కరోనా లెక్కలు ఎలా దాస్తాం?: కలెక్టర్

by  |
కరోనా లెక్కలు ఎలా దాస్తాం?: కలెక్టర్
X

విశాఖపట్టణంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్యను తగ్గంచి చెబుతున్నారన్న విపక్షాల వ్యాఖ్యలను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఖండించారు. విపక్షాల ఆరోపణలు అవాస్తవాలని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్న ఆరోపణలకు కరోనాను వాడుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు.

దేశంలోని కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లు అన్నీ ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని కలెక్టర్ వెల్లడించారు. ఆ డేటాను నేరుగా ఆన్‌లైన్లోనే అప్‌లోడ్ చేస్తున్నారని ఆయన వివరించారు. అలాంటి పరిస్థితుల్లో లెక్కలు తగ్గించి చెప్పడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. విశాఖతో పాటు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల పరిధిలో లాక్‌డౌన్ యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

విశాఖట్టణంలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటీవ్ కేసు నమోదయ్యాయని వెల్లడించిన ఆయన, ఐసోలేషన్‌లో ప్రస్తుతం నలుగురున్నారని చెప్పారు. కరోనా బారి నుంచి కోలుకున్న 17 మందిని డిశ్చార్జ్ చేశామన్నారు. విశాఖ జిల్లాకు 18వేల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయని ఆయన తెలిపారు.

కరోనా అనుమానితులను ఐదు కేటగిరులుగా విభజించి ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తున్నామని ఆయన తెలిపారు. విశాఖ జిల్లాలో నాలుగో దశ సర్వే కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ వారంతానికి ఈ సర్వే వివరాలు అందుతాయని ఆయన తెలిపారు. గతంలో పాజిటివ్ వచ్చిన వారితో దగ్గరి సంబంధాలు ఉన్న వారందరినీ, అలాగే విదేశాల నుంచి వచ్చిన వారికి కూడా మరోసారి కరోనా పరీక్షలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
tags: coronavirus, ap, visakhapatnam, collector, vinay bhaskar

Next Story

Most Viewed