగిన నిర్లక్ష్యం ఎలా ఉన్నా ఇకపైన సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తుందనుకుంటున్నాను. మొత్తం నర్సింగ్ కమ్యూనిటీ న్యాయం జరిగితే అదే చాలు.