స్పెక్ట్రమ్ చెల్లింపుల వాయిదాకు వొడాఫోన్ ఐడియా బోర్డు ఆమోదం

by  |
vi122
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం రంగాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు కేంద్రం ప్రకటించిన నాలుగేళ్ల స్పెక్ట్రమ్ చెల్లింపుల(ఏజీఆర్ బకాయి) మారటోరియంను ఉపయోగించుకోనున్నట్టు వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. ఈ మేరకు తమ సంస్థ బోర్డు ఆమోదం తెలిపిందని వొడాఫోన్ ఐడియా బుధవారం ప్రకటించింది. ‘2021, అక్టోబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు నాలుగేళ్ల కాలానికి స్పెక్ట్రమ్ వేలం బకాయిలను వాయిదా వేసేందుకు బోర్డు నిర్ణయించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా టెలికాం విభాగం ఇచ్చిన ఆప్షన్ల గురించి సైతం కంపెనీ బోర్డు డైరెక్టర్లు పరిశీలిస్తారని కంపెనీ వివరించింది. టెలికాం రంగంలో ఇటీవల ప్రకటించిన సంస్కరణలకు సంబంధించి ప్రభుత్వం గతవారంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సహా టెలికాం కంపెనీలకు ప్రభుత్వం లేఖ పంపింది. నాలుగేళ్ల ఏజీఆర్ బకాయిల మారటోరియంను ఎంచుకునే ఉద్దేశం ఉంటే అక్టోబర్ 29లోపు స్పష్టత ఇవ్వాలని లేఖలో పేర్కొంది. అలాగే, మారటోరియం కాలంలో వర్తించే వడ్డీని వడ్డీ రూపంలోకి మార్చేందుకు సంబంధించిన అభిప్రాయాలను 90 రోజుల్లోగా చెప్పాలని ప్రభుత్వం లేఖలో కోరింది. కాగా, బుధవారం వొడాఫోన్ ఐడియా ప్రకటనతో స్టాక్ మార్కెట్లలో కంపెనీ షేర్ ధర 7 శాతం పెరిగి రూ. 10.70 వద్ద ట్రేడయింది.

Next Story

Most Viewed