వైజాగ్‌ వాటర్ డీ-శాలినేషన్ సెంటర్ కాబోతోందా?

by  |
వైజాగ్‌ వాటర్ డీ-శాలినేషన్ సెంటర్ కాబోతోందా?
X

సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖపట్టణం నీటి కొరతను అధిగమించనుందా? ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పరిశ్రమలకు సముద్రపు నీటిని వినియోగించనున్నారా? మంచినీరు వృధా చేయకుండా..సముద్రపు నీటిని వినియోగించే సరికొత్త పారిశ్రామిక విధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందా?… భారతదేశంలోని తొలి డీ-శాలినేషన్ సెంటర్‌గా వైజాగ్ రూపొందనుందా? అంటే అవుననే రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

ఇంతకీ ఈ డీ-శాలినేషన్ అంటే ఏంటి?.. సముద్రపు నీటి నుంచి ఉప్పును వేరు చేయడమే డీ-శాలినేషన్. సముద్రం అడుగున నీటి ఒరవడి లేని ప్రదేశంలో పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి నీటిని అత్యధిక సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా నీటిని తోడుతారు. అలా తోడిన నీటిని భూ ఉపరితలంపై ఏర్పాటు చేసే పెద్ద ట్యాంకులలో నింపుతారు. ఈ ట్యాంకుల్లో మట్టి, రాళ్లు, గులకరాళ్లు, చిట్టి సున్నపురాళ్లు, నదీతీరాల్లో దొరికే బండ ఇసుక, సున్నితమైన ఇసుక, రాళ్లు వంటి పొరలు ఏర్పాటు చేస్తారు.

ఈ పొరల ద్వారా వేగంగా వచ్చే నీరు ఆ ట్యాంకుల్లో చేరుతుంది. ఈ క్రమంలో నీరు కొంత శుభ్రమవుతుంది. ట్యాంకుల్లో చేరిన తరువాత మరికొన్ని పొరల ద్వారా ఆ నీరు మరికొంత శుధ్దీకరించబడుతుంది. అక్కడి నుంచి మరింత వేగవంతమైన సామర్థ్యం గల పంపులతో నీటిని పంపింగ్ చేస్తారు. ఇక్కడ ఆ సముద్రపు నీరు మరింత శుద్ధీకరించబడుతుంది. దానిని శుద్ధీకరించే ఫిల్టర్ల ద్వారా మరో ట్యాంకులోకి తోడుతారు. అక్కడి నుంచి మరోసారి శుద్ధి చేసి సరఫరా చేస్తారు. ఈ ప్రక్రియను డీ-శాలినేషన్ అంటారు.

ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఇజ్రాయెల్ వినియోగిస్తోంది. ఎడారి దేశమైన ఇజ్రాయెల్‌లో నీటి వనరులు చాలా తక్కువ. గలీలయ సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే కాస్తో కూస్తో నీరు దొరుకుతుంది. అక్కడ కూడా వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని వినియోగించుకోవడమే సంప్రదాయంగా మారింది. ఈ నేపథ్యంలో డీ-శాలినేషన్ ప్రక్రియ ద్వారా నీటిని వినియోగించి ఒక శాస్త్రవేత్త తన వ్యవసాయ భూమిని సస్యశ్యామలం చేశాడు. దీంతో ఆ పరిజ్ఞానాన్ని దేశవ్యాప్తం చేశాడు. ఆదేశంలో ప్రధాన సముద్రమైన మెరిడియన్ సముద్ర ప్రాంతంలో నీటి శుద్ధి కర్మాగారాలను ఇజ్రాయెల్ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఆ నీటిని సరఫరా చేస్తోంది. దీంతో ఆ ఎడారి దేశం మంచి నీటి కొరతను అధిగమించింది.

అలా సరఫరా చేసిన నీటిని డ్రిప్ ఇరిగేషన్ విధానంలో వినియోగించుకుంటూ వ్యవసాయం చేస్తూ లాభాలార్జిస్తోంది. రుగాండా, ఉగాండా వంటి ఆఫ్రికా దేశాలతో పాటు.. మధ్య ఆసియా దేశాల్లోని శరణార్థి శిబిరాలకు కూడా ఇజ్రాయెల్ ఈ నీటినే సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఈ టెక్నాలజీని మరో 32 దేశాలకు పరిచయం చేసింది. ఈ పరిజ్ఞానం ద్వారానే ఆయా దేశాలు నీటి కొరతను అధిగమిస్తున్నాయి. పలు దేశాలు తాగునీటికి కూడా ఈ డీ-శాలినేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేయబడిన నీటినే వినియోగించడం విశేషం.

ఈ ప్రక్రియ ద్వారానే ఆంధ్రప్రదేశ్ నీటి కొరతను ఎదుర్కొనబోతోంది. ఈ విధానం ద్వారా శుద్ధి చేసిన నీటిని బంగాళాఖాతం తీరంలోని పారిశ్రామిక వాడలన్నింటికీ సరఫరా చేయనున్నారు. డీ-శాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం చూడడంతో పాటు దానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిశ్రమలకు డీ-శాలినేషన్ వాటర్ వినియోగించడం ద్వారా మంచినీటి కొరతను అధిగమించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా పరిశ్రమలకు సరఫరా చేసే నీరు రిజర్వాయర్లలో ఉండడం వల్ల నీటి ఎద్దడి అన్నమాటే తలెత్తదని సీఎం అంచనావేస్తున్నారు.

వైజాగ్‌లో డీ-శాలినేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తే భారతదేశంలో తొట్టతొలి ఈ విధానం ద్వారా నీటిని ఉత్పత్తి చేసే తొలి రాష్ట్రంగా ఏపీ, పట్టణంగా విశాఖపట్టణం రికార్డులకెక్కుతాయి. అంతే కాకుండా ఈ విధానం ద్వారా శుద్ధి చేసిన నీరు అందుబాటులోకి వస్తే అత్యాధునిక పద్దతుల్లో వ్యవసాయ విధానాలు రూపొందించడం ద్వారా కూరగాయల కొరతను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.



Next Story

Most Viewed